సుడిగండాల్లో సుగర్స్
- ఘోరంగా పడిపోయిన చక్కెర ధరలు
- పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల్లో ఫ్యాక్టరీలు
- గిట్టుబాటు దర లేక అప్పుల్లో చె రకు రైతులు
- సంక్షోభంతో యాజమాన్యాలు, అన్నదాతల ఆందోళన
చోడవరం,న్యూస్‌లైన్: అందరికీ మధురమైన చక్కెర రైతన్నకు, సుగర్స్ యాజమాన్యాలకు మాత్రం చేదు అనుభవాలను మిగులుస్తోంది. రైతులకైతే.. చెరకు పేరెత్తితేనే భయపడే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని సహకార కర్మాగారాల యాజమాన్యాలకూ చక్కెరతో సమస్యలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యం పర్యవసానంగా ఉభయ వర్గాలకూ ఇక్కట్లు అనివార్యమనిపిస్తోంది. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చెరకు పండించలేమని రైతులు చేతులెత్తేస్తుంటే, పంచదార ధర ఘోరంగా పడిపోయి ఫ్యాక్టరీలన్నీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఇతర రాష్ట్రాల్లోని సహకార చక్కెర కర్మాగారాలు కాలానికనుగుణంగా ఆధునికీకరణతో మంచి రికవరీ సాధించి రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం చేయూత లేకపోవడంతో రైతులు, యాజమాన్యాలు నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి .
సహకార రంగంలో జిల్లాలో చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెంతనే భీమసింగి కర్మాగారం ఉంది. అంతర్జాతీయ బెల్లం మార్కెట్ కూడా అనకాపల్లిలోనే ఉండడంతో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. కానీ విదేశీ పంచదార ముంచెత్తడంతో ఇక్కడి చక్కెరకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా క్వింటాల్ పంచదార రూ. 2600కు పడిపోయింది. దాంతో జిల్లాలోని ఫ్యాక్టరీల్లో లక్షలాది క్వింటాళ్ల పంచదార పేరుకుపోయింది. ఈ ఏడాది అనకాపల్లి ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రశ్నార్థంగా మారగా, తాండవ, భీమసింగి ఫ్యాక్టరీలు పీకల లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. ఫర్వాలేదనుకున్న చోడవరం, ఏటికొప్పాక ఫ్యాక్టరీల పరిస్థితి కూడా ఇప్పుడు ప్రమాదకరంగా ఉంది.
ప్రభుత్వం నయవంచన
2011-12 సీజన్‌లో రూ. 50 కోట్లు ప్రభుత్వం ఇచ్చి కొంత ఆదుకున్నప్పటికీ రెండు సీజన్ల నుంచి ఒక్క పైసా కూడా ఫ్యాక్టరీలకు ఇవ్వలేదు. మరోవైపున ఎరువులు, విత్తనాల రేట్లు, కూలి ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ఎకరా భూమిలో చెరకు పండించేందుకు సుమారు రూ. 50 వేలకు పైబడి ఖర్చవుతోంది. గత మూడేళ్లలో వరదలతో ఎకరాకు 15-20 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యాక్టరీలు టన్నుకు రూ. 1800 నుంచి 2000 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లించాయి. మరో పక్క బెల్లం ధరలు కూడా బాగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో చెరకు పంట వేయకపోవడమే మంచిదని రైతులు అంటున్నారు.
బాబు పుణ్య ఫలితం..
చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు ఫ్యాక్టరీలను నిర్లక్ష్యం చేయడం వల్లే చెరకు రైతులకు, సుగర్ ఫ్యాక్టరీలకు ఇప్పుడీ దుస్థితి దాపురించిందన్నది విస్పష్టం. తర్వాత మహానేత వైఎస్ ఆదుకున్నా, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విస్మరించడంతో ఫ్యాక్టరీలతోపాటు చెరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ. 500 కోట్లు ఇస్తే ఫ్యాక్టరీలు బాగుపడతాయని ఎపిట్‌కో కమిటీ సిఫార్సు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు కలవరపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఫ్యాక్టరీలు మూతపడతాయని, సాగు కనుమరుగవుతుందని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.