government ignored
-
శిఖరవీరుడికిచ్చే గౌరవమిదా?
► మల్లి మస్తాన్‌బాబు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ► కుటుంబానికి వివాదాస్పద భూమి కేటాయింపు ► కోర్టుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ► అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు సంగం: జాతీయ జెండాను ప్రపంచంలోని అతి క్లిష్టమైన పర్వతాలపై రెపరెపలాడించి భారత కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్‌బాబును గుర్తించడంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిసారి తప్పులు చేస్తూనే వస్తుంది. మస్తాన్‌బాబు అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రప్రభుత్వ ప్రతిని ధులు ఆయన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీల వర్షం కురిపించారు. అంత్యక్రియల అనంతరం హామీలను వదిలేశారు. మల్లి మస్తాన్‌బాబు వర్ధంతికి సైతం రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రతినిధి హాజరుకాకపోగా జిల్లాస్థాయి అధికారులు కూడా రాలే దు. అలాగే మస్తాన్‌బాబు కుటుంబానికి ఐదెకరాల వ్యవసాయభూమి ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రుల మాటలు నీటిమూటలయ్యాయి. సంగం మండలంలోని పడమటిపాళెం సమీపంలో రెండెకరాల ఇసుక దిబ్బలను ప్రభుత్వం మస్తాన్‌బాబు కుటుంబానికి ఇచ్చింది. ఆ ఇసుక దిబ్బలు సైతం వివాదంలో ఉన్నా యి. వివాదాస్పద భూమిని మల్లి మస్తాన్‌బాబు కుటుంబానికి ఇచ్చి ఆ అమర సాహసవీరుడికి రాష్ట్రప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చేసింది. వివరాల్లోకెళితే పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి తర్వా త అంత్యక్రియలకు మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, శిద్దా రాఘవరావులు హాజరై ఐదు ఎకరాల భూమిని ఇస్తామని, మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని, మస్తాన్‌బాబు విగ్రహాలను సంగం, గాంధీజనసంఘంలో ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఇదేకాక మస్తాన్‌బాబు అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని సృ్మతివనంగా చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అంత్యక్రియల తర్వాత ఎవరూ ఈ హామీలను పట్టించుకోలేదు. వర్ధంతి వస్తుందని హడావుడిగా రెండెకరాల పొలాన్ని మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు ఇస్తున్నట్లు ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీరమణ గాంధీజనసంఘం సభలో ప్రకటించారు. అప్పట్లో రెండు ఎకరాలు ఇవ్వటమేంటని మల్లి సుబ్బమ్మ అధికారులను నిలదీశారు. జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లి సుబ్బమ్మకు పడమటిపాళెం గ్రామానికి చెందిన సర్వే నెం.551-1లో రెండెకరాల పొలాన్ని పట్టా రూపంలో అందజేశారు. అయితే ఈ పొలం తమకు చెందుతుందంటూ పడమటిపాళెంకు చెందిన పి శ్రీయుతమ్మ, ఆమె అత్త శ్రీనివాసమ్మలు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం మస్తాన్‌బాబు విషయంలో ప్రతిసారి నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు, మల్లి మస్తాన్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ పాపమే ఇలా చుట్టుకుంది ఆ రెండెకరాలు వివాదాస్పదం కావడానికి కారణం గతంలో రెవెన్యూ అధికారులు చేసిన పాపమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నం.551-1లో 1904లో పొలాన్ని ఇనగంటి పోలిరెడ్డి పేరున ఉంది. తదనంతరం పెన్నానదికి వచ్చిన వరదల వల్ల ఈ పొలాలు మొత్తం ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. తన భూములు ఇసుక దిబ్బలు అయ్యాయని, పనికిరాని ఇస్తిఫా భూములు కింద పోలిరెడ్డి 1936లో బ్రిటీష్ ప్రభుత్వానికి ఇచ్చి వేశారు. అప్పటినుంచి ఆ భూములు అనాధీనంగానే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. భారతప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డులను చేతితో రాసే సంప్రదాయాన్ని ఆ గ్రామంలోని కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2007లో అప్పటి తహసీల్దారు ఈ భూములు శ్రీయుతమ్మ, శ్రీనివాసమ్మ పేర్లతో ఉన్నట్లు పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చారు. డైగ్లాట్‌లో వీరి పేరు లేక ఈనాం భూముల పేరుతో ఉండటంతో టైటిల్‌డీడ్‌ను అప్పటి కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ భూములు తమవేనంటూ ఇద్దరు మహిళలు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారుల అవినీతి వల్లే ఇలా జరిగిందని, వెంటనే మల్లి మస్తాన్‌బాబు కుటుంబాన్ని గౌరవించి వివాదాస్పదం లేకుండా పొలాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
సుడిగండాల్లో సుగర్స్
ఘోరంగా పడిపోయిన చక్కెర ధరలు పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల్లో ఫ్యాక్టరీలు గిట్టుబాటు దర లేక అప్పుల్లో చె రకు రైతులు సంక్షోభంతో యాజమాన్యాలు, అన్నదాతల ఆందోళన చోడవరం,న్యూస్‌లైన్: అందరికీ మధురమైన చక్కెర రైతన్నకు, సుగర్స్ యాజమాన్యాలకు మాత్రం చేదు అనుభవాలను మిగులుస్తోంది. రైతులకైతే.. చెరకు పేరెత్తితేనే భయపడే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని సహకార కర్మాగారాల యాజమాన్యాలకూ చక్కెరతో సమస్యలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యం పర్యవసానంగా ఉభయ వర్గాలకూ ఇక్కట్లు అనివార్యమనిపిస్తోంది. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చెరకు పండించలేమని రైతులు చేతులెత్తేస్తుంటే, పంచదార ధర ఘోరంగా పడిపోయి ఫ్యాక్టరీలన్నీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని సహకార చక్కెర కర్మాగారాలు కాలానికనుగుణంగా ఆధునికీకరణతో మంచి రికవరీ సాధించి రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం చేయూత లేకపోవడంతో రైతులు, యాజమాన్యాలు నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి . సహకార రంగంలో జిల్లాలో చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెంతనే భీమసింగి కర్మాగారం ఉంది. అంతర్జాతీయ బెల్లం మార్కెట్ కూడా అనకాపల్లిలోనే ఉండడంతో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. కానీ విదేశీ పంచదార ముంచెత్తడంతో ఇక్కడి చక్కెరకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా క్వింటాల్ పంచదార రూ. 2600కు పడిపోయింది. దాంతో జిల్లాలోని ఫ్యాక్టరీల్లో లక్షలాది క్వింటాళ్ల పంచదార పేరుకుపోయింది. ఈ ఏడాది అనకాపల్లి ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రశ్నార్థంగా మారగా, తాండవ, భీమసింగి ఫ్యాక్టరీలు పీకల లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. ఫర్వాలేదనుకున్న చోడవరం, ఏటికొప్పాక ఫ్యాక్టరీల పరిస్థితి కూడా ఇప్పుడు ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం నయవంచన 2011-12 సీజన్లో రూ. 50 కోట్లు ప్రభుత్వం ఇచ్చి కొంత ఆదుకున్నప్పటికీ రెండు సీజన్ల నుంచి ఒక్క పైసా కూడా ఫ్యాక్టరీలకు ఇవ్వలేదు. మరోవైపున ఎరువులు, విత్తనాల రేట్లు, కూలి ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ఎకరా భూమిలో చెరకు పండించేందుకు సుమారు రూ. 50 వేలకు పైబడి ఖర్చవుతోంది. గత మూడేళ్లలో వరదలతో ఎకరాకు 15-20 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యాక్టరీలు టన్నుకు రూ. 1800 నుంచి 2000 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లించాయి. మరో పక్క బెల్లం ధరలు కూడా బాగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో చెరకు పంట వేయకపోవడమే మంచిదని రైతులు అంటున్నారు. బాబు పుణ్య ఫలితం.. చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు ఫ్యాక్టరీలను నిర్లక్ష్యం చేయడం వల్లే చెరకు రైతులకు, సుగర్ ఫ్యాక్టరీలకు ఇప్పుడీ దుస్థితి దాపురించిందన్నది విస్పష్టం. తర్వాత మహానేత వైఎస్ ఆదుకున్నా, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విస్మరించడంతో ఫ్యాక్టరీలతోపాటు చెరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ. 500 కోట్లు ఇస్తే ఫ్యాక్టరీలు బాగుపడతాయని ఎపిట్కో కమిటీ సిఫార్సు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు కలవరపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఫ్యాక్టరీలు మూతపడతాయని, సాగు కనుమరుగవుతుందని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.