శిఖరవీరుడికిచ్చే గౌరవమిదా? | Malli Mastanbabu to the government neglect | Sakshi
Sakshi News home page

శిఖరవీరుడికిచ్చే గౌరవమిదా?

Published Thu, Apr 21 2016 4:53 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

శిఖరవీరుడికిచ్చే  గౌరవమిదా?

శిఖరవీరుడికిచ్చే గౌరవమిదా?

మల్లి మస్తాన్‌బాబు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
కుటుంబానికి వివాదాస్పద భూమి కేటాయింపు
కోర్టుకు వెళ్లిన ఇద్దరు మహిళలు
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు

 
సంగం: జాతీయ జెండాను ప్రపంచంలోని అతి క్లిష్టమైన పర్వతాలపై రెపరెపలాడించి భారత కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్‌బాబును గుర్తించడంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిసారి తప్పులు చేస్తూనే వస్తుంది. మస్తాన్‌బాబు అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రప్రభుత్వ ప్రతిని ధులు ఆయన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీల వర్షం కురిపించారు. అంత్యక్రియల అనంతరం హామీలను వదిలేశారు. మల్లి మస్తాన్‌బాబు వర్ధంతికి సైతం రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రతినిధి హాజరుకాకపోగా జిల్లాస్థాయి అధికారులు కూడా రాలే దు. అలాగే మస్తాన్‌బాబు కుటుంబానికి ఐదెకరాల వ్యవసాయభూమి ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రుల మాటలు నీటిమూటలయ్యాయి.

సంగం మండలంలోని పడమటిపాళెం సమీపంలో రెండెకరాల ఇసుక దిబ్బలను ప్రభుత్వం మస్తాన్‌బాబు కుటుంబానికి ఇచ్చింది. ఆ ఇసుక దిబ్బలు సైతం వివాదంలో ఉన్నా యి. వివాదాస్పద భూమిని మల్లి మస్తాన్‌బాబు కుటుంబానికి ఇచ్చి ఆ అమర సాహసవీరుడికి రాష్ట్రప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చేసింది. వివరాల్లోకెళితే పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి తర్వా త అంత్యక్రియలకు మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, శిద్దా రాఘవరావులు హాజరై ఐదు ఎకరాల భూమిని ఇస్తామని, మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని, మస్తాన్‌బాబు విగ్రహాలను సంగం, గాంధీజనసంఘంలో ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.

ఇదేకాక మస్తాన్‌బాబు అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని సృ్మతివనంగా చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అంత్యక్రియల తర్వాత ఎవరూ ఈ హామీలను పట్టించుకోలేదు. వర్ధంతి వస్తుందని హడావుడిగా రెండెకరాల పొలాన్ని మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు ఇస్తున్నట్లు ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీరమణ గాంధీజనసంఘం సభలో ప్రకటించారు. అప్పట్లో రెండు ఎకరాలు ఇవ్వటమేంటని మల్లి సుబ్బమ్మ అధికారులను నిలదీశారు. జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లి సుబ్బమ్మకు పడమటిపాళెం గ్రామానికి చెందిన సర్వే నెం.551-1లో రెండెకరాల పొలాన్ని పట్టా రూపంలో అందజేశారు. అయితే ఈ పొలం తమకు చెందుతుందంటూ పడమటిపాళెంకు చెందిన పి శ్రీయుతమ్మ, ఆమె అత్త శ్రీనివాసమ్మలు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం మస్తాన్‌బాబు విషయంలో ప్రతిసారి నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు, మల్లి మస్తాన్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 రెవెన్యూ పాపమే ఇలా చుట్టుకుంది
 ఆ రెండెకరాలు వివాదాస్పదం కావడానికి కారణం గతంలో రెవెన్యూ అధికారులు చేసిన పాపమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నం.551-1లో 1904లో పొలాన్ని ఇనగంటి పోలిరెడ్డి పేరున ఉంది. తదనంతరం పెన్నానదికి వచ్చిన వరదల వల్ల ఈ పొలాలు మొత్తం ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. తన భూములు ఇసుక దిబ్బలు అయ్యాయని, పనికిరాని ఇస్తిఫా భూములు కింద పోలిరెడ్డి 1936లో బ్రిటీష్ ప్రభుత్వానికి ఇచ్చి వేశారు. అప్పటినుంచి ఆ భూములు అనాధీనంగానే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. భారతప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డులను చేతితో రాసే సంప్రదాయాన్ని ఆ గ్రామంలోని కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

2007లో అప్పటి తహసీల్దారు ఈ భూములు శ్రీయుతమ్మ, శ్రీనివాసమ్మ పేర్లతో ఉన్నట్లు పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చారు. డైగ్లాట్‌లో వీరి పేరు లేక  ఈనాం భూముల పేరుతో ఉండటంతో టైటిల్‌డీడ్‌ను అప్పటి కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ భూములు తమవేనంటూ ఇద్దరు మహిళలు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారుల అవినీతి వల్లే ఇలా జరిగిందని, వెంటనే మల్లి మస్తాన్‌బాబు కుటుంబాన్ని గౌరవించి వివాదాస్పదం లేకుండా పొలాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement