సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయ నిర్మాణం నిమిత్తం రెండెకరాల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ–360లో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. శాసనసభలో 50 శాతం సీట్లు సాధించిన పార్టీకి నాలుగెకరాల వరకు స్థలం కేటాయించేందుకు వీలు కల్పిస్తూ 2016లోనే జీఓ జారీ అయిందని గుర్తుచేసింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని కేవలం రెండెకరాలు మాత్రమేనని వ్యాఖ్యానించింది. పైపెచ్చు ఇందులో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించేందుకు కూడా వీల్లేదని.. ఎందుకంటే భూ కేటాయింపు ప్రధాన జీఓ జారీ అయినప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో లేదని తెలిపింది.
ఒకవేళ అభ్యంతరం ఉంటే, 2016లో జారీ అయిన జీఓ–340ను సవాలు చేసుకోవాలని స్పష్టంచేసింది. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలతో బిత్తరపోయిన పిటిషనర్ తరఫు న్యాయవాది విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేయాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరించి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
మచిలీపట్నంలో పార్టీ కార్యాలయ నిర్మాణం నిమిత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండెకరాల స్థలం కేటాయిస్తూ గత ఏడాది మేలో జారీచేసిన జీఓ–360ని సవాలుచేస్తూ మచిలీపట్నానికి చెందిన వ్యాపారి బురకా శ్రీబాలాజీ కరుణశ్రీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది అంచ పాండురంగారావు వాదనలు వినిపిస్తూ.. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్‌ఓ) ప్రకారం రాజకీయ పార్టీలకు భూమి ఇవ్వడానికి వీల్లేదన్నారు. కేవలం పాఠశాలలు, రహదారులు, సత్రాలు, ఆసుపత్రులు తదితరాలకు మాత్రమే ఇవ్వడానికి వీలుందన్నారు.
ఏ ప్రయోజనాలు ఆశించి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు?
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. అసలు పిటిషనర్ ఎవరని, ఏ ప్రయోజనాలు ఆశించి ఈ వ్యాజ్యం దాఖలు చేశారని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాల్లేవని, కేవలం ప్రజా ప్రయోజనాలు ఆశించే ఈ వ్యాజ్యం దాఖలు చేశామని పాండురంగారావు చెప్పారు. రాజకీయ పార్టీలకు భూ కేటాయింపులను ఏ ప్రాతిపదికన చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. 2016లో జీఓ–340 జారీ అయిందంటూ పాండురంగారావు దానిని చూపారు.
దానిని పరిశీలించిన ధర్మాసనం, ఈ జీఓలో శాసనసభలో 50 శాతం సీట్లు సాధించిన పార్టీకి నాలుగెకరాల వరకు కేటాయించవచ్చని ఉందని.. ఇక్కడ ప్రభుత్వం కేవలం రెండెకరాలు మాత్రమే కేటాయించిందని తెలిపింది. అంతేకాక.. భూ కేటాయింపులపై ప్రభుత్వానికి దురుద్దేశాలు కూడా ఆపాదించలేరని, ఎందుకంటే జీఓ–340 ఈ ప్రభుత్వ హయాంలో జారీకాలేదని, అప్పుడు అధికారంలో వేరే పార్టీ ఉందని తెలిపింది.
వైఎస్సార్‌సీపీకి చేసిన భూ కేటాయింపుపై అభ్యంతరం ఉంటే, జీఓ–340ను సవాలు చేసుకోవాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ వ్యాజ్యంపై ఏం చేయమంటారని ధర్మాసనం ప్రశ్నించగా, విచారణను వాయిదా వేయాలని పాండురంగారావు కోరగా.. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది.
వైఎస్సార్‌సీపీ ఆఫీసుకు.. రెండెకరాలిస్తే తప్పేంటి?
Published Wed, Apr 19 2023 2:22 AM | Last Updated on Wed, Apr 19 2023 2:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment