అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి | YSRCP MPs Protest Outside Parliament And Demand CBI Inquiry On Amaravati Lands Scam | Sakshi
Sakshi News home page

అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

Published Sun, Sep 20 2020 3:53 AM | Last Updated on Sun, Sep 20 2020 7:19 AM

YSRCP MPs Protest Outside Parliament And Demand CBI Inquiry On Amaravati Lands Scam - Sakshi

శనివారం పార్లమెంట్‌ భవనం ఎదుట ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి భరతం పట్టడానికి సహకరించాల్సింది పోయి, కుంభకోణాలకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడం న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో సాగిన కుంభకోణంపై ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేస్తే దర్యాప్తు ఆపేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నిందితుల జాబితాలో పెద్దల పేర్లు ఉండటమే ఇందుకు కారణమా అని నిలదీశారు. కేంద్రం తక్షణం స్పందించి అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును నిరసిస్తూ శనివారం వైఎస్సార్‌సీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

ప్రధాన మంత్రి తక్షణం స్పందించాలి : పిల్లి సుభాష్‌ చంద్ర బోస్‌
– ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అమరావతి భూముల కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణం, అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారంపై మూడు రోజులుగా వైఎస్సార్‌సీపీ ఎంపీలం పార్లమెంటులో ధర్నా చేస్తున్నాం.
– ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తక్షణం స్పందించాలి. అమరావతిలో భూకుంభకోణం జరిగింది. న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవి వాస్తవమా కాదా నిర్ధారించడం కోసం వెంటనే సీబీఐ దర్యాప్తుకు, విభాగ సంబంధిత దర్యాప్తుకు అదేశించాలి.
– ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన న్యాయమూర్తులను పదవుల నుంచి తొలగించినట్లయితే చక్కని సందేశాన్ని ఇచ్చిన వారవుతారు. అమరావతి భూసేకరణ ఒక పెద్ద కుంభకోణం. అయిన వారికి లీకులు ఇచ్చి భూములు కొనేలా చేశారు. 
– ఇందులో అప్పటి మంత్రులు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు, వాళ్ల కుటుంబీకులు ఉన్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజలు పిటిషన్‌ వేయకపోయినా.. హైకోర్టుగానీ, సుప్రీంకోర్టు గానీ తనంతట తానే కేసులను చేపట్టి విచారణ జరిపిన సందర్భాలు దేశంలో కోకొల్లలు. 
– కానీ ఇక్కడ 13 మంది న్యాయమూర్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. తమ ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు వాటిని స్వీకరించారు. 
– కోర్టులపై వ్యాఖ్యానించడం నా ఉద్దేశం కాదు. ఒక అధికారి మీదనో, ప్రజాప్రతినిధి మీదనో ఆరోపణలు వచ్చినప్పుడు సూమోటోగా కేసులు చేపట్టి దర్యాప్తుకు ఆదేశించే న్యాయస్థానాలు.. న్యాయమూర్తులపై ఆరోపణలు వస్తునప్పుడు, పార్లమెంటు సభ్యులు ధర్నాలు జరుపుతూ మీడియా ద్వారా వాటిని యావత్‌ ప్రపంచం దృష్టికి తెస్తున్నప్పుడు దీనిపై దర్యాప్తు ఎందుకు జరపడం లేదు? 
– భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికి ఉందని మేమంతా నమ్ముతున్నాం. న్యాయస్థానాలు ఎలా  çస్పందిస్తాయా అని ఆం«ధ్రప్రదేశ్‌లో సాధారణ ప్రజలు కూడా గమనిçస్తున్నారు. దయచేసి అక్రమాలపై దర్యాప్తు జరిపించండి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే హైకోర్టు స్టే విధించింది. పేదలు మీ నివాస ప్రాంతాలకు సమీపంలో నివసించడానికి అనర్హులా? ఇదేనా సమానత్వం? 
– అంతర్వేదిలో మత కలహాలు రెచ్చగొట్టడానికి కొందరు ప్రయతిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌లకు కుల మత బేధాల్లేవు. వారికి అందరు సమానులే.  

దర్యాప్తు ఎందుకు ఆపేయాలి? : మోపిదేవి
– న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు వివాదాస్పదంగా ఉన్నాయి. అశేష ప్రజాభిమానంతో ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్‌మోహన్‌రెడ్డి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల న్యాయస్థానం స్పందిస్తోన్న తీరు వివాదాస్పదంగా ఉంది. అమరావతి రాజధాని కోసం జరిగిన భూసేకరణలో అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. 
– చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక లాండ్‌ పూలింగ్‌ పేరుతో పచ్చని పంట పొలాలను బడుగు బలహీన వర్గాల వారి నుంచి సేకరించారు. ఇందులో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. నాడు ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ స్కాం గురించి అనేక సార్లు లేవనెత్తారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తున్నారు. ఇందులో తప్పేముంది? ఎందుకు దర్యాప్తు ఆపేయాలి?
– గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పునఃసమీక్ష జరపడానికి వీల్లేదనడం విచారించదగిన విషయం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సీబీఐ విచారణకు ఆదేశించాలి. 

ఆధారాలు ఉన్నందునే కేసు నమోదు : ఆయోధ్య రామిరెడ్డి  
– అవకతవకలు జరిగాయని ప్రాథామిక ఆధారాలు ఉన్న వాటిపైనే దర్యాప్తు జరుపుతున్నారు. తప్పులు జరగలేదనుకుంటే దర్యాప్తు జరగనివ్వండి. నిజానిజాలు తేలుతాయి కదా.
– రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయాలనుకున్నా న్యాయస్థానాల ద్వారా మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వాన్ని పని చేయనీయడం లేదు. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి పనిపై మా ప్రభుత్వం దర్యాప్తు జరపడం లేదు.
– అమరావతిలో భూ అక్రమాలు, ఏపీ ఫైబర్‌నెట్‌ కుంభకోణం, అంతర్వేదిలో రథం దగ్ధం.. ఈ మూడింటిపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరపాలి.  
 
శక్తిమంతులకు మేలు చేస్తున్నట్లుంది : లోక్‌సభ జీరో అవర్‌లో కృష్ణదేవరాయలు
– అమరావతిలో రైతుల ప్రయోజనాలకు రక్షణ కల్పించాల్సింది పోయి, హైకోర్టు శక్తిమంతులకు మేలు చేసినట్టుగా కనిపిస్తోంది. అమరావతి భూముల కుంభకోణంలో నిష్పాక్షిక విచారణ జరగాలి.
– ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దర్యాప్తును నిలిపివేయడమే కాకుండా.. ఎఫ్‌ఐఆర్‌లో మాజీ అడ్వకేట్‌ జనరల్, ఇతర పలుకుబడి కలిగిన పెద్దల పేర్లు ఉన్నందున మీడియా ఆయా వివరాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తగదు. సామాన్యుడైనా, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ అయినా చట్టం పరిధిలో అందరూ సమానమే.  
– ధర్నాలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, బీవీ సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, కోటగిరి శ్రీధర్‌ పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement