సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కులాలవారీగా భూములు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కుల సంఘాలకు భూములు ఇవ్వడాన్ని కూడా కబ్జాగానే పరిగణించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 47పై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులకు విరుద్ధంగా జీవో ఉందని చెప్పింది.
ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి ఉంటే వెంటనే ఆపాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వం గతంలో చేసిన ఇలాంటి భూ కేటాయింపును కూడా రద్దు చేశామంటూ సాయి సింధు ఫౌండేషన్‌అంశాన్ని ప్రస్తావించింది. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని అణగారిన వర్గాలకు భూమి ఇస్తే అర్థం చేసుకోవచ్చు గానీ.. ఆర్థికంగా బలంగా ఉన్న కులాలకు ఎందుకని ప్రశ్నించింది.
ప్రభుత్వమే కులాలను పెంచి పోషించేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్న న్యాయస్థానం.. హైటెక్ రాష్ట్రం తెలంగాణలో ఇదేం పద్ధతని తీవ్ర వాఖ్యలు చేసింది. కుల సంఘాల పేరిట రాజధాని నడిబొడ్డున అత్యంత విలువైన భూములను కేటాయించడం అసంబద్ధమైన విధానమంటూ తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.
కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్‌కు కుల సంఘ భవనాల నిర్మాణం కోసం 5 ఎకరాల చొప్పున హైటెక్ సిటీ సమీపంలో అత్యంత విలువైన భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.
కౌంటర్‌కు అనుమతి...
ఈ పిటిషన్‌లో ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేస్తామని గత విచారణ సందర్భంగా ధర్మాసనం చెప్పింది. వెలమ అసోసియేషన్‌కు మాత్రం రెండు వారాలు సమయం ఇస్తున్నామంది. కమ్మ సంఘం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోవిడ్ కాలంలో తమకు నోటీసు అందలేదని, భూ కేటాయింపుపై విచారణ సాగుతున్న విషయం ప్రచార మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు.
ఈ క్రమంలో తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అంగీకరించింది. కాగా, తమకు కేటాయించిన భూముల కబ్జా అయ్యే అవకాశం ఉందని, చుట్టూ ప్రహరీ కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కుల సంఘాల తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఈ భూ కేటాయింపే ఓ కబ్జా అని వ్యాఖ్యానించింది.
ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన పేద విద్యార్థులకు ఆశ్రయం కోసం హాస్టళ్లను నిర్మించేందుకు భూమి కేటాయించడంలో అర్థం ఉంది కానీ.. ఇలా కుల సంఘాలకు కేటాయింపును సమర్ధించలేమని పేర్కొంది. అసలు ఆ కుల సంఘాలు ఆయా కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది.
ఇదీ భూ కబ్జానే..
Published Thu, Jun 29 2023 4:06 AM | Last Updated on Thu, Jun 29 2023 4:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment