చక్కెరపై మరో పిడుగు
2శాతం సేల్స్‌ట్యాక్స్ విధించిన ప్రభుత్వం
క్వింటాపై రూ.50 అదనపు భారం
ఇప్పటికే వ్యాట్ 5శాతమే మోయలేకపోతున్న ఫ్యాక్టరీలు
అమ్మకాలు లేక నిల్వలు పేరుకుపోయే ప్రమాదం
నష్టాలు తప్పవంటున్న యాజమాన్యాలు
చోడవరం:చక్కెర కర్మాగారాలపై ప్రభుత్వం మరో పిడుగు పడేసింది. ఇప్పటికే నష్టాలతో ఆపసోపాలు పడుతున్న సహకార చక్కెర కర్మాగారాలపై తాజాగా సెంట్రల్ సేల్స్‌ట్యాక్స్ కింద 2శాతం పన్ను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనివల్ల చక్కెర కర్మాగారాలపై మరింత భారం పడి నష్టాల్లోకి వెళ్లనున్నాయి. కొత్త రాష్ట్రంలో 10సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వీటిలో ఈ ఏడాది ఏడు ఫ్యాక్టరీలే క్రషింగ్ చేస్తున్నాయి.
వాటిలో జిల్లాలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో భీమసింగ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే క్రషింగ్‌లో దూసుకుపోతున్నాయి. గోవాడ, ఏటికొప్పాక మినహా మిగతా ఫ్యాక్టరీలన్నీ నష్టాల్లో ఉండి ప్రభుత్వం ఇచ్చే అప్పుపైనే ఆధారపడి నడుస్తున్నాయి. అసలే మార్కెట్‌లో పంచదార ధరలు తగ్గిపోయి, ఉత్పత్తి ధరలు పెరిగిపోయి ఎటూపాలుపోని స్థితిలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీనికితోడు ఏ రాష్ట్రంలోని విధంగా వ్యా ట్ ట్యాక్స్ 5శాతం క్వింటాకు రూ.150 చొప్పున ఇప్పటికే రా ష్ట్రప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఈ వ్యాట్ భారం వల్ల రాష్ట్రీయ పంచదారను కొనుగోలుచేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.