Central sales tax
-
చక్కెరపై మరో పిడుగు
2శాతం సేల్స్‌ట్యాక్స్ విధించిన ప్రభుత్వం క్వింటాపై రూ.50 అదనపు భారం ఇప్పటికే వ్యాట్ 5శాతమే మోయలేకపోతున్న ఫ్యాక్టరీలు అమ్మకాలు లేక నిల్వలు పేరుకుపోయే ప్రమాదం నష్టాలు తప్పవంటున్న యాజమాన్యాలు చోడవరం:చక్కెర కర్మాగారాలపై ప్రభుత్వం మరో పిడుగు పడేసింది. ఇప్పటికే నష్టాలతో ఆపసోపాలు పడుతున్న సహకార చక్కెర కర్మాగారాలపై తాజాగా సెంట్రల్ సేల్స్‌ట్యాక్స్ కింద 2శాతం పన్ను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనివల్ల చక్కెర కర్మాగారాలపై మరింత భారం పడి నష్టాల్లోకి వెళ్లనున్నాయి. కొత్త రాష్ట్రంలో 10సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వీటిలో ఈ ఏడాది ఏడు ఫ్యాక్టరీలే క్రషింగ్ చేస్తున్నాయి. వాటిలో జిల్లాలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో భీమసింగ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే క్రషింగ్‌లో దూసుకుపోతున్నాయి. గోవాడ, ఏటికొప్పాక మినహా మిగతా ఫ్యాక్టరీలన్నీ నష్టాల్లో ఉండి ప్రభుత్వం ఇచ్చే అప్పుపైనే ఆధారపడి నడుస్తున్నాయి. అసలే మార్కెట్లో పంచదార ధరలు తగ్గిపోయి, ఉత్పత్తి ధరలు పెరిగిపోయి ఎటూపాలుపోని స్థితిలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీనికితోడు ఏ రాష్ట్రంలోని విధంగా వ్యా ట్ ట్యాక్స్ 5శాతం క్వింటాకు రూ.150 చొప్పున ఇప్పటికే రా ష్ట్రప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఈ వ్యాట్ భారం వల్ల రాష్ట్రీయ పంచదారను కొనుగోలుచేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. -
సీఎస్టీ కింద తెలంగాణకు రూ.1,500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్టీ) కింద ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల పరిహారం వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు దేశంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రజలకు తక్కువ ధరకు లభించేందుకు వీలుగా కేంద్రం అమ్మకం పన్ను విలువను నాలుగు నుంచి రెండు శాతానికి తగ్గించడంతో.. రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పరిహారాన్ని ఇవ్వనుంది. కేంద్ర అమ్మకం పన్ను, రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను కలిపితే వినియోగదారులపై అధిక భారం పడే అవకాశం ఉన్నందున, ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం సీఎస్టీని తగ్గించిన సంగతి విదితమే. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ పొందుపర్చడం గమనార్హం. -
సీఎస్టీపై సమరభేరి!
- విభజనతో ఆంధ్రప్రదేశ్ వ్యాపారులపై అదనపు భారం - తెలంగాణ నుంచి వచ్చే సరుకులపై పన్ను విధిస్తున్న కేంద్రం - రద్దు చేయకపోతే ఉద్యమమే శరణ్యమంటున్న వర్తకులు సాక్షి, రాజమండ్రి : రాష్ట్రం విడిపోయాక ట్యాక్స్ హాలిడే ఇస్తామన్న కేంద్రం.. ఆ మాటకు విరుద్ధంగా వ్యాపారులపై అదనపు పన్నుభారాన్ని మోపుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవా ణా అయ్యే సరుకులపై సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) విధిస్తోంది. తమ పాలిట గుదిబండగా మారిన ఈ పన్ను ఎత్తివేయాలంటూ వ్యాపారులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కొన్ని వస్తువులు హైదరాబాద్‌లో తప్ప మరొక చోట లభ్యం కానందున రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పటి నుంచీ ఆ నగరం నుంచి తెచ్చి, విక్రయించడానికే అన్ని జిల్లాల వ్యాపారులూ అలవాటు పడ్డారు. అయితే విభజనతో.. అక్కడి నుంచి వచ్చే సరుకులపై కూడా సీఎస్టీ విధిస్తుండడంతో వ్యాపారులపై భారం పడుతోంది. అలాగే నిత్యావసరాల్లో వరియేతర ఆహార ధాన్యాలనూ ఎక్కువగా తెలంగాణ జిల్లాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా గోధుమ ఆధారిత ఆహార ఉత్పత్తులు పిండి, బిస్కట్లు తదితర వస్తువులు నెలకు సుమారు 1500 టన్నులు దిగుమతవుతాయని అంచనా. అంతేకాక వస్త్రాల మిల్లుల్లోనే ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాల్లో విస్తరించాయి. పూణే నుంచి రెడీమేడ్ వస్త్రాలు డిజైన్ చేయించి హైదరాబాద్‌లో హోల్‌సేల్ వ్యాపారులకు అందిస్తారు. గతంలో చెన్నైపై ఆధారపడ్డ వ్యాపారులు పదేళ్లుగా హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ అల్లుకున్న అవసరాలు కంప్యూటర్ స్పేర్ పార్టులు, ఇతర ఉపకరణాలను ఇక్కడి వ్యాపారులు పూర్తిగా హైదరాబాద్ నుంచే తీసుకు వస్తున్నారు. ఎలక్రికల్ వస్తువులు, భవన నిర్మాణ సామగ్రి.. ఇలా అనేక అవసరాలకు సంబంధించిన ప్రధాన వస్తువులకు చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఉభయగోదావరి జిల్లాలకు ఈ వస్తువులు చేరుకోవాలంటే సీఎస్టీ రూపేణా రెండు శాతం అదనంగా పన్ను చెల్లించాల్సిందే. పంచదార, మైదా, ఇతర తిను బండారాలపై సీఎస్టీ చెల్లించి జిల్లాకు చేర్చగానే వాటిపై ఐదు శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం ట్యాక్స్ హాలిడే అమలు చేయాలని, సీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గతంలో వస్త్రాలపై వ్యాట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి వేదికైన మాదిరిగానే ఇప్పుడు సీఎస్టీ రద్దుకు కూడా తూర్పుగోదావరి జిల్లా వేదికగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, చర్చించుకుంటున్నారు. సీఎస్టీ రద్దుకు ఉత్తర్వులివ్వాలి.. సీఎస్టీని ఎత్తివేస్తూ కేంద్రం స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలి. విభజనతో సీమాంధ్రకు తీరని అన్యాయం జరిగింది. వ్యాపారులు నిలదొక్కుకోవాలంటే పన్నుల మినహాయింపు తప్పనిసరి. తెలంగాణ నుంచి సరుకు జిల్లాల్లోకి చేరాలంటే చెక్‌పోస్టుల వద్ద ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. వీటిని తొలగించడంతో పాటు పన్ను రాయితీ కూడా ప్రకటించేలా బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. - అశోక్‌కుమార్ జైన్, అధ్యక్షులు, ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మనది అనుకునే హైదరాబాద్‌పై ఆధారపడ్డాం.. రెడీమేడ్ వస్త్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఉమ్మడిగా ఉన్న కాలంలో అంతా హైదరాబాద్ అనే భావనతో అభివృద్ధి చేశారు. ఇతర రాష్ట్రాలను వదిలి అంతా హైదరాబాద్‌ను కొనుగోళ్లకు కేంద్రంగా మార్చుకున్నాం. ఇప్పుడు విడిపోయాక మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అందుకు కొత్త రాష్ట్రాల మధ్యన కొంత కాలం సీఎస్టీ ఎత్తివేయాలి. - పోకల సీతయ్య, ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ -
రెండు రాష్ట్రాల మధ్య మద్యం ఫీజు
కేంద్ర అమ్మకం పన్ను కూడా భారం వినియోగదారులపైనే! హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఈ రెండింటి మధ్య మద్యం ఎగుమతి, దిగుమతులపై ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర అమ్మకం పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఎక్సైజ్ చట్టం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఈ ఫీజుల చెల్లింపు, అమ్మకం పన్ను భారం అంతా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలలో మద్యం వినియోగదారులపై పడనుందా? అంటే అధికారులు మాత్రం అవుననే చెపుతున్నారు. లేదంటే ఎగుమతి, దిగుమతి ఫీజులు, అమ్మకం పన్ను ఉంచడమా లేదా మినహాయింపులు ఇవ్వడమా అనే విషయంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం అంతర్రాష్ట్ర మద్యం, బీరు రవాణాలపై ఎగుమతి, దిగుమతి ఫీజుతో పాటు అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ భారాన్ని మద్యం సరఫరాదారులపై వేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం భారాన్ని మద్యం కనీస విక్రయ ధరను పెంచడం ద్వారా వినియోగదారులపై వేయవచ్చునని అధికారులు సిఫార్సు చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో టెండర్లు అమల్లో ఉన్నందున ఎగుమతి, దిగుమతి ఫీజు, అమ్మకం పన్నును ఈ నెల 30వ తేదీ వరకు వేయడానికి వీల్లేదని అధికారులు తేల్చారు. ప్రస్తుత టెండర్ల కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. -
కొత్త రాష్ట్రాల మధ్య సీఎస్టీ ఉండదు!
కుదురుకునే దాకా జీరో రేటింగ్ ఇప్పటిదాకా విదేశీ ఎగుమతుల్లోనే ఈ విధానం మిశ్రా కమిటీ నివేదిక? కిమ్మనని కేంద్రం హైదరాబాద్: త్వరలో ఉనికిలోకి రానున్న రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలకు కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ) నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థికంగా నిల దొక్కుకునే దాకా వాటి మధ్య సీఎస్టీ లేకుండా చేయడం ద్వారా పరస్పర అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టవుతుందని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ దిశగా ఇప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల్లో మాత్రమే ఉపయోగిస్తున్న ‘జీరోరేటింగ్’ విధానాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొంతకాలం అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన విభజన, రెవెన్యూ అంశాలను రెవెన్యూ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అశుతోష్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. ‘‘ఇప్పటిదాకా ఒకే రాష్ట్రంగా ఉన్నందున ఉత్పత్తి ఒకచోట, మార్కెటింగ్, డీలర్షిప్ మరో చోట ఉన్నాయ. ఈ నేపథ్యంలో సీఎస్టీ అమలు వల్ల డీలర్లపై ఆర్థిక భారం పడుతుంది. అంతిమంగా అది వినియోగదారుల నెత్తి మీదే పడే ఆస్కారముంది’’ అని నివేదికలో పేర్కొన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. కాబట్టి జీరో రేటింగ్ విధానం అమలు చేస్తే కొంత వెసులుబాటుఉంటుందని చెప్పినట్టు సమాచారం. దీనిపై కేంద్రం మాత్రం ఏమీ చెప్పడం లేదు. ఏంజరుగుతుంది?: విదేశీ ఎగుమతుల విషయంలో ప్రభుత్వం జీరో రేటింగ్ విధానాన్ని అమలు చేయడం సర్వసాధారణం. మన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేప్పుడు ఆయా ఉత్పిత్తి సంస్థలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు పన్నుల నుంచి మినహాయింపు ఇస్తుంది. ఈ విధానంలో డీలరు పన్ను చెల్లించడు. అలాగే వస్తు తయారీకి వినియోగించిన ముడిసరుకుకు చెల్లించిన పన్నులను కూడా సదరు డీలరుకు ప్రభుత్వం తిరిగిచ్చేస్తుంది. కొత్త రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తే వాటి మధ్య జరిగే లావాదేవీలకు సీఎస్టీ చెల్లించాల్సిన అవసరముండదు. ముడి సరుకుపై డీలర్ చెల్లించిన సీఎస్టీ తదితర పన్నులను కూడా ప్రభుత్వం వెనక్కిచ్చేస్తుందన్నమాట. ఉదాహరణకు హైదరాబాద్‌లోని బాలానగర్ తదితర పారిశ్రామికవాడల్లో తయారయ్యే ఎలక్ట్రానిక్, నిత్యావసర, గృహోపకరణాలు సీమాంధ్రకు ఎగుమతి అవుతుంటాయి. జీరో రేటింగ్ విధానం వస్తే వాటిపై సీఎస్టీ ఉండదు. తెలంగాణ సర్కారు ఒప్పుకోదంటున్న నిపుణులు రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీలకు సీఎస్టీ ద్వారా భారీగానే ఆదాయం సమకూరుతుంది. సీఎస్టీలో కేంద్ర వాటా పోగా మిగతాది రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలోకే చేరుతుంది. లోటు బడ్జెట్‌తో ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నిధుల కోసం కటకటను ఎదుర్కొంటోంది. దానికి తోడు అధికారంలోకి రానున్న టీడీపీ లెక్కకు మిక్కిలిగా ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు భారీ నిధులు కావాలి. అలాగే తెలంగాణ సర్కారుకు కూడా సీఎస్టీ ఆదాయం ఉపశమనంగానే ఉంటుంది. సీఎస్టీ ద్వారా తెలంగాణ సర్కారుకు ఏటా కనీసం రూ.3,000 కోట్ల ఆదాయం లభిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ తెలంగాణ జేఏసీ ఇప్పటికే నివేదిక రూపొందించింది. ఈ నేపథ్యంలో రానున్న కేసీఆర్ ప్రభుత్వం జీరో రేటింగ్ ను వ్యతిరేకిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ శాఖలుంటే సీఎస్టీ లేనట్టే ఏ సంస్థ అయినా తన ఉత్పత్తులను వేరే డీలర్‌కు, సంస్థకు విక్రయించినప్పుడే ప్రభుత్వానికి సీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సంస్థకు వేరే రాష్ట్రంలో మరో శాఖ ఉంటే ఆ శాఖకు ఎగుమతి చేసే వస్తువులకు సీఎస్టీ చెల్లించే పని లేదు. ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు పెట్రోలియం ఉత్పత్తులు వైజాగ్ పోర్టు నుంచే ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఎరువులు, పామాయిల్ వంటివి కూడా అక్కడి నుంచి రావలసిందే. ఈ కంపెనీలన్నింటికీ హైదరాబాద్‌లోనూ శాఖలున్నందున వీటికి సీఎస్టీ వర్తించదు. అలా శాఖలు లేని సంస్థలు కూడా కొత్తగా శాఖలను ఏర్పాటు చేసుకుని మినహాయింపు పొందే అవకాశముందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ విధానమే మేలు: వాణిజ్య వర్గాలు ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఏకీకృత పన్ను విధానమే మేలని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకోసం వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)ని యూపీఏ సర్కారు గతంలో తెరపైకి తేవడం తెలిసిందే. అది అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర పన్నులు, వ్యాట్, ఇతర సేవా పన్నులేవీ ఉండవు. ఒక్క జీఎస్టీయే ఉంటుంది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. జీఎస్టీతోనే దేశానికి మేలని రాష్ట్ర జీఏడీ రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ టి.వివేక్ చెప్పారు.