రెండు రాష్ట్రాల మధ్య మద్యం ఫీజు
కేంద్ర అమ్మకం పన్ను కూడా భారం వినియోగదారులపైనే!
హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఈ రెండింటి మధ్య మద్యం ఎగుమతి, దిగుమతులపై ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర అమ్మకం పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఎక్సైజ్ చట్టం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఈ ఫీజుల చెల్లింపు, అమ్మకం పన్ను భారం అంతా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలలో మద్యం వినియోగదారులపై పడనుందా? అంటే అధికారులు మాత్రం అవుననే చెపుతున్నారు. లేదంటే ఎగుమతి, దిగుమతి ఫీజులు, అమ్మకం పన్ను ఉంచడమా లేదా మినహాయింపులు ఇవ్వడమా అనే విషయంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఎక్సైజ్ చట్టం ప్రకారం అంతర్రాష్ట్ర మద్యం, బీరు రవాణాలపై ఎగుమతి, దిగుమతి ఫీజుతో పాటు అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ భారాన్ని మద్యం సరఫరాదారులపై వేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం భారాన్ని మద్యం కనీస విక్రయ ధరను పెంచడం ద్వారా వినియోగదారులపై వేయవచ్చునని అధికారులు సిఫార్సు చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో టెండర్లు అమల్లో ఉన్నందున ఎగుమతి, దిగుమతి ఫీజు, అమ్మకం పన్నును ఈ నెల 30వ తేదీ వరకు వేయడానికి వీల్లేదని అధికారులు తేల్చారు. ప్రస్తుత టెండర్ల కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.