కుదురుకునే దాకా జీరో రేటింగ్ ఇప్పటిదాకా విదేశీ ఎగుమతుల్లోనే ఈ విధానం మిశ్రా కమిటీ నివేదిక? కిమ్మనని కేంద్రం
హైదరాబాద్: త్వరలో ఉనికిలోకి రానున్న రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలకు కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్‌టీ) నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థికంగా నిల దొక్కుకునే దాకా వాటి మధ్య సీఎస్‌టీ లేకుండా చేయడం ద్వారా పరస్పర అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టవుతుందని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ దిశగా ఇప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల్లో మాత్రమే ఉపయోగిస్తున్న ‘జీరోరేటింగ్’ విధానాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొంతకాలం అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన విభజన, రెవెన్యూ అంశాలను రెవెన్యూ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అశుతోష్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. ‘‘ఇప్పటిదాకా ఒకే రాష్ట్రంగా ఉన్నందున ఉత్పత్తి ఒకచోట, మార్కెటింగ్, డీలర్‌షిప్ మరో చోట ఉన్నాయ. ఈ నేపథ్యంలో సీఎస్‌టీ అమలు వల్ల డీలర్లపై ఆర్థిక భారం పడుతుంది. అంతిమంగా అది వినియోగదారుల నెత్తి మీదే పడే ఆస్కారముంది’’ అని నివేదికలో పేర్కొన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. కాబట్టి జీరో రేటింగ్ విధానం అమలు చేస్తే కొంత వెసులుబాటుఉంటుందని చెప్పినట్టు సమాచారం. దీనిపై కేంద్రం మాత్రం ఏమీ చెప్పడం లేదు.
ఏంజరుగుతుంది?: విదేశీ ఎగుమతుల విషయంలో ప్రభుత్వం జీరో రేటింగ్ విధానాన్ని అమలు చేయడం సర్వసాధారణం. మన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేప్పుడు ఆయా ఉత్పిత్తి సంస్థలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు పన్నుల నుంచి మినహాయింపు ఇస్తుంది. ఈ విధానంలో డీలరు పన్ను చెల్లించడు. అలాగే వస్తు తయారీకి వినియోగించిన ముడిసరుకుకు చెల్లించిన పన్నులను కూడా సదరు డీలరుకు ప్రభుత్వం తిరిగిచ్చేస్తుంది. కొత్త రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తే వాటి మధ్య జరిగే లావాదేవీలకు సీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరముండదు. ముడి సరుకుపై డీలర్ చెల్లించిన సీఎస్‌టీ తదితర పన్నులను కూడా ప్రభుత్వం వెనక్కిచ్చేస్తుందన్నమాట. ఉదాహరణకు హైదరాబాద్‌లోని బాలానగర్ తదితర పారిశ్రామికవాడల్లో తయారయ్యే ఎలక్ట్రానిక్, నిత్యావసర, గృహోపకరణాలు సీమాంధ్రకు ఎగుమతి అవుతుంటాయి. జీరో రేటింగ్ విధానం వస్తే వాటిపై సీఎస్‌టీ ఉండదు.
తెలంగాణ సర్కారు ఒప్పుకోదంటున్న నిపుణులు
రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీలకు సీఎస్‌టీ ద్వారా భారీగానే ఆదాయం సమకూరుతుంది. సీఎస్‌టీలో కేంద్ర వాటా పోగా మిగతాది రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలోకే చేరుతుంది. లోటు బడ్జెట్‌తో ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నిధుల కోసం కటకటను ఎదుర్కొంటోంది. దానికి తోడు అధికారంలోకి రానున్న టీడీపీ లెక్కకు మిక్కిలిగా ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు భారీ నిధులు కావాలి. అలాగే తెలంగాణ సర్కారుకు కూడా సీఎస్‌టీ ఆదాయం ఉపశమనంగానే ఉంటుంది. సీఎస్‌టీ ద్వారా తెలంగాణ సర్కారుకు ఏటా కనీసం రూ.3,000 కోట్ల ఆదాయం లభిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ తెలంగాణ జేఏసీ ఇప్పటికే నివేదిక రూపొందించింది. ఈ నేపథ్యంలో రానున్న కేసీఆర్ ప్రభుత్వం జీరో రేటింగ్ ను వ్యతిరేకిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ శాఖలుంటే సీఎస్‌టీ లేనట్టే
ఏ సంస్థ అయినా తన ఉత్పత్తులను వేరే డీలర్‌కు, సంస్థకు విక్రయించినప్పుడే ప్రభుత్వానికి సీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సంస్థకు వేరే రాష్ట్రంలో మరో శాఖ ఉంటే ఆ శాఖకు ఎగుమతి చేసే వస్తువులకు సీఎస్‌టీ చెల్లించే పని లేదు. ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు పెట్రోలియం ఉత్పత్తులు వైజాగ్ పోర్టు నుంచే ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఎరువులు, పామాయిల్ వంటివి కూడా అక్కడి నుంచి రావలసిందే. ఈ కంపెనీలన్నింటికీ హైదరాబాద్‌లోనూ శాఖలున్నందున వీటికి సీఎస్‌టీ వర్తించదు. అలా శాఖలు లేని సంస్థలు కూడా కొత్తగా శాఖలను ఏర్పాటు చేసుకుని మినహాయింపు పొందే అవకాశముందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు తెలిపాయి.
జీఎస్‌టీ విధానమే మేలు: వాణిజ్య వర్గాలు
ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఏకీకృత పన్ను విధానమే మేలని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకోసం వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని యూపీఏ సర్కారు గతంలో తెరపైకి తేవడం తెలిసిందే. అది అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర పన్నులు, వ్యాట్, ఇతర సేవా పన్నులేవీ ఉండవు. ఒక్క జీఎస్‌టీయే ఉంటుంది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. జీఎస్‌టీతోనే దేశానికి మేలని రాష్ట్ర జీఏడీ రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ టి.వివేక్ చెప్పారు.
కొత్త రాష్ట్రాల మధ్య సీఎస్‌టీ ఉండదు!
Published Sun, May 25 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement