సీఎస్‌టీపై సమరభేరి!
- విభజనతో ఆంధ్రప్రదేశ్ వ్యాపారులపై అదనపు భారం
- తెలంగాణ నుంచి వచ్చే సరుకులపై పన్ను విధిస్తున్న కేంద్రం
- రద్దు చేయకపోతే ఉద్యమమే శరణ్యమంటున్న వర్తకులు
సాక్షి, రాజమండ్రి : రాష్ట్రం విడిపోయాక ట్యాక్స్ హాలిడే ఇస్తామన్న కేంద్రం.. ఆ మాటకు విరుద్ధంగా వ్యాపారులపై అదనపు పన్నుభారాన్ని మోపుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవా ణా అయ్యే సరుకులపై సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్‌టీ) విధిస్తోంది. తమ పాలిట గుదిబండగా మారిన ఈ పన్ను ఎత్తివేయాలంటూ వ్యాపారులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
కొన్ని వస్తువులు హైదరాబాద్‌లో తప్ప మరొక చోట లభ్యం కానందున రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పటి నుంచీ ఆ నగరం నుంచి తెచ్చి, విక్రయించడానికే అన్ని జిల్లాల వ్యాపారులూ అలవాటు పడ్డారు. అయితే విభజనతో.. అక్కడి నుంచి వచ్చే సరుకులపై కూడా సీఎస్‌టీ విధిస్తుండడంతో వ్యాపారులపై భారం పడుతోంది.
అలాగే నిత్యావసరాల్లో వరియేతర ఆహార ధాన్యాలనూ ఎక్కువగా తెలంగాణ జిల్లాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా గోధుమ ఆధారిత ఆహార ఉత్పత్తులు పిండి, బిస్కట్లు తదితర వస్తువులు నెలకు సుమారు 1500 టన్నులు దిగుమతవుతాయని అంచనా. అంతేకాక వస్త్రాల మిల్లుల్లోనే ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాల్లో విస్తరించాయి. పూణే నుంచి రెడీమేడ్ వస్త్రాలు డిజైన్ చేయించి హైదరాబాద్‌లో హోల్‌సేల్ వ్యాపారులకు అందిస్తారు. గతంలో చెన్నైపై ఆధారపడ్డ వ్యాపారులు పదేళ్లుగా హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టూ అల్లుకున్న అవసరాలు
కంప్యూటర్ స్పేర్ పార్టులు, ఇతర ఉపకరణాలను ఇక్కడి వ్యాపారులు పూర్తిగా హైదరాబాద్ నుంచే తీసుకు వస్తున్నారు. ఎలక్రికల్ వస్తువులు, భవన నిర్మాణ సామగ్రి.. ఇలా అనేక అవసరాలకు సంబంధించిన ప్రధాన వస్తువులకు చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఉభయగోదావరి జిల్లాలకు ఈ వస్తువులు చేరుకోవాలంటే సీఎస్‌టీ రూపేణా రెండు శాతం అదనంగా పన్ను చెల్లించాల్సిందే. పంచదార, మైదా, ఇతర తిను బండారాలపై సీఎస్‌టీ చెల్లించి జిల్లాకు చేర్చగానే వాటిపై ఐదు శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం ట్యాక్స్ హాలిడే అమలు చేయాలని, సీఎస్‌టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గతంలో వస్త్రాలపై వ్యాట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి వేదికైన మాదిరిగానే ఇప్పుడు సీఎస్‌టీ రద్దుకు కూడా తూర్పుగోదావరి జిల్లా వేదికగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, చర్చించుకుంటున్నారు.
సీఎస్‌టీ రద్దుకు ఉత్తర్వులివ్వాలి..
సీఎస్‌టీని ఎత్తివేస్తూ కేంద్రం స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలి. విభజనతో సీమాంధ్రకు తీరని అన్యాయం జరిగింది. వ్యాపారులు నిలదొక్కుకోవాలంటే పన్నుల మినహాయింపు తప్పనిసరి. తెలంగాణ నుంచి సరుకు జిల్లాల్లోకి చేరాలంటే చెక్‌పోస్టుల వద్ద ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. వీటిని తొలగించడంతో పాటు పన్ను రాయితీ కూడా ప్రకటించేలా బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.
- అశోక్‌కుమార్ జైన్, అధ్యక్షులు, ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్
మనది అనుకునే హైదరాబాద్‌పై ఆధారపడ్డాం..
రెడీమేడ్ వస్త్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఉమ్మడిగా ఉన్న కాలంలో అంతా హైదరాబాద్ అనే భావనతో అభివృద్ధి చేశారు. ఇతర రాష్ట్రాలను వదిలి అంతా హైదరాబాద్‌ను కొనుగోళ్లకు కేంద్రంగా మార్చుకున్నాం. ఇప్పుడు విడిపోయాక మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అందుకు కొత్త రాష్ట్రాల మధ్యన కొంత కాలం సీఎస్‌టీ ఎత్తివేయాలి.
- పోకల సీతయ్య, ఏపీ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్