జీఎస్టీతో ప్రభుత్వ పనులపై భారం
⇒ లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఆందోళన
⇒ జీఎస్టీ కౌన్సిల్‌కు వివరిస్తానన్న కేంద్ర ఆర్థిక మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు కారణంగా ప్రభుత్వ అభివృద్ధి పనులపై భారం పడుతోం దని టీఆర్‌ఎస్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అంశంపై శుక్రవారం లోక్‌సభలో వాయిదా తీర్మానానికి టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి నోటీసు ఇవ్వగా సభాపతి సుమిత్రా మహాజన్ దానిని తిరస్కరించారు. టీఆర్‌ఎస్ ఎంపీలం దరి విజ్ఞప్తి మేరకు జితేందర్‌రెడ్డికి ఈ అంశంపై మాట్లాడేందుకు సభాపతి అవకాశం ఇచ్చారు. జితేందర్‌రెడ్డి దీనిపై ఆందోళన వ్యక్తంచేశారు.
‘ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు, పథకాలపై జీఎస్టీ అమలు చేయరాదు. ఈ పథకాలన్నింటికీ పాత పన్ను పద్ధతిలో బడ్జెట్ కేటాయింపులు జరిపాం. 18% జీఎస్టీ అమలు చేసే రూ.19,200 కోట్ల అదనపు భారం రాష్ట్రంపై పడుతుంది. జీఎస్టీ కౌన్సిల్‌లో పలుమార్లు దీనిని లేవనెత్తాం. 5% పన్ను నుంచి 18% జీఎస్టీకి తీసుకెళితే భరించలేం’ అని పేర్కొన్నారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తూ ఈ అంశాన్నీ జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
అరుణ్ జైట్లీతో కేటీఆర్ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలపై జీఎస్టీ అమలుతో అవి ప్రభావితమవుతు న్నాయని తెలిపారు. తెలంగాణలో ఇప్ప టికే అమలులో ఉన్న పలు ప్రతిష్టాత్మక పథ కాల పురోగతి దెబ్బతినకుండా కేంద్రం, జీఎస్టీ కౌన్సిల్ త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.