జూలైలో రూ.582 కోట్లు! | The implementation of the GST is somewhat less of state revenue | Sakshi
Sakshi News home page

జూలైలో రూ.582 కోట్లు!

Published Mon, Aug 28 2017 3:24 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

జూలైలో రూ.582 కోట్లు!

జూలైలో రూ.582 కోట్లు!

రాష్ట్ర జీఎస్టీ ద్వారా సమకూరిన మొత్తం
కేంద్ర జీఎస్టీ రూ.372 కోట్లు.. అంతర్రాష్ట్ర జీఎస్టీ రూ.683 కోట్లు
వాణిజ్య పన్నుల శాఖ లెక్కలు
అంతర్రాష్ట్ర జీఎస్టీ పంపకాల తర్వాతే లాభనష్టాలపై స్పష్టత


సాక్షి, హైదరాబాద్‌:  జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి నెలలో రాష్ట్ర ఆదాయంలో కొంత మేరకు గండి పడింది. జూలైలో దాదాపు రూ.700 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లుగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యాట్‌ అమల్లో ఉన్నప్పుడు వచ్చినంత మేరకు ఆదాయం సమకూరుతుందా.. జీఎస్టీతో రాష్ట్ర ఖజానాకు లాభమా, నష్టమా అనే దానిపై వాణిజ్య పన్నుల శాఖ, ఆర్థిక శాఖ అధికారులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు.

రూ.700 కోట్ల లోటు..
ఈ ఏడాది జూన్‌లో వ్యాట్, ఎక్సైజ్‌ ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.3,100 కోట్ల ఆదాయం సమకూరింది. దేశవ్యాప్తంగా జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ సిద్ధం చేసిన నివేదిక ప్రకారం జూలైలో రాష్ట్ర జీఎస్టీ రూ.582 కోట్లు, కేంద్ర జీఎస్టీ రూ.372 కోట్లు, అంతర్రాష్ట్ర జీఎస్టీ రూ.683 కోట్లు, సెస్‌ ద్వారా రూ.421 కోట్లు, ఎక్సైజ్‌ ద్వారా రూ.654 కోట్లు, పెట్రోలియం ద్వారా రూ.720 కోట్లు పన్నుల రూపంలో సమకూరినట్లు వెల్లడైంది. దీంతో కేంద్ర జీఎస్టీ, అంతర్రాష్ట్ర జీఎస్టీ పక్కనబెడితే.. ఎక్సైజ్‌ ఆదాయంతో కలిపి రాష్ట్ర ఖజానాకు రూ.2,377 కోట్లు జమైనట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే దాదాపు రూ.700 కోట్ల లోటు కనిపిస్తోంది. కొంత కలవరపరిచే అంశమైనప్పటికీ.. అంతర్రాష్ట్ర జీఎస్టీలో రాష్ట్రానికి వచ్చే వాటాతో ఈ లోటు భర్తీ అయ్యే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్రాష్ట్ర జీఎస్టీలో రాష్ట్రానికి వాటా
రాష్ట్రంలో అంతర్రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద రూ.683 కోట్లు వసూలైంది. ఆయా వస్తువులు, సరుకుల అమ్మకాలు, రవాణా ఆధారంగా ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ అవుతుంది. అదే తీరుగా ఇతర రాష్ట్రాల్లో వసూలైన అంతర్రాష్ట్ర జీఎస్టీలో తెలంగాణకు వాటా సమకూరుతుంది. ఉదాహరణకు తెలంగాణకు చెందిన వారు చాలా మంది హరియాణాలో ఫోర్‌ వీలర్‌ వాహనాలు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నారు. వీరందరూ అక్కడ అంతర్రాష్ట్ర జీఎస్టీ చెల్లిస్తారు.

అంతమేరకు ఆ రాష్ట్రంలో వసూలైన అంతర్రాష్ట్ర జీఎస్టీలో తెలంగాణకు రావాల్సిన వాటా ఖజానాకు జమవుతుంది. ప్రతి మూడు నెలలకోసారి ఈ సర్దుబాటు జరుగుతుందని, అక్టోబర్‌ నెలాఖరు వరకు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ వాటాగా వచ్చే అంతర్రాష్ట్ర జీఎస్టీ ఎంత మొత్తం ఉంటుందనేది లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర జీఎస్టీ ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం పెరిగినా అంతమేరకు రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కూడా కొంతమేరకు పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు జీఎస్టీతో లాభనష్టాలు బేరీజు వేయటం సరికాదని, అక్టోబర్‌ నెలాఖరున అంచనాకు వచ్చే అవకాశముంటుందని ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement