సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం నిరుటి కంటే 19 శాతం వృద్ధి సాధించింది. క్రమంగా జీఎస్టీపై ఉన్న అనుమానాలు తొలగిపోయి రాబడి పుంజుకుంది. ఆర్థిక శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు గడిచిన తొమ్మిది నెలల్లో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.29,811 కోట్లకు చేరింది.
గత ఆర్థిక సంవత్సరం 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో వ్యాట్ ద్వారా రూ.24,977 ఆదాయం సమకూరింది. సరిగ్గా ఈ ఏడాది అదే వ్యవధిలో వచ్చిన ఆదాయం రూ.26,982 కోట్లకు చేరింది. పెట్రోలియం, ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం జీఎస్‌టీ పరిధిలో లేదు. ఎక్సైజ్ ఆదాయం సైతం జోడిస్తే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.29,811 కోట్లకు చేరింది.
మొత్తంగా నిరుటితో పోలిస్తే సగటున 19 శాతం ఆదాయం పెరిగింది. దీంతో ప్రధానంగా జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందనే అపోహలు, అనుమానాలు తొలగిపోయాయి. జీఎస్‌టీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులమీద వచ్చే ఐజీఎస్‌టీ, మద్యం, పెట్రోలియం ద్వారా వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన జీఎస్‌టీ పరిహారం ఆదాయ పెంపునకు దోహదపడ్డాయి.
ఆశించినంత రాబడి పెరగటంతో ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌పై భారీగానే అంచనాలు వేసుకుంటోంది. గతఏడాది వ్యాట్ అమల్లో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. కొత్త విధానం కావటంతో తొలి మూడు నెలల్లో ఆదాయ వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. కానీ క్రమంగా జీఎస్టీ ఆదాయం స్థిరపడింది. ఈ నేపథ్యంలో గతేడాది నెలాఖరు వరకు ఉన్న రాష్ట్ర ఆదాయం, ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయాన్ని ఆర్థిక శాఖ విశ్లేషించుకుంది. ఇందులో 19 శాతం ఆదాయ వృద్ధి నమోదైంది.
రాష్ట్ర ఆదాయంలో 19 శాతం వృద్ధి
Published Tue, Jan 9 2018 2:28 AM | Last Updated on Tue, Jan 9 2018 2:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment