సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ ఆదాయం ఘనంగా ఉన్నప్పటికీ అప్పులు, వడ్డీల మోత కారణంగా ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ప్రతి నెలా వచ్చే రెవెన్యూ రాబడికి మించి ఖర్చులుండటం ఆర్థిక నిర్వహణను ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలన్నీ భారీ బడ్జెట్‌తో కూడుకున్నవి కావడంతో ఖజానాపై అంతకంతకూ భారం పెరిగిపోతోంది. దీంతో కొత్త పథకాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు సర్కారు వెనకాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన మధ్యంతర భృతిని ప్రకటించకుండా ఆపేయడానికి ఇదే ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ, రాష్ట్ర పన్నుల వాటా, ఎఫ్‌ఆర్‌బీఏం పరిధిలో తెచ్చుకునే అప్పులన్నీ కలిపితే ఒక్కో నెలా రాష్ట్రానికి సగటున రూ. 9,800 కోట్ల నుంచి రూ. 10,500 కోట్ల ఆదాయం వస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్‌లో) రూ. 9,866 కోట్ల ఆదాయం రాగా అందులో రూ. 4,938 కోట్లు అప్పుగా తెచ్చినదే. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు నివేదించిన లెక్కలివి. ఇదే తీరుగా వచ్చే రెవెన్యూ రాబడితో పోలిస్తే నెలనెలా ఖర్చు సైతం అదే స్థాయిలో ఉండటం గమనార్హం. ఇప్పటికే చేసిన అప్పులకు ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ. 2,000 కోట్లు కిస్తులు చెల్లించాల్సి ఉంది. వీటికితోడుగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన ప్రభుత్వం చేపట్లే పనులకు మిగిలే నిధులు రూ. 2 వేల కోట్లకు మించడం లేదు. ఇదే సమయంలో రైతుల సంక్షేమానికి వరుసగా చేపట్టిన పథకాలు బడ్జెట్‌లో సింహభాగాన్ని ఆక్రమించాయి.
జీతాలు మినహా నిలిచిన ఇతర బిల్లులు..!
రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగులకు చెల్లించిన వేతనాల మొత్తం దాదాపు రూ. 24 వేల కోట్లు. ఈసారి 63 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2014లో పదో పీఆర్‌సీ 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని.. ఈసారి అంతకు మించిన వేతన సవరణ వస్తుందని ఉద్యోగులు ఆశలు, అంచనాలు పెంచుకున్నారు. మూల వేతనం అప్పుడే భారీగా పెరిగిందని, పెరిగిన మొత్తంపై మరోసారి భారీగా సవరణ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక శాతం వేతన సవరణ చేసినా రూ. 300 కోట్ల భారం పడుతుంది. ఆ లెక్కన 63 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలంటే ఒక్కసారిగా జీతాల భారం అదనంగా రూ. 18,900 కోట్లకు చేరుతుంది. అదే జరిగితే ప్రభుత్వం చేపట్టే ఇతర పనులు, కార్యక్రమాలకు నిధుల కొరత ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే రైతు బంధు చెక్కుల పంపిణీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా అనధికారికంగా నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించింది. ఉద్యోగుల జీతాలు తప్ప ఇతర పనుల బిల్లులన్నీ దాదాపుగా నిలిపేసింది. దాదాపు రూ. 3 వేల కోట్లకుపైగా బిల్లులకు చెక్కులు ఇచ్చినా డబ్బులు విడుదల చేయకుండా ఆపేసింది. దీంతో అన్ని విభాగాల్లో తమకిచ్చిన చెక్కులు డ్రా చేసుకోలేకపోతున్నామం టూ కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
రైతు పథకాలకే అధిక వాటా...
గతంలో మూడేళ్లు రైతు రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేసిన ప్రభుత్వం... ఈ ఏడాది రైతు పెట్టుబడి సాయం పథకానికి నిధులు ధారపోసింది. ఏటా ఎకరానికి రూ. 8 వేల చొప్పున రెండు విడతల్లో చెక్కుల పంపిణీకి దాదాపు రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే రూ. 6 వేల కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం నవంబర్‌లో మరో రూ. 6 వేల కోట్ల పంపిణీకి సిద్ధమవుతోంది. ఇదే వ్యవధిలో రైతులకు రూ. 5 లక్షల జీవిత బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
ఆగస్టులోనే దాదాపు రూ. 1,000 కోట్లను రైతుల పేరిట ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించనుంది. దీంతో రైతు పథకాలకు ఈ ఏడాది రూ. 13 వేల కోట్లు ఖర్చు చేయనుంది. అందుకే ప్రభుత్వం కొత్త పనులకు వెనకాడుతోంది. రైతులకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 8 వేల కోట్ల మార్కెట్ రుణాలను సమీకరించింది. ఏప్రిల్‌లో రూ. 4,932 కోట్లను ఆర్‌బీఐ వేలం ద్వారా అప్పు తీసుకోగా మే, జూన్ నెలల్లో రూ. 3,500 కోట్లు అప్పు చేసింది. తాజాగా ఈ నెల ఒకటో తేదీన జరిగిన వేలంలో రూ. వెయ్యి కోట్లు అప్పు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment