బడ్జెట్‌లో చక్కెర కర్మాగారాలకు మొండిచెయ్యి
నిధుల కేటాయింపు ఊసెత్తని ప్రభుత్వం
పాలకుల నిర్లక్ష్యంతో అప్పులపాలవుతున్న
ఫ్యాక్టరీలు, రైతులు
చోడవరం:ఈ సారి బడ్జెట్‌లోనూ చక్కెర కర్మాగారాలకు మొం డిచేయే చూపారు. దివాలా దిశలో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఎటువంటి చ ర్యలు చేపట్టలేదు. రెండేళ్లుగా చక్కెర కర్మాగారాల పరిస్థితి దినదిన గండంగా ఉంది. ఒక పక్క అప్పులు, మరోపక్క ఆధునికీకరణకు నోచుకోక ఫ్యాక్టరీలు సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. ఈ పరిస్థితిలో 2016-17 బడ్జెట్‌పై ఫ్యాక్టరీలు, చెరకు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు. సహకార చక్కెర కర్మాగారాలు, చెరకు రైతుల సంక్షేమానికి ప్రత్యక్షంగా నిధులు కేటాయించకపోవడం చూస్తే ఈ రంగంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిటో అర్థమవుతుంది.
4 ఫ్యాక్టరీలు మూత
రాష్ట్రంలో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వా టిలో ఇప్పటికే 4 ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. ఈ ఏడాది 6 ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నాయి. అవి కూడా అప్పుల బాధతో నడుస్తున్నాయి. గత ఏడాది చెరకు పేమెంట్లే ఇంకా రైతులకు పూర్తిగా ఇవ్వలేదు. ఇటీవల కేంద్రం ఇచ్చిన వడ్డీలేని రుణం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఫ్యాక్టరీలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించడంతో పాటు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఫ్యాక్టరీలకు ఆర్థిక సాయం చేసి వాటిని ఆదుకోవాల్సి ఉంది.
ఏటా తగ్గుతున్న చెరకు సాగు
రాష్ట్ర వ్యాప్తంగా వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగు జరిగే చెరకు పంట ఏటేటా తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 60 శాతానికి చెరకు సాగు విస్తీర్ణం పడిపోయింది. ఫ్యాక్టరీల మనుగడ సరిగా లేకపోవడం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, పెట్టుబడులు పెరిగి పోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలే ఇందుకు కారణం. చెరకు సాగు తగ్గిపోవడం వల్ల రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది రైతులు, రైతు కూలీలు, కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేవలం రూ.500 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ఉన్న 10 ఫ్యాక్టరీలు మళ్లీ ఆధునిక యంత్రాలతో ముస్తాబై రైతులకు అండగా నిలిచే అవకాశం ఉందని గతంలో ఎపిట్‌కో కమిటీ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వానికి చెప్పింది. తాజాగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వేసిన అధ్యయన కమిటీ కూడా ఫ్యాక్టరీల ఆధునికీకరణ, చెరకు సాగు విస్తీర్ణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. కాని ఇవేవీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కనీసం బడ్జెట్‌లో నైనా ఫ్యాక్టరీల ఆధునికీకరణ కోసం నిధులు కేటాయిస్తుందని యాజమాన్యాలు, చెరకు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కాని నిరాశే మిగిలింది.
రూ.50 కోట్లిచ్చినా బకాయిలు తీరేవి
కనీసం గత సీజన్‌కు సంబంధించి టన్నుకు రూ.200 అయినా ప్రోత్సాహం ఇస్తుందని గోవాడ, ఏటికొప్పాక, తాండవ, భీమసింగ్‌తోపాటు అన్ని ఫ్యాక్టరీలు ఆశించాయి. సుమారు రూ.50 కోట్లు ఇచ్చినా రైతుల బకాయిలు తీర్చి అప్పుల ఊబిలోంచి ఫ్యాక్టరీలు కొంత బయటపడేవి. కాని బడ్జెట్‌లో ఆ కేటాయింపు కూడా జరగలేదు.కనీసం వ్యవసాయ బడ్జెట్‌లోనైనా ఎక్కడైనా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల గురించి ప్రస్తావిస్తారంటే అది కూడా చేయలేదు. సాధారణంగా అన్ని పంటల్లో దీన్ని కూడా ఒకటిగానే పరిగణించారే తప్ప కొన్ని లక్షల మంది ఆధారపడి ఒక ప్రత్యేక రంగంగా నడుస్తున్న సుగర్ ఫ్యాక్టరీలకు స్పష్టమైన నిధుల కేటాయించినట్టు ఎక్కడా పేర్కొనకపోవడం ఫ్యాక్టరీ వర్గాలు, రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తీపి కబురు లేదు
Published Thu, Mar 10 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement
Advertisement