ఒంటికన్ను కణుపులు వాడండి!
పాడి-పంట: అనకాపల్లి (విశాఖపట్నం): ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరకు సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోతోంది. ఓ వైపు పెట్టుబడి వ్యయం పెరగడం, కూలీల కొరత... మరోవైపు దిగుబడులు పెరగకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం... దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎకరం విస్తీర్ణంలో చెరకు సాగుకు 40-50 వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. సాగు ఖర్చును తగ్గించుకోగలిగినప్పుడే రైతులు లాభాల బాట పడతారు. ముచ్చెలకు బదులు బడ్‌చిప్/ఒంటికన్ను కణుపులను వినియోగించడం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త (చెరకు) డాక్టర్ ఎం.భరతలక్ష్మి. ఆ వివరాలు...
చెరకు తోటలో రైతులు మూడు లేదా రెండు కళ్ల ముచ్చెలు నాటుతుంటారు. ఇందుకోసం ఎకరానికి 4-6 టన్నుల ముచ్చెలు అవసరమవుతాయి. ముచ్చెలకు బదులు మొగ్గతో ఉన్న ఒంటికన్ను కణుపులను గడల నుంచి వేరు చేసి, వాటిని ట్రేలల్లో పెంచి, నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే విత్తన మోతాదు బాగా తగ్గుతుంది. రైతుకు నికరాదాయం పెరుగుతుంది. ఈ విధానంపై రెండు రాష్ట్రాలలోని చెరకు పరిశోధనా స్థానాలలో గత నాలుగైదేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్కో నారు మొక్క నుంచి 10-15 కిలోల దిగుబడి పొందవచ్చునని తేలింది.
ఎన్నో ప్రయోజనాలు
సంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఈ పద్ధతిలో పైరు ఎక్కువ పిలకలు తొడుగుతుంది. పిలకలన్నీ ఒకే విధంగా పెరుగుతాయి కాబట్టి గడల సంఖ్య, వాటి బరువు, చెరకు దిగుబడి, చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఎకరానికి సుమారు 10 టన్నులు, కోస్తాలో 5 టన్నుల మేర దిగుబడి పెరిగిందని పరిశోధనల్లో తేలింది. కణుపులను తేలికగా శుద్ధి చేసి, తద్వారా ఆరోగ్యవంతమైన నారును పెంచి చీడపీడల బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. నారు మొక్కలను ట్రేలల్లో పెంచడం వల్ల నెల రోజుల పంటకాలం కలిసొస్తుంది. ముందుగానే చెరకు క్రషింగ్ మొదలు పెట్టవచ్చు. నీరు, ఇతర వనరులు కూడా ఆదా అవుతాయి. ట్రేలల్లో ఒంటికన్ను కణుపులను నాటిన తర్వాత గడలో మిగిలిన భాగాన్ని పంచదార లేదా బెల్లం తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతి యాంత్రీకరణకు బాగా అనువుగా ఉంటుంది.
ఎలా తీయాలి?
రైతులు ముందుగా అధిక దిగుబడినిచ్చే అనువైన రకాన్ని ఎంచుకోవాలి. 6-7 నెలల వయసున్న ఆరోగ్యవంతమైన తోట నుంచి గడలను సేకరించాలి. వీటి నుంచి ఒంటికన్ను కణుపులను వేరు చేయాలి. ఇందుకోసం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతిలో చెరకు సాగుకు ఎకరానికి కేవలం 70-80 కిలోల విత్తన కణుపులు సరిపోతాయి. సేకరణ సమయంలో విత్తన కణుపులు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మొలక శాతం తగ్గుతుంది. కణుపులను గ్రేడింగ్ చేసి, మేలైన వాటిని తీసుకోవడం మంచిది. లీటరు నీటిలో 0.5 గ్రాముల కార్బండజిమ్+ఒక మిల్లీలీటరు మలాథియాన్ చొప్పున కలిపి, ఆ మందు ద్రావణంలో విత్తన కణుపులను 15 నిమిషాల పాటు ముంచి శుద్ధి చేయాలి. దీనివల్ల అనాసకుళ్లు తెగులు, పొలుసు పురుగు బారి నుంచి తోటను కాపాడుకోవచ్చు.
ట్రేలో అమర్చి...
విత్తన కణుపులను నాటడానికి ప్లాస్టిక్ ట్రేలను ఉపయోగించాలి. ఒక్కో ట్రేలో 50 నారు మొక్కలను పెంచవచ్చు. కొబ్బరి పీచుతో చేసిన ఎరువు (కోకో ఫీడ్)/బాగా చివికిన పశువుల ఎరువు/వర్మి కంపోస్ట్‌కు తగినంత మట్టిని కలిపి ట్రే గుంతను సగానికి పైగా నింపాలి. విత్తన కణుపును 60-70 డిగ్రీల వాలుగా నాటాలి. దానిపై మళ్లీ ఎరువు వేసి, కణుపు కనబడకుండా అదమాలి. ఆ ట్రేలను షేడ్‌నెట్ కింద లేదా నీడలో వరుసకు 10 చొప్పున ఉంచాలి. వాటిపై నల్లని పాలిథిన్ షీటును కప్పి గాలి చొరబడకుండా బిగించాలి. దీనివల్ల మొక్కలు 3-4 రోజుల్లో మొలుస్తాయి.
కణుపు నుంచి మొక్క బయటికి వచ్చిన వెంటనే పాలిథిన్ షీటును తీసేయాలి. రోజు విడిచి రోజు రోజ్‌క్యాన్ లేదా స్ప్రింక్లర్లతో నీటిని చల్లాలి. నాటిన వారం రోజులకు మొక్కలన్నీ మొలిచి, ఆకులు తొడగడం మొదలవుతుంది. నాటిన 4 వారాలకు మొక్క 3-4 ఆకులు తొడుగుతుంది. వేర్లు కూడా వృద్ధి చెందుతాయి. నాటిన రెండు వారాల తర్వాత కూడా కణుపుల నుంచి మొలక రాకపోతే వాటిని తీసేసి కొత్త కణుపులు నాటాలి. ఎకరం తోటలో నాటేం దుకు 7,500-8,000 నారు మొక్కలు (150-175 ప్లాస్టిక్ ట్రేలలో పెంచిన) అవసరమవుతాయి. నారు మొక్కలు బలహీనంగా ఉన్నట్లయితే 19:19:19 ఎరువు 0.1% లేదా వర్మివాష్ 1% ద్రావణాన్ని వాటిపై పిచికారీ చేయాలి.
(మిగతా వివరాలు రేపటి పాడి-పంటలో)