చెరకు.. మాయం!
చెరకు.. మాయం!
Published Sat, Oct 15 2016 4:22 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కనుమరుగవుతున్న పంట
ఈసారి 2వేలకు పడిపోయిన సాగు
ఏడాది క్రితమే ఫ్యాక్టరీ మూత
అయోమయంలో రైతన్న
సొంత జిల్లాలోనైనా పూర్వవైభవం వచ్చేనా
మెదక్ : ఒకప్పుడు ఈ ప్రాంతంలో చెరకు సాగుకు ఎనలేని ప్రాధాన్యత.. ప్రస్తుతం అదే పంట మచ్చుకు కూడా కనపడని దుస్థితికి చేరింది. ప్రపంచానికి తీపిని పంచిన ఈ ప్రాంత చెరకు రైతులకు చివరకు చేదే మిగిలింది. పాలకుల పుణ్యమా అని ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయటంతో దాని యజమాని మూసివేసి కార్మికులతో పాటు చెరకు రైతులను రోడ్డు పాలు చేశారు. ఫలితంగా ఈ ప్రాంతంలో చెరకు పంట కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మెదక్ ప్రాంతంలో ఒకప్పుడు వరి తరువాత అతిఎక్కువగా చెరకుకే ప్రాధాన్యతను ఇచ్చేవారు. పాతికేళ్ల కిత్రం మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి శివారులో నిజాంషుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. ఫ్యాక్టరీ పరిధిలోని మెదక్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, కౌడిపల్లి, చేగుంట, దౌల్తాబాద్, గుమ్మడిదలతో పాటు మొత్తం 12 మండలాలకు చెందిన రైతుల కోసం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు.
ఫ్యాక్టరీ ప్రారంభంలో ఈ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో చెరకును సాగుచేసేవారు. దీంతో సీజన్‌లో 5 లక్షల పైచిలుకు టన్నుల చెరకును గానుగ ఆడించేవారు. ఇందులో 600 పైచిలుకు పర్మనెంట్ కార్మికులు. మరో 1000కిపైగా సీజనల్ కార్మికులు పనులు చేసేవారు. ఈ ఫ్యాక్టరీ అటు చెరకు రైతులకు ఇటు కార్మికులకు కల్పవల్లిగా ఉండేది. కాగా ఫ్యాక్టరి నష్టాల్లో ఉందని కావాలనే తప్పుడు లెక్కలు సృష్టించి 2002 సంవత్సరంలో అప్పటికి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబునాయడు దీనిని డక్క¯ŒSపేపర్ మిల్లు యజమానికి ఫ్యాక్టరిలోని 51శాతం వాటాను విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. నాటి నుంచి అటురైతులకు, ఇటు కార్మికులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయ్యాక చెరకు రైతులకు ఒక్కోసారి రెండు సంవత్సరాల వరకు సైతం బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
గతంలో చెరకు సాగుకోసం అనేక సబ్సిడీలు ఇచ్చేవారు. ప్రైవేట్ యజమాన్యం పూర్తి సబ్సిడీలను ఎత్తివేశారు. ఫ్యాక్టరిలో 600 మంది పర్మినెంట్ కార్మికులుండగా వారిలో చాలా మందికి బలవంతంగా వీఆర్‌ఎస్ ఇచ్చి బయటకు పంపించారు. దీంతో ప్రస్తుతం 95 మంది మాత్రమే కార్మికులున్నారు. కార్మికులకు నెలనెలా వేయాల్సిన పీఎఫ్ డబ్బులను సైతం సరిగ్గా వేయలేదు. అంతేకాకుండా గత సంవత్సరం చెరకుసాగు లేదనే సాకుతో ఫ్యాక్టరిని గత డిసెంబర్ మాసంలో అక్రమంగా లేఆఫ్ ప్రకటించారు. కార్మికులకు 11 నెలలుగా వేతనాలు సైతం ఇవ్వటంలేదు. గత సంవత్సరం 5 వేల ఎకరాల్లో చెరకు పంటను సాగు చేయగా ఫ్యాక్టరీని నడిపించక పోవటంతో నిజామాబాద్ జిల్లాకు చెరకును తరలించి నానా అవస్తలు పడ్డారు. దీంతో ఈ యేడు కేవలం 2 ఎకరాలకే చెరుకు పంటను పరిమితం అయ్యింది. ఇలా ప్రతియేటా చెరుకు పంట కనుమరుగైయ్యే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం కొత్తజిల్లాలోనైనా చెరకు సాగుకు çపూర్వవైభవం వచ్చేనా? ఎన్డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీని తెరిపించేనా? అంటు పలుమండలాల చెరుకు రైతులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement