చేదుగుళిక
- కలిసిరాని చెరకు సాగు
- స్వల్పకాలిక వంగడాలపై రైతుల ఆసక్తి
- ఏటేటా తగ్గుతున్న పంట
జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ పంటకు మదుపులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నా గిట్టుబాటు కావడం లేదు. గడచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తక్కువ విస్తీర్ణంలో నాట్లు వేశారు. చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించకపోవడంతో నీటి వసతి పుష్కలంగా ఉన్న భూములలో సైతం సరుగుడు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు వేస్తున్నారు. చెరకు ఏక వార్షిక పంట. సుమారు పది నెలలు పెంచాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతివృష్టి, అనావృష్టికి గురయితే అంతే సంగతి.
మునగపాక : చెరకు సాగు రైతుకు లాభసాటి కావడం లేదు. దీంతో ఈ పంట విస్తీర్ణం జిల్లాలో ఏటేటా తగ్గిపోతోంది. సాధారణ విస్తీర్ణం 38,329 హెక్టార్లు. ఈ ఏడాది 37,459 హెక్టార్లే సాగయింది. మూడేళ్లుగా చీడపీడల బెడద, చక్కెర మిల్లులు మద్దతు ధర చెల్లించకపోవడం, మార్కెట్‌లో బెల్లం ధరల్లో హెచ్చు తగ్గులు ఈ పంటను చేపట్టే రైతులను దివాలా తీసేలా చేస్తున్నాయి. తాతల కాలం నుంచి జీవనాధారంగా వస్తున్న పంటను వదులుకోలేక వేరే పనులు చేసే అవకాశం లేక రైతులు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
కుటుంబమంతా ఏడాది పాటు కష్టపడినా పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో అప్పులపాలైపోతున్నారు. ఎకరా చెరకు సాగుకు రూ. 40వేల నుంచి రూ. 45వేలు వరకు ఖర్చవుతోంది. పంట చీడపీడలు, అతివృష్టి, అనావృష్టికి గురయి దిగుబడి తగ్గిపోతోంది. కనీసం పదిపాకాలకు మించి దిగుబడులు రావడం లేదు. బెల్లం మొదటిరకం క్వింటా రూ.2910 నుంచి రూ. 3070లు పలుకుతోంది. ఈ లెక్కన పదిపాకాలకు సుమారు రూ.30వేలు ఆదాయం వస్తోంది. అంటే ఎకరాకు రూ.15వేలు నష్టం తప్పడం లేదు. చక్కెర మిల్లులు కూడా మద్దతు ధర చెల్లించడం లేదు. గతేడాది సరఫరా చేసిన చెరకుకు ఇప్పటి వరకు తుమ్మపాల యాజమాన్యం చెల్లింపులు జరపలేదు. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టిలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు.
మద్దతు ధర లేదు
నాది మునగపాక. చెరకు సాగే జీవనాధారం. అయితే పంట మదుపులకు, ఆదాయానికి పొంతన ఉండడం లేదు. బెల్లం తయారు చేస్తే మార్కెట్‌లో ధర ఉండడం లేదు. ఫ్యాక్టరీకి తరలిస్తే మద్దతు ధర లేదు సరికదా చెల్లింపులు లేవు. తీవ్రంగా నష్టపోతున్నాం. అందుకే ఈ ఏడాది 30సెంట్ల తోటను రసానికి అమ్మాను. పది టన్నులు వస్తుంది. టన్ను రూ. 2300లు. మొత్తం రూ. 23వేలు వరకు ఆదాయం వస్తుంది. ఇదే బాగుంది.
- పెంటకోట శ్రీనివాసరావు
ఏటా నష్టమే
నాది మునగపాక. రెండెకరాల్లో చెరకు వేశా. గతేడాది రెండెకరాల్లోని పంటకు తెగుళ్లు సోకాయి. నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఎకరాకు రూ.45వేలు వరకు మదుపు పెట్టా. చీడపీడల కారణంగా ఎకరా చెరకు గానుగాడితే పదిపాకాలకు మించి బెల్లం రాలేదు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 23వేలు మాత్రమే వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు రూ 22వేలు వరకు నష్టపోయా. ఇంటిల్లిపాదీ కష్టపడినా నష్టమే వచ్చింది.
- పెంటకోట వెంకటరావు, వ్యవసాయ రైతు