
చెరకు సాగుకు చక్కని యంత్ర పరికరాలు!
సంప్రదాయ చెరకు సాగులో యాజమాన్య చర్యలు చేపట్టటంలో కూలీలే కీలకం. మారిన పరిస్థితుల్లో కూలీల కొరతతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన కూలీ రే ట్లు రైతుకు గుదిబండగా మారి చెరకు సాగు నష్టాల చేదును పంచుతోంది. చెరకు రైతు లాభాల బాట పట్టేందుకు అదును వెంబడి ఆధునిక యాంత్రీకరణ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిశగా విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పీవీకే జగన్నాథం, శ్రీదేవి ముందడుగు వేశారు. విత్తనం నాటే దగ్గరి నుంచి పంటను చక్కెర కర్మాగారాలకు పంపేవరకు వివిధ దశల్లో పనులను సులువుగా చేసుకునేందుకు ఆరు యంత్ర పరికరాలను వారు రూపొందించారు. వ్యవసాయ యాంత్రీకరణపై ఇటీవల ఢిల్లీలో జరిగిన నూతన ఆవిష్కరణల సదస్సులో వీటికి ప్రశంసలు లభించడం విశేషం. ఆ యంత్ర పరికరాల వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..
విత్తన చెరకు నాటే యంత్ర పరికరం...
విత్తన చెరకును నాటటం, విత్తనశుద్ధి వంటి పనులను ఈ యంత్ర పరికరం (షుగర్‌కేన్ కట్టర్ ప్లాంటర్)తో ఒకేసారి పూర్తి చేయవచ్చు. బోదెలలో అడుగు లోతులో విత్తనాన్ని ఉంచి, శుద్ధి చేసిన ద్రావణాన్ని పిచికారీ చేసి, ఆపైన మట్టితో కప్పుతుంది. ఒకేసారి రెండు సాళ్లలో విత్తనాన్ని నాటుతుంది. సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు టన్ను దిగుబడి పెరుగుతుంది. విత్తే సమయం 6 గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుంది. రూ. 1,500 ఖర్చు ఆదా అవుతుంది. 4 టన్నులకు బదులు 1.25 టన్నుల విత్తనం సరిపోతుంది. దీనితో నాటిన చెరకు మొక్క వేర్లు ఎక్కువ దూరం విస్తరిస్తాయి. దీనివల్ల చెరకు గడ లావు, పొడవు, బరువు పెరిగి దిగుబడి ఎక్కువగా వస్తుంది. దీని ఖరీదు రూ. 1. 97 లక్షలు.
ఒంటికన్ను కణుపులను వరుసల్లో నాటే యంత్ర పరికరం..
బడ్‌చిప్ ప్లాంటర్ అనే యంత్ర పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించాలి. కత్తిరించిన చెరకు కణుపులను నర్సరీ ట్రేలలో పెంచి, 20-30 రోజుల వయస్సులో నాటుకుంటారు. ట్రేలను యంత్రంపై పెట్టుకొని కూలీలు మొక్కలను నాళికల్లో వేస్తే ఏకకాలంలో రెండు సాళ్లలో మొక్కలను నాటుతుంది. గంటకు 4 వేల మొక్కలను నాటుతుంది. మొక్కల మధ్య దూరం 30-70 సెం.మీ, సాళ్ల మధ్య 120-150 సెం.మీ. దూరం ఉండేలా ఏర్పాటు చేశారు. సాళ్లు, మొక్కల మధ్య దూరాన్ని అవసరాన్ని బట్టి తగ్గించుకోవటం, పెంచుకోవటం చేయవచ్చు. సంప్రదాయ పద్ధతితో పోల్చితే ఎకరాకు రూ.3,600 వరకు ఖర్చు ఆదా అవుతుంది. విత్తనం నాలుగు టన్నులకు బదులు ఒక టన్ను సరిపోతుంది. విత్తే సమయం సగానికి త గ్గుతుంది. ఈ యంత్ర పరికరం ధర రూ. 2.13 లక్షలు.
చెరకులో అంతర కృషి యంత్ర పరికరం...
చెరకు పంట కాలం పూర్తయ్యే సరికి నాలుగు సార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. చిన్న ట్రాక్టర్‌కు రోటావేటర్‌ను బిగించి సాళ్ల మధ్య అంతరకృషి చేయటం ద్వారా కలుపును నిర్మూలించవచ్చు. చెరకులో కలుపు నిర్మూలనకు రోటావేటర్ బిగించిన మినీ ట్రాక్టర్‌ను వాడతారు. రైతువారీ పద్ధతిలో కూలీల ఖర్చు రూ. ఐదు వేలవుతుంది. ఈ యంత్రాన్ని ఉపయోగిస్తే రూ. వెయ్యి మాత్రమే ఖర్చవుతుంది. సాళ్ల మధ్య నేల గుల్ల బారుతుంది. మూడొంతుల సమయం ఆదా అవుతుంది. ఎకరాకు రూ. నాలుగు వేల వరకు రైతుకు ఆదా అవుతుంది.
చెరకు గడల నుంచి ఆకులు రెలిచే యంత్రం...
మిల్లులకు రవాణా చేసేముందు చెరకుపైన ఉండే ఆకులు, వ్యర్థాలను రైతులు తొలగిస్తారు. సంప్రదాయ పద్ధతిలో ఒక పూట చేసే పనిని ఈ యంత్రం గంటలోనే చేస్తుంది. 3.6 హెచ్‌పీ డీజిల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఇద్దరు కూలీలు సరిపోతారు. టన్ను చెరకు ఆకులను గంటలో తొలగిస్తుంది. చెరకును యంత్రంలో పెడుతుంటే ఆకులను తొలగిస్తుంది. మూడొంతుల సమయం సగం ఖర్చు రైతుకు ఆదా అవుతుంది. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. లక్ష.
చెత్తను భూమి మీద పరిచే యంత్ర పరికరం..
సాధారణంగా కోతలు పూర్తయ్యాక పొలంలో మిగిలే వ్యర్థాలను రైతులు తగులబెడతారు. దానికి బదులు ఈ యంత్రం సహాయంతో మూడు, నాలుగు సెం. మీ. పొడవు ముక్కలుగా చేయటం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. ఈ వ్యర్థాలు పొలంలోనే కుళ్లి నేల సారవంతం అవుతుంది. ఆచ్ఛాదనగా వాడితే సాగునీటిలో మూడోవంతు ఆదా అవుతుంది. ఈ యంత్రం 45 హెచ్‌పీ ట్రాక్టర్ట్‌తో పనిచేస్తుంది. గంటకు రెండున్నర ఎకరాల్లో చెరకు వ్యర్థాలను ఇది ముక్కలు చేస్తుంది. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. 2 లక్షల 87 వేలు.
కార్శి తోట నిర్వహణ యంత్ర పరికరం...
ట్రాక్టర్‌కు జోడించి వాడుకునే యంత్ర పరికరం ఇది. కార్శి తోటలోని చెరకు దుబ్బులను నేలకు సమాంతరంగా కత్తిరిస్తుంది. ఈయంత్రంలోని బ్లేడ్ అంచులు పదునుగా ఉండి దుబ్బులను కోస్తుంది. ఒక ఎకరాలో దుబ్బులను గంటన్నరలో కత్తిరిస్తుంది. కూలీలతో ఆరుగంటలు పట్టే పనిని ఈ యంత్రం సహాయంతో గంటన్నరలో పూర్తి చేయవచ్చు. ఖర్చు మూడొంతులు తగ్గుతుంది. నేలలోకి గాలి ప్రసరణ ం పెరిగి కొత్త వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. మూడొంతుల సమయం, కూలీల ఖర్చు ఆదా అవుతాయి. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. 90 వేలు.
- దాడి కృష్ణ వెంకటరావు, సాక్షి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా
యాంత్రీకరణతోనే చెరకు రైతుకు లాభాలు
చెరకు సాగులో యంత్రాల వినియోగం ఇప్పటివరకు దుక్కిదున్నటానికే పరిమితం. మిగిలిన పనులకు కూలీలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఖర్చు పెరిగి నష్టాలు రావటంతో చెరకు సాగును రైతులు మానుకుంటున్నారు. యంత్రాల వాడకం వల్ల ఖర్చు త గ్గుతుంది. అదును వెంబడి పనులు పూర్తవడం వల్ల మంచి దిగుబడులతోపాటు లాభాలు వస్తాయి. ఇవి కావలసిన రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు. వీటి కొనుగోలుకు ప్రభుత్వ రాయితీలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
- డాక్టర్ పీవీకే జగన్నాథం (94419 44640), పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన విభాగం అధిపతి, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అనకాపల్లి