= పెరిగిన పెట్టుబడి వ్యయం
= దక్కని గిట్టుబాటు ధర
= ప్రకటించింది టన్నుకు రూ.2,400
= రూ.3,500 ఇవ్వాలని రైతుల డిమాండ్
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : చెరుకు సాగు రైతన్నకు చేదును మిగుల్చుతోంది. గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నారు. ఏటా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతున్నా చక్కెర కర్మాగారాలు చెరుకు ధరలను పెంచకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హనుమాన్‌జంక్షన్‌లోని డెల్టా షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న బాపులపాడు, గన్నవరం, నూజివీడు, మైలవరం, చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి, పెదపాడు మండలాల్లో సుమారు 8,600 ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది. ఈ ఏడాది 2.40 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌ను ఫ్యాక్టరీ లక్ష్యంగా పెట్టుకుంది.
తేలని గిట్టుబాటు ధర...
మరో నెల రోజుల్లో చెరుకు క్రషింగ్ ప్రారంభం కానుంది. డెల్టా షుగర్స్ పరిధిలో 2013-14 సీజన్‌లో నాలుగు వేల ఎకరాల్లో మొక్క చెరుకు, మరో 4,600 ఎకరాల్లో పిలక చెరుకు సాగులో ఉంది. జిల్లాలోని కేసీపీ కర్మాగారం టన్ను చెరుకు ధర రూ.2,400గా ప్రకటించటంతో డెల్టా షుగర్స్ రైతులు అయోమయంలో పడ్డారు. గత సీజన్‌లో డెల్టా యాజమాన్యం టన్ను చెరుకు ధర సబ్సిడీ పోను రూ.2,200 అందజేసింది. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఉత్పత్తి వ్యయం అవుతుండగా, దిగుబడి మాత్రం 30 టన్నులకు మించటం లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్‌లోనైనా డెల్టా యాజమాన్యం సరైన గిట్టుబాటు ధర ప్రకటిస్తుందని రైతులు ఆశతో ఉన్నారు.
తగ్గుతున్న సాగు విస్తీర్ణం...
చెరుకు పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతాంగం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, పామాయిల్ సాగుకు రైతులు మొగ్గుచూపటంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యం సుమారు 25 లక్షల టన్నులు కాగా 2012-13 సీజన్‌లో 12 లక్షల టన్నులు మాత్రమే క్రషింగ్ కావటం దీనికి నిదర్శనం. డెల్టా ఫ్యాక్టరీ పరిధిలో గతంలో 12 వేల ఎకరాలకు పైబడి చెరుకు సాగులో ఉండగా 2011-12 సీజన్‌లో తొమ్మిదివేల ఎకరాలకు, 2012-13 సీజన్‌లో 8,600 ఎకరాలకు, ప్రస్తుతం 8,400 ఎకరాలకు సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గటం ఆందోళన కలిగిస్తోంది.
రెట్టింపైన పెట్టుబడి వ్యయం..
ఏటా చెరుకు ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో గిట్టుబాటు ధరలు పెరగకపోవటంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అడ్డగోలుగా పెరిగిన డీజిల్, ఎరువుల ధరలు, కూలీల కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోపక్క కూలిరేట్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గత సీజన్‌లో ఎలుకల బెడద చెరుకు రైతును కోలుకోలేని దెబ్బ తీసింది. ఈసారి దిగుబడి ఆశాజనకంగానే ఉన్నా ధర ఏమాత్రం అందుతుందో వేచి చూడాల్సిందే.
టన్నుకు రూ.3500 ఇవ్వాలి
పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో టన్ను చెరుకు ధర రూ.3500 ప్రకటించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎకరాకు సుమారు లక్షన్నర రూపాయల వ్యయం అవుతోంది. చెరుకు రైతుల ద్వారా ఫ్యాక్టరీలకు లాభాలు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం భారీగా వస్తున్నా ఆరుగాలం కష్టించే రైతు మాత్రం నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. న్యాయమైన ధర ప్రకటించి చెరుకు సాగును నిలబెట్టుకోకపోతే భవిష్యత్‌లో గడ్డుకాలం ఎదుర్కోక తప్పదు.
- నండూరు సత్య వెంకటేశ్వర శర్మ, చెరుకు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి