Delta Sugar Factory
-
చక్కెర..ఓ చేదు నిజం
సాక్షి,గన్నవరం : జిల్లా వాసులకు హనుమాన్‌జంక్షన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మొదట ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం కాగా రెండవది అంతే పేరున్న షుగర్ ఫ్యాక్టరీ. నిజంగా ఈ ప్రాంత ప్రజలకు చక్కెర కార్మాగారంతో అంత అవినాభవ సంబంధం ఉంది. జంక్షన్ పరిసరాల ప్రాంతాల్లో వేలాది మంది చెరకు రైతులు, కూలీలు, వందలాది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని ఉన్నారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీకి 2017 అక్టోబర్‌లో లాకౌట్ ప్రకటించడం జంక్షన్ వాసులను తీవ్రంగా కలిచివేసింది. ఫ్యాక్టరీపై ఆధారపడిన దాదాపు 10 వేల మంది చెరకు రైతులు, 400 మందికిపైగా కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హనుమాన్జంక్షన్కు ఓ తలమానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కనుమగురు కానుందనే చేదు నిజాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన షుగర్ ఫ్యాక్టరీ ప్రస్థానం.. హనుమాన్ జంక్షన్, నూజివీడు, గన్నవరం ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో గతంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన చిన్న, చిన్న ఖండసారి చక్కెర మిల్లులు ఆరేడు ఉండేవి. క్రమేణా చెరకు సాగు విస్తీర్ణం పెరగటంతో వీటి సామర్థ్యం సరిపోకపోవటంతో 1977లో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి బీజం పడింది. అప్పటి నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్ అప్పారావు సారధ్యంలో ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విశేష కృషి చేశారు. చంద్రబాబు పాలనలోనే ప్రైవేట్‌పరం.. షుగర్స్ ఫ్యాక్టరీలో 1982–83 సీజన్లో ప్రారంభమైన చెరకు క్రషింగ్ 17 ఏళ్లు పాటు సహకార రంగంలో కొనసాగింది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీ నష్టాలను సాకుగా చూపి వేలం ద్వారా హనుమాన్ కోఆపరేటివ్ షుగర్స్‌ను లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గోకరాజు గంగరాజుకు రూ.11.40 కోట్లకు విక్రయించేశారు. అప్పట్లో సుమారు రూ. 300 కోట్లు విలువ చేసే సహకార రంగంలోని ఫ్యాక్టరీని, 90 ఎకరాల విలువైన భూమిని కారుచౌకగా తెలుగుదేశం ప్రభుత్వం విక్రయించటం రైతుల ఆగ్రహానికి కారణమైంది. కనీసం సహకార చెక్కర కార్మాగారంలో రైతుల 49 శాతం షేర్ వాటాను కూడా ఆనాటి సీఎం చంద్రబాబు చెల్లించకుండా మొండిచేయి చూపించారు. లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సారధ్యంలో ‘డెల్టా షుగర్స్’గా రూపాంతరం చెంది 2001–02 సీజన్లో రోజుకు 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైంది. 2015–16 నాటికి ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం 3500 టన్నులు కాగా, లక్షన్నర టన్నుల చెరకును క్రషింగ్ చేసి చక్కెర ఉత్పిత్తి చేశారు. ఫ్యాక్టరీ మూసివేత వ్యూహాత్మకమేనా? మూడేళ్లుగా డెల్టా షుగర్స్ యాజమాన్య వైఖరి పరిశీలిస్తే వ్యూహాత్మకంగానే మూసివేతకు ప్రణాళికతో ఉన్నారనిపిస్తోంది. చెరకు సాగు విస్తీర్ణంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవటం, రైతులకు సకాలంలో చెరకు తోలిన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయటం వంటి ఆంశాలు యాజమాన్యం తీరుపై పలు అనుమానాలను రేకేత్తించాయి. జాతీయ రహదారికి ఆనుకుని 100 ఎకరాల స్థలంలో ఫ్యాక్టరీ ఉండటంతో ఇతరత్రా వ్యాపార అవసరాలకు స్థలం వినియోగించుకునే దురుద్దేశంతోనే లాకౌట్ దిశగా అడుగులు వేశారని ప్రచారం. విలువైన స్థలంపై యాజమాన్యం దృష్టి పెట్టడంతోనే క్రమంగా ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం కాస్తా మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన కళా వెంకట్రావు... ఆయన్ని బుజ్జగించే యత్నం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే హనుమాన్ జంక్షన్‌లోని డెల్టా షుగర్స్ విషయంలో సీఎంవోలోని ఓ అధికారి తీరుతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే వంశీ తన రాజీనామా లేఖతో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన మరో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్... వంశీ వద్ద నుంచి రాజీనామా లేఖను తీసుకుని చింపివేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకు వెళ్లడంతో... వంశీని బుజ్జగించే అంశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అప్పగించారు. కాగా డెల్టా షుగర్స్‌ను హనుమాన్ జంక్షన్ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఉంది. అయితే తన నియోజకవర్గం నుంచి డెల్టా షుగర్స్‌ను తరలించవద్దని, అనేకమంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయంటూ... ఈ విషయంపై ఎమ్మెల్యే వంశీ ఇవాళ కొంతమంది రైతులతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వెళ్లారు. అయితే సీఎంవో కార్యాలయానికి చెందిన ఓ అధికారి... ఎమ్మెల్యే వంశీని అడ్డుకుని, విషయం తమతో చెప్పాలని, సీఎంను కలిసేందుకు ఇప్పుడు వీలు కాదని చెప్పడంతో... ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ దశలో ఆ అధికారి దురుసుగా ప్రవర్తించడంతో వంశీ... మనస్తాపంతో రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. -
చెరుకు రైతుకు మిగిలేది చేదే!
= పెరిగిన పెట్టుబడి వ్యయం = దక్కని గిట్టుబాటు ధర = ప్రకటించింది టన్నుకు రూ.2,400 = రూ.3,500 ఇవ్వాలని రైతుల డిమాండ్ హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : చెరుకు సాగు రైతన్నకు చేదును మిగుల్చుతోంది. గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నారు. ఏటా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతున్నా చక్కెర కర్మాగారాలు చెరుకు ధరలను పెంచకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హనుమాన్‌జంక్షన్‌లోని డెల్టా షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న బాపులపాడు, గన్నవరం, నూజివీడు, మైలవరం, చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి, పెదపాడు మండలాల్లో సుమారు 8,600 ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది. ఈ ఏడాది 2.40 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌ను ఫ్యాక్టరీ లక్ష్యంగా పెట్టుకుంది. తేలని గిట్టుబాటు ధర... మరో నెల రోజుల్లో చెరుకు క్రషింగ్ ప్రారంభం కానుంది. డెల్టా షుగర్స్ పరిధిలో 2013-14 సీజన్లో నాలుగు వేల ఎకరాల్లో మొక్క చెరుకు, మరో 4,600 ఎకరాల్లో పిలక చెరుకు సాగులో ఉంది. జిల్లాలోని కేసీపీ కర్మాగారం టన్ను చెరుకు ధర రూ.2,400గా ప్రకటించటంతో డెల్టా షుగర్స్ రైతులు అయోమయంలో పడ్డారు. గత సీజన్లో డెల్టా యాజమాన్యం టన్ను చెరుకు ధర సబ్సిడీ పోను రూ.2,200 అందజేసింది. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఉత్పత్తి వ్యయం అవుతుండగా, దిగుబడి మాత్రం 30 టన్నులకు మించటం లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లోనైనా డెల్టా యాజమాన్యం సరైన గిట్టుబాటు ధర ప్రకటిస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. తగ్గుతున్న సాగు విస్తీర్ణం... చెరుకు పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతాంగం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, పామాయిల్ సాగుకు రైతులు మొగ్గుచూపటంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యం సుమారు 25 లక్షల టన్నులు కాగా 2012-13 సీజన్లో 12 లక్షల టన్నులు మాత్రమే క్రషింగ్ కావటం దీనికి నిదర్శనం. డెల్టా ఫ్యాక్టరీ పరిధిలో గతంలో 12 వేల ఎకరాలకు పైబడి చెరుకు సాగులో ఉండగా 2011-12 సీజన్లో తొమ్మిదివేల ఎకరాలకు, 2012-13 సీజన్లో 8,600 ఎకరాలకు, ప్రస్తుతం 8,400 ఎకరాలకు సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గటం ఆందోళన కలిగిస్తోంది. రెట్టింపైన పెట్టుబడి వ్యయం.. ఏటా చెరుకు ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో గిట్టుబాటు ధరలు పెరగకపోవటంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అడ్డగోలుగా పెరిగిన డీజిల్, ఎరువుల ధరలు, కూలీల కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోపక్క కూలిరేట్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గత సీజన్లో ఎలుకల బెడద చెరుకు రైతును కోలుకోలేని దెబ్బ తీసింది. ఈసారి దిగుబడి ఆశాజనకంగానే ఉన్నా ధర ఏమాత్రం అందుతుందో వేచి చూడాల్సిందే. టన్నుకు రూ.3500 ఇవ్వాలి పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో టన్ను చెరుకు ధర రూ.3500 ప్రకటించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎకరాకు సుమారు లక్షన్నర రూపాయల వ్యయం అవుతోంది. చెరుకు రైతుల ద్వారా ఫ్యాక్టరీలకు లాభాలు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం భారీగా వస్తున్నా ఆరుగాలం కష్టించే రైతు మాత్రం నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. న్యాయమైన ధర ప్రకటించి చెరుకు సాగును నిలబెట్టుకోకపోతే భవిష్యత్‌లో గడ్డుకాలం ఎదుర్కోక తప్పదు. - నండూరు సత్య వెంకటేశ్వర శర్మ, చెరుకు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి