విజయనగరంలో మాట్లాడుతున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తాను తలచుకుంటే బజారులో నిలబెట్టి బట్టలూడదీస్తా ఖబడ్దార్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఎస్సార్‌సీపీ నేతలపై వీరంగం వేశారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి విజయనగరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నాయకులకే మంత్రి పదవులిచ్చి సామాజిక న్యాయం చేశానని చెప్పారు.
ఈ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటివరకు విజయసాయిరెడ్డి, ఇప్పుడేమో వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రపై పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. బొత్స సత్యనారాయణ ఆత్మ గౌరవాన్ని జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. అశోక్ గజపతిరాజు తండ్రి సింహాచలం దేవస్థానానికి ఇచ్చిన భూముల గురించి అడిగితే ఆయనపై కేసులు పెట్టారన్నారు. రామతీర్థం వచ్చిన తనపైనా కేసులు పెట్టారని అన్నారు.
అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి అరెస్టు చేశారని, 72 ఏళ్ల అయ్యన్నపాత్రుడుపై రేప్ కేసు పెట్టారని, కూన రవికుమార్‌పై కేసు పెట్టారని అన్నారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ముఖ్యమంత్రి ప్రయత్నించినా పని చేయలేదని, ఇప్పుడు పేద, ధనిక వర్గం అంటూ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాను సంక్షేమ పథకాలు తీసేయనని, ఇంకొన్ని ప్రవేశ పెడతానని అన్నారు. సంపద సృష్టించి పేదలకు ఇస్తానని చెప్పారు.
విజయనగరం జిల్లా అంతా బొత్స కుటుంబం దోపిడీ చేస్తోందన్నారు. విజయనగరంలో ఓ ఎమ్మెల్యే సెంటు భూమి కూడా వదలడంలేదన్నారు. ఉద్యోగులకు 23వ తేదీ వరకు జీతాలు రాలేదని చెప్పారు. తాను ఉద్యోగులకు భయపడ్డానని, ఇప్పుడు ఉద్యోగులను భయపెడుతున్నారని అన్నారు. పోలీసులకు సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వట్లేదని, పిల్లల చదువులకు, శుభకార్యాలకు జీపీఈ డబ్బులు రావట్లేదన్నారు. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేస్తున్నారని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేశారని, మహిళలను దెబ్బకొట్టారన్నారు. ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తుంటే లక్ష రూపాయలు నష్టపోతున్నారని చెప్పారు. విజయనగరం సభకు ఏర్పాట్లు చేసిన అదితి గజపతిరాజుని చంద్రబాబే స్వయంగా వేదిక నుంచి దింపేశారు. బాబు ప్రసంగానికి ముందు ‘అమ్మాయి కిందకు వెళ్లిపో’ అని అనడంతో ఆమె అవమానభారంతో వేదిక దిగేశారు.
ఉత్తరాంధ్ర వాళ్లు దద్దమ్మలు
ఉత్తరాంధ్ర వాళ్లు దద్దమ్మలని చంద్రబాబు ఉత్తరాంధ్ర వారిని అవమానించారు. ‘జగన్ ప్రభుత్వంలో 60 మంది సలహాదారులున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరైనా ఉన్నారా? ఉత్తరాంధ్ర వాళ్లు దద్దమ్మలు’ అని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌కు రాజధాని అంటూ విశాఖ పైనా విష ప్రచారం చేశారు.
‘సైకిల్ పోవాలి’ అంటూ బాబు నిత్య నినాదం
మొన్న రాజాంలో.. నిన్న బొబ్బిలిలో.. శనివారం విజయనగరంలో.. వరుసగా మూడోరోజూ చంద్రబాబు ‘సైకిల్ పోవాలి’ అంటూ నినదించారు. సాక్షాత్తూ చంద్రబాబే స్వయంగా ఇలా నినాదాలు చేయించడంతో టీడీపీ కార్యకర్తలు ‘ఇదేమి ఖర్మరా బాబూ’ అంటూ తలలు పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment