పాత హామీలే.. మారింది తేదీలే! | TDP Dharma Porata Deeksha In Prakasam Dist | Sakshi
Sakshi News home page

పాత హామీలే.. మారింది తేదీలే!

Published Sun, Jul 29 2018 9:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

TDP Dharma Porata Deeksha In Prakasam Dist - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాలుగేళ్లపాలనలో జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోమారు పాత హామీలను వల్లెవేయడం అందరిని ఆశ్చర్యపరించింది. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వెలిగొండ నీళ్లిచ్చే తేదీని మారుస్తూ రావడం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఇటీవల కందుకూరుకు వచ్చిన సీఎం సభలో ప్రసంగిస్తూ డిసెంబర్‌ నాటికి టన్నెల్‌–1 పనులను పూర్తి చేసి ఫేజ్‌–1లో నీరిస్తామని చెప్పారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆ ఏడాదిలో నీళ్లొదులుతామంటూ ఏదోక తేదీని ప్రకటించి వెళ్లడం ఆయనకు అలవాటు. తాజాగా శనివారం ఒంగోలులో నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష సభలో వచ్చే సంక్రాంతికి వెలిగొండ నీళ్లిస్తామని సీఎం మరోమారు కొత్తతేదీ ప్రకటించారు. 

వెలిగొండ నీటి విడుదలపై నోటికొచ్చిన తేదీలు ప్రకటిస్తూ వస్తున్న సీఎం తాజాగా ఒంగోలు సభలో మరో తేదీ ప్రకటించారు. పది రోజుల్లో పనులు మొదలు పెట్టి, సంక్రాంతి నాటికి ఫేజ్‌–1లో నీళ్లిస్తామన్నారు. మూడు నెలలుగా వెలిగొండ పనులు నిలిచి పోయాయి. పాత, కొత్త కాంట్రాక్టర్ల మధ్య వివాదం కోర్టుకెక్కింది. పాతవారిని ఒప్పించి కొత్తవారికి పనులు అప్పగించుకోవచ్చని న్యాయస్థానం సూచించినట్లు సమచారం. మరోవైపు తమకు రావాల్సిన డబ్బులిస్తే పనులు వదులకోవడానికి సిద్ధమని పాత కాంట్రాక్టర్లు ప్రభుత్వం ముందు గోడు వెళ్లబోసుకున్నారు. పాత కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించలేదు. దీంతో ప్రస్తుతం వెలిగొండ పనులు నిలిచి పోయాయి. అవేవి పట్టించుకోని ముఖ్యమంత్రి మాత్రం పది రోజుల్లో పనులు మొదలుపెడతామని, సంక్రాంతి నాటికి ఫేజ్‌–1లో నీళ్లిస్తామని ప్రకటించారు. 

ఇక ఈ ఏడాదిలోనే రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టుతో చేసుకున్న ఒప్పందం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. పోర్టు యాజమాన్యంతో మాట్లాడినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామాయపట్నం పోర్టును ప్రారంభిస్తామన్నారు. గుండ్లకమ్మ, కొరిశపాడు ఎత్తిపోతల పథకాల విషయంలో కోర్టు సమస్యలు ఉన్నాయని వారితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే సమస్యలు పరిష్కరించి పనులు పూర్తి చేస్తామన్నారు. దొనకొండకు ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ వస్తుందని సీఎం చెప్పారు.  నిమ్జ్‌కు కూడా త్వరలోనే పరిశ్రమలు వస్తాయన్నారు. ఒంగోలులో త్వరలోనే యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఒంగోలు నగరంలో 15వేల మందికి జీప్లస్‌ 3 కింద ఇళ్లు నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు. 

పేపర్‌ మిల్లుల యజమానులతో సంప్రదిస్తున్నాం..
జిల్లాలో సుబాబుల్, జామాయిల్‌ గిట్టుబాటు ధర సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇక్కడే ఉన్నారని,æ ఆయనతో మాట్లాడి ముందుకెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాలో పేపర్‌ మిల్లు ఏర్పాటుకు కొంత మంది మిల్లు యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం వెల్లడించారు. ట్రిపుల్‌ ఐటీని కనిగిరి వద్ద నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు ఇచ్చిన పాత హామీలనే శనివారం సభలో సీఎం చెప్పడంపై మరోమారు విమర్శలు వెల్లువెత్తాయి.

 నాలుగేళ్లు ఒక్క హామీని నెరవేర్చక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం పాత హామీలనే మరో మారు వల్లె వేయడంపై అధికార పార్టీ నేతలే పెదవి విరవడం కనిపించింది. ఈ సభలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు నారాయణ, పరిటాల సునీత, శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దనరావు, ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, కదిరి బాబూరావు, డేవిడ్‌రాజు, పోతల రామారావు, స్వామి, ఆమంచి కృష్ణమోహన్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దివి శివరామ్, ఇన్‌చార్జులు విజయ్‌కుమార్, కందుల నారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోతుల సునీత, కరణం వెంకటేష్, శిద్దా సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement