
బారికేడ్లు తోసుకుని బయటకుపోతున్న జనం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందంటూ నమ్మక ద్రోహం– కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం పేరుతో కాకినాడ జేఎన్‌టీయూకే క్రీడా మైదానంలో శుక్రవారం నిర్వహించిన సభ పూర్తిగా బీజేపీ, వైఎస్సార్ సీపీ, పవన్‌కల్యాణ్‌పై నిందలు వేసేందుకు నిర్వహించిన సభలా సాగింది. ఎన్ని ఇబ్బందులు పడ్డా రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకున్నారు. పదేపదే తాను నాలుగు సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తున్నానని చెప్పారు. తప్పుచేసిన వారిని వదిలిపెట్టలేదని దీనికి మీ సమాధానం చప్పట్ల ద్వారా తెలియజేయాలని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు.
సీఎం సభ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ముఖ్యమంత్రి గంటా ఎనిమిది నిమిషాలు ఆలస్యంగా రావడంతో 4.10 గంటలకు ప్రారంభమైంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించిన అనంతరం సుమారు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊకదంపుడు ఉపన్యాసం సాగించారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పదేపదే చెప్పడంతో ప్రజలు విసుగుచెంది వెనుతిరిగారంటే ఆయన ఉపన్యాసం ఎలా సాగిందో వేరే చెప్పనవసరం లేదు. మధ్యాహ్నమే సభాస్థలికి చేరిన ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలస్యంగా రావడంతో అసహనంతో ఉన్నారు. ఆయన ప్రసంగంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతుండగానే మహిళలు వెనుతిరగడం కన్పించింది. మరోపక్క సుమారు నాలుగుగంటలకు పైగా కూర్చున్నా కనీసం తాగేందుకు మంచినీరు కూడా అందకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
కళాశాల విద్యార్థులు సభకు
ముఖ్యమంత్రి నిర్వహించిన సభకు నాయకులు విద్యార్థులను తరలించారు. ఉదయం కళాశాలలను నిర్వహించి మధ్యాహ్నం సెలవు ప్రకటించి కళాశాలల బస్సుల్లోనే విద్యార్థులను నేరుగా సభాస్థలికి తీసుకొని వచ్చారు. పుస్తకాల బ్యాగ్‌లు వీపునకు తగిలించుకొని మరీ ముఖ్యమంత్రి సభలో కూర్చోవాల్సి వచ్చింది.
బస్సులు లేక ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
ముఖ్యమంత్రి సభకు జనాన్ని తీసుకొని వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు అన్ని నియోజకవర్గాలకు తరలించారు. దీంతో సాధారణ ప్రయాణికులు పడరానిపాట్లు పడ్డారు. ఎప్పుడూ రద్దీగా ఉండే కాకినాడ, రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లు బస్సులు లేక వెలవెలపోయాయి. జనాన్ని తరలించడానికి నాయకులు నానా తంటాలు పడ్డారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించారు. 1300కు పైగా ఆర్టీసీ బస్సుల ద్వారా సీఎం సభకు ప్రజలను తరలించారు.
దీక్ష సభలో విద్యుత్‌శాఖామంత్రి కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా తన రాజకీయ అనుభవంతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఐటీ, పంచాయతీరాజ్‌శాఖామంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ట్రైలర్ వేస్తేనే బీజేపీ ఓడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాయకులకు ఏపీలో సినిమా చూపిస్తామన్నారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ, పవన్‌కల్యాణ్ కుట్రపన్ని టీడీపీపై లేనిపోని నిందలు మోపుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కేంద్రంలో ప్రధానమంత్రిని నిర్ణయిస్తారని గొప్పలు చెప్పారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ విభజన హామీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గంగలో కలిపారన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ ఎంపీలుగాతాము ఎంత పోరాటం చేసిన ప్రత్యేక హోదా సాధ్యం కాలేదని, ప్రజల మద్దతు అవసరమన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కలిసి కట్టుగా పనిచేయాల్సిన తరుణం వచ్చిందన్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, కాకినాడ మేయర్ సుంకర పావని, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సభలో ఐక్యత చాటుతున్న సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment