ఢిల్లీ ధర్మాపోరాట దీక్షలో మాట్లాడిన శివాజీ
న్యూఢిల్లీ: ‘చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికో, వారి పార్టీకి సపోర్ట్ చేయడానికో నేను ఇక్కడకు రాలేదు. వీళ్లందరి కన్నా ఆంధ్రప్రదేశ్ నాకు ముఖ్యమ’ని నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం టీడీపీ నిర్వహించిన ధర్మాపోరాట దీక్షలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకి చెందనివాడినని చెప్పుకుంటూనే మా బాబు మహోన్నతుడు అంటూ స్తోత్రం చేశారు. పచ్చ పార్టీ అధినేతను మించినవారు లేరని ప్రశంసలు కురిపించి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతానంటూ వేదికనెక్కి చంద్రబాబు, లోకేశ్‌బాబులను ఆకాశానికెత్తారు.
ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాటకానికి శ్రీకారం చుట్టిన ఈ ‘మహానటుడు’ చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారని ఢిల్లీ వేదికగా మరోసారి రుజువైంది. బాబు దృష్టిలో పడేందుకు ప్రధాని, ఇతర నాయకులపై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ఒక్కరే హోదా కోసం పోరాడుతున్నారంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినా శివాజీకి కనబడకపోవడం విడ్డూరం. (చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’)
నాలుగు రోజులుగా హడావుడి చేస్తున్న చంద్రబాబుకే జై కొడుతూ తాను టీడీపీ గూటి చిలకనేనని రుజువు చేసుకున్నారు శివాజీ. పైకి మాత్రం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటారు. ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు చేతిలో చేయి వేసి నడుస్తారు. ఆయనతో పాటు వెళ్లి రాష్ట్రపతిని కలుస్తారు. బాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెబుతారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధిస్తామని దీమా వ్యక్తం చేస్తారు. చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికి రాకపోతే ఈ మాటలన్నీ ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలిస్తారు. నిజ జీవితంలోనూ నటిస్తున్న శివాజీ నిజస్వరూపం బట్టబయలైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment