
కర్నూలు నగర మ్యాప్ ఆధారంగా బందోబస్తు సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ గోపీనాథ్‌జట్టి
కర్నూలు /గాయత్రి ఎస్టేట్: ఎన్నడూలేని విధంగా అధికారుల హడావుడి.. పోలీసుల అతి జాగ్రత్తలు.. అడుగడుగునా ఆంక్షలు.. ట్రాఫిక్ మళ్లింపులు.. బారికేడ్లతో అడ్డుకోవడాలు..స్కూళ్లు త్వరగా మూసేయాలంటూ ఆదేశాలు..వెరసీ నగరంలో అందరికీ అవస్థలు. సీఎం చంద్రబాబు శనివారం ధర్మపోరాట దీక్ష కోసం కర్నూలు వస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీసులు చేపడుతున్న చర్యలు నగరవాసులకు ఇబ్బందికరంగా మారాయి. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఆంక్షలు విధించారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారన్న అనుమానంతో పలు విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం ముందస్తు అరెస్ట్‌లు చేశారు.
సాయంత్రం నుంచే వారిపై నిఘా ఉంచి.. అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏబీవీపీ రాష్ట్రనాయకుడు సూర్యను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ఆర్ విద్యార్థి సంఘం నాయకుడు కోనేటి వెంకటేశ్వర్లు, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములుతో పాటు మరికొందరు నేతల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యారంగ సమస్యల పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. నాలుగేళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. కళాశాలలు, పాఠశాలల్లో సౌకర్యాలు కొరవడి విద్యార్థులు అవస్థ పడుతున్నారు. వీటిపై విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న భయంతో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
స్కూళ్లు త్వరగా మూసేయండి
సీఎం వస్తున్నందున పాఠశాలలు త్వరగా మూసేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం పదిన్నరకల్లా మూసేయాలని స్పష్టం చేశారు. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని కొన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.
పోలీసుల వలయంలో కర్నూలు
సీఎం చంద్రబాబు శనివారం కర్నూలుకు వస్తున్న సందర్భంగా పోలీసులు నగరాన్ని ఒకరోజు ముందే స్వాధీనంలోకి తీసుకున్నారు. సమస్యాత్మక వ్యక్తులు, ప్రజాసంఘాల నాయకులపై ప్రత్యేక నిఘా ఉంచారు. నగరాన్ని మ్యాప్‌పాయింట్ ఆధారంగా సెక్టార్‌లుగా విభజించి ఇన్‌చార్జ్‌లను నియమించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల నుంచి బందోబస్తు విధులకు సిబ్బందిని రప్పించారు. సీఎం సభ జరిగే ప్రాంతంలో నిఘా పటిష్టం చేశారు. ఏపీఎస్పీ మైదానం నుంచి ఎస్టీబీసీ కళాశాల వరకు సీఎం పర్యటించే ప్రధాన రహదారుల్లో బాంబు స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ తనిఖీలు చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ప్రధాన రోడ్లకు బ్యారికేడ్లు అడ్డంపెట్టి ట్రాఫిక్ మళ్లించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వైఎస్‌ఆర్ సర్కిల్, ఐదు రోడ్ల కూడలి, రాజ్‌విహార్ సర్కిల్, ధర్మపేట సర్కిల్ రోడ్లను మొత్తం డివైడర్లతో మూసివేశారు. ఈ మార్గాల గుండా వెళ్లకుండా బస్సుల రాకపోకలను కూడా మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఏపీఎస్పీ మైదానం నుంచి ఎస్టీబీసీ కాలేజీ వరకు కాన్వాయ్ ట్రైల్స్ నిర్వహించారు. అలాగే ట్రైల్ రన్ కింద ఏపీఎస్పీ మైదానానికి సాయంత్రం హెలికాప్టర్ వచ్చి వెళ్లింది.
అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ
సీఎం పర్యటన పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆదేశించారు. వారికి శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో దిశానిర్దేశం చేశారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ స్థలాలు, బహిరంగ ప్రదేశాల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్‌లకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు మాధవరెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఏ.బాబుప్రసాద్, వెంకటాద్రి, యుగంధర్‌బాబు, ఖాదర్‌బాష, నజీముద్దీన్, గోపాలకృష్ణ, హుస్సేన్‌పీరా, వినోద్‌కుమార్, మురళీధర్, ఇలియాజ్‌బాష, సీఎం గంగయ్య, ఈ–కాప్స్ ఇన్‌చార్జ్ రాఘవరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలుపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment