Haailand
-
హాయ్‌ల్యాండ్‌లో రెండోరోజు బీజేపీ నేతల భేటీ
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం రెండో రోజు జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై సమావేశంలో చర్చించనునారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్, సోము వీర్రాజు, సతీష్ జి, సునీల్ దియోదర్ పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. జమిలీ ఎన్నికలు వస్తే సన్నద్దతపై చర్చించారు. నేడు మూడు గంటలకు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. -
హాయ్‌ల్యాండ్‌లో బీజేపీ నేతల సమావేశం
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై అనే పలికి.. దేశం కోసం పని చేసే కార్యకర్తలున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వం.. ఇందిరా గాంధీ తరహా పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అని మురళీధర్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు మురళీధర్ రావు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు.. ఇక టీఆర్ఎస్ను వ్యతిరేకించే వారికి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. బీజేపీకి 11 కోట్ల మందితో సభ్యత్వం ఉందని.. ప్రపంచంలో ఏ పార్టీకి ఇంత భారీ సభ్యత్వం లేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదని.. రెండూ కాళ్లు పట్టుకునే పార్టీలే అని విమర్శంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు వచ్చే నెల జూలై 6 నుంచి ఆగస్టు11 వరకూ సంఘటనా పర్వత్ పేరుతో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. -
పచ్చనేతల ఆశలపై హాయ్‘ల్యాండ్‌మైన్’
సాక్షి, అమరావతి: హాయ్‌ల్యాండ్‌ను అప్పన్నంగా కొట్టేద్దామనుకున్న ‘పచ్చ’నేతల ఆశలు ఆవిరయ్యాయి. హాయ్‌ల్యాండ్ కనీస ధర రూ.600 కోట్లుగా నిర్ణయించి, విక్రయానికి బిడ్లు పిలవాలంటూ అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు ప్రభుత్వ పెద్దలకు కలవరపాటుగా మారింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకునేందుకు ముఖ్యనేతలు సాగిస్తున్న ప్రయత్నాలకు చెక్‌పెట్టినట్టు అయ్యింది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి–16 వెంబడి గుంటూరు జిల్లాలో ఉన్న హాయ్‌ల్యాండ్ దాదాపు 86 ఎకరాల్లో విస్తరించి ఉంది. 68 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్‌తోపాటు క్లబ్, 18 ఎకరాల్లో కల్యాణమండపం, క్లబ్‌హౌస్, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఇందులోనే సుమారు పది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక హాయ్‌ల్యాండ్‌పై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. ఎవరి లెక్కలు వారివే.. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత కీలకమైన హాయ్‌ల్యాండ్‌ను పచ్చ నేతలు కేవలం రూ.250 నుంచి 350 కోట్లలోపు ధరకే అప్పన్నంగా కొట్టేసే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే, హాయ్‌ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని అగ్రిగోల్డ్ యాజమాన్యం పేర్కొంది. ‘ఆర్కా’ సంస్థ రూ.1800 కోట్లుగా చెప్పింది. హాయ్‌ల్యాండ్ విలువను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ హాయ్‌ల్యాండ్ విలువను రూ.522 కోట్లుగా అంచనా వేసింది. ఇదే సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. నిజానికి దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1,500 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. హాయ్‌ల్యాండ్ విలువ దాదాపు రూ.1,800 కోట్లు దేశంలో దాదాపు 32 లక్షల మంది ఖాతాదారులను మోసం చేసిన అగ్రిగోల్డ్ వ్యహారంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, ఈ కేసును సీఐడీకి అప్పగించడంపై అప్పట్లో అనుమానాలు తలెత్తాయి. అగ్రిగోల్డ్ సంస్థ మోసాలపై కేసులు నమోదు కావడం, ఆస్తుల స్వాధీనం వంటివి ప్రభుత్వ పెద్దలకు కలిసొచ్చాయి. తొలినుంచి అగ్రిగోల్డ్ సంస్థతో సంబంధం లేకుండా ఆస్తుల జాబితా నుంచి హాయ్‌ల్యాండ్‌ను తప్పించి అప్పన్నంగా కొట్టేసేందుకు గట్టి ప్రయత్నాలు సాగించారు. తొలుత ఆస్తుల ఎటాచ్‌మెంట్‌లో హాయ్‌ల్యాండ్ విషయమై ఆచితూచి వ్యవహరించారు. అటు తరువాత వేలం ప్రక్రియలోను హాయ్‌ల్యాండ్ తొలిదశలో లేకుండా తప్పించారు. రూ.1,500 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల విలువ చేసే హాయ్‌ల్యాండ్ తమది కాదని చెప్పి తప్పించుకోవడం ద్వారా ప్రభుత్వ పెద్దలకు సహకరించి, తద్వారా లబ్ధి పొందేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రయత్నించిదనే విమర్శలున్నాయి. అగ్రిగోల్డ్ సంస్థకు హాయ్‌ల్యాండ్‌తో సంబంధం లేదంటూ యాజమాన్యం నివేధించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు హడావుడిగా హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. దీంతో మాట మార్చిన అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ తమదేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో దాన్ని ఎవరైనా సరే వేలంలో పోటీ పడి కొనుక్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. శుక్రవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం హాయ్‌లాండ్ వేలానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హాయ్‌లాండ్ విలువ సుమారు రూ.800 కోట్లు ఉంటుందని యాజమాన్యం కోర్టుకు తెలపడంతో.. కనీస ధరను రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. సీల్డ్ కవర్లో బిడ్డర్స్‌ను ఆహ్వానించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న కోర్టు హాల్లోనే ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. వెయ్యి కోట్లకు బిడ్డర్సును తీసుకువాలని, అప్పడే బెయిల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌లో భాగమే!
సాక్షి, హైదరాబాద్: హాయ్‌ల్యాండ్ తమది కాదని గత వారం చెప్పిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇప్పుడు మళ్లీ మాట మార్చింది. సమాచార లోపంవల్లే ఆ పొరపాటు జరిగిందని, హాయ్‌ల్యాండ్ కూడా అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీల్లో భాగమేనని అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఈ విషయాలన్నింటితో వచ్చే వారం పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో సీఐడీ అధికారులు సైతం హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీదేనని హైకోర్టుకు నివేదించారు. అందుకు సంబంధించిన యాజమాన్య వివరాలను, తాజాగా దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచారు. వీటిని పరిశీలించిన హైకోర్టు, దర్యాప్తునకు సంబంధించిన వివరాలను పక్కన పెట్టి మిగిలిన వివరాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. అదే విధంగా హాయ్‌ల్యాండ్‌ను తాకట్టుపెట్టి దాని యాజమాన్యం రుణం తీసుకున్న నేపథ్యంలో, ఆ రుణ దరఖాస్తును, ఎప్పుడు రుణం ఇచ్చారు.. రుణం తీసుకున్నప్పుడు.. హాయ్‌ల్యాండ్ యజమానులు ఎవరు?.. ప్రస్తుతం హాయ్‌ల్యాండ్ యజమానులు ఎవరు?.. తదితర వివరాలను తమ ముందుంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. 2014లో హాయ్‌ల్యాండ్‌కు చెందిన 8 ఎకరాల భూమిని తాము కొనుగోలు చేశామని, అందువల్ల జప్తు నుంచి ఆ భూమిని విడుదల చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ శ్రీనివాసరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అటు ఎస్బీఐని, ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్వి భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. విచారణ సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ రెండు సీల్డ్ కవర్లను ధర్మాసనం ముందుంచారు. హాయ్‌ల్యాండ్ యాజమాన్యానికి సంబంధించిన వివరాలతో పాటు, సీఐడీ దర్యాప్తు నివేదికలు అందులో ఉన్నాయని తెలిపారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ యాజమాన్యానిదేనని తెలిపారు. దీనిపై ధర్మాసనం అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ప్రశ్నించింది. సమాచారం లోపంవల్ల పొరపాటు జరిగిందని, హాయ్‌ల్యాండ్ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్కు చెందిందని, ఇది అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీల్లో ఒకటని ఆయన కోర్టుకు నివేదించారు. గత వారం హాయ్‌ల్యాండ్ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించామని, అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆయనను ధర్మాసనం ప్రశ్నించింది. వచ్చే వారం పూర్తి వివరాలతో దాఖలు చేస్తానని జానకిరామిరెడ్డి చెప్పగా, ఏం వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆలోచిస్తున్నారా? అంటూ ధర్మాసనం వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఈ సమయంలో హాయ్‌ల్యాండ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ స్పందిస్తూ, అగ్రిగోల్డ్‌తో తమకు సంబంధం లేదంటూ గత వారం తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తనకు మౌఖిక సూచనలు వచ్చాయన్నారు. హాయ్‌ల్యాండ్ ఎండీ అరెస్టయ్యారని, అందువల్ల లిఖితపూర్వక సూచనలు రాలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అగ్రిగోల్డ్, హాయ్‌ల్యాండ్ యజమానులు చాలా తెలివిగా సాలెగూడు అల్లారని, ఇందులో ఇప్పుడు వారే చిక్కుకుపోతున్నారని వ్యాఖ్యానించింది. తమ ముందున్న అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి హాయ్‌ల్యాండ్ కనీస వేలం ధరను నిర్ణయిస్తామని తెలిపింది. -
హైకోర్టు ఆదేశాలతో సీఐడీలో చలనం
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ అస్తులు, నిందితుల అరెస్టుల విషయంలో ఇన్నాళ్లూ నిర్లిప్తంగా వ్యవహరించిన నేర పరిశోధన సంస్థ(సీఐడీ) ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు ముందుకు కదిలింది. హాయ్‌ల్యాండ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అల్లూరి వెంకటేశ్వరరావును బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. హాయ్‌ల్యాండ్ తమది కాదంటూ ఈ నెల 16న అగ్రిగోల్డ్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు విషయంలో సీఐడీ వ్యవహరిస్తున్న తీరుపైనా న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసి, ఈ కేసు విచారణ బాధ్యతను దానికి అప్పగిస్తామని తేల్చిచెప్పింది. అగ్రిగోల్డ్‌కు, హాయ్‌ల్యాండ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగక తప్పలేదు. ఉదయ్ దినకర్‌ను వదిలేసిన అధికారులు హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావుకు గురువారం గుంటూరు ఆరో అదనపు కోర్టు రిమాండ్ విధించింది. బుధవారం రాత్రి హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఉదయ్ దినకర్‌లను గుంటూరులో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో విచారించారు. అనంతరం ఉదయ్ దినకర్‌ను వదిలేసి అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్వరరావు అరెస్టును చూపించారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో కలిసి హాయ్‌ల్యాండ్ విషయంలో కుట్ర చేశాడనే అభియోగంపై డిపాజిట్ల యాక్ట్ 402, 403, 420 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. 27కు చేరిన అగ్రిగోల్డ్ నిందితుల సంఖ్య ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్(హాయ్‌ల్యాండ్) ఎండీగా 2005 ఆగస్టు 29న వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఆయన అరెస్టుతో అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. వెంకటేశ్వరరావు ఆర్కా లీజర్స్తోపాటు మరో 18 కంపెనీల్లో అదనపు డైరెక్టర్, డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. ఇవన్నీ అగ్రిగోల్డ్ గ్రూపునకు సంబంధించిన డొల్ల కంపెనీలే. వీటిలో 14 కంపెనీల్లో అగ్రిగోల్డ్ కేసుల్లో నిందితులైనఅవ్వా వెంకటశేషునారాయణరావు, కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, అవ్వా సీతారామారావు, సవడం శ్రీనివాస్, ఇమ్మడి సదాశివ వరప్రసాద్, అవ్వా హేమసుందర వరప్రసాద్, పఠాన్‌లాల్ అహ్మద్‌ఖాన్ తదితరులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వివిధ రకాల ఆకర్షణీయ పథకాల పేరిట సేకరించిన డిపాజిట్ల సొమ్మును మొత్తం 156 డొల్ల సంస్థల్లోకి అగ్రిగోల్డ్ యాజమాన్యం మళ్లించడంపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గకుండా సీఐడీ దర్యాప్తు చేపడితేనే తమకు న్యాయం జరుగుతుందని డిపాజిటర్లు, ఏజెంట్లు కోరుతున్నారు. సీఐడీకి నిబద్ధత లేదు డీజీపీకి అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ వినతి సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తులు, కేసుల విషయంపై సీఐడీ దర్యాప్తులో నిబద్ధత లేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు. దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ మేరకు వారు గురువారం డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం, సీఐడీ దర్యాప్తులో నిర్లక్ష్యం వల్ల 211 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని చెప్పారు. అగ్రిగోల్డ్ సిస్టర్స్ కంపెనీలుగా ఉన్న 156 సంస్థల డైరెక్టర్లను సీఐడీ కçస్టడీలోకి తీసుకొని విచారించాలని, వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకొని బాధితులకు పంచాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్లు, వారికుటుంబ సభ్యుల పేరిట ఉన్నబినామీ ఆస్తులను జప్తు చేసేందుకు సీఐడీ ఏనాడూ తగిన శ్రద్ధ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీని కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షులు బి.విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, ఉపప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌రావు ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని డీజీపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు అరెస్ట్
సాక్షి, విజయవాడ: హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లురి వెంకటేశ్వరరావును సీఐడీ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామరావుతో కలిసి హాయల్యాండ్‌పై కుట్ర చేశాడనే అభియోగంపై అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావు గతంలో అగ్రిగోల్డ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. అతడు 2005 ఆగస్టు 29న హాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆర్ కాలేజ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యతలు చేపట్టారు. వెంకటేశ్వరరావు అరెస్ట్‌తో అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. గురువారం వెంకటేశ్వరరావును అధికారులు సీఐడీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
గళాలకు సంకెళ్లు.. అగ్రిగోల్డ్ బాధితులపై ఉక్కుపాదం!
సాక్షి, గుంటూరు/ సాక్షి, అమరావతి/ నెట్వర్క్: అడుగడుగునా పోలీసులు... గజానికో బారికేడ్.. హాయ్‌ల్యాండ్ చుట్టూ 15 చెక్‌పోస్టులు... మిలటరీ దుస్తుల్లో భుజాన తుపాకులతో రిజర్వ్ పోలీసు బలగాలు... ‘అగ్రిగోల్డ్’, ‘హాయ్‌ల్యాండ్’.. అనే పేర్లు వినపడితే చాలు కన్నెర్ర చేస్తూ అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలింపు!.. ఇవీ బుధవారం విజయవాడ – గుంటూరు జాతీయ రహదారిపై కనిపించిన దృశ్యాలు. రాజధాని సమీపంలోని హాయ్‌ల్యాండ్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అణువణువూ తనిఖీ చేశారు. హాయ్‌ల్యాండ్ వద్దకు ఎవరూ వెళ్లకుండా సెలవు ప్రకటిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు, వామపక్షాలు, వైఎస్సార్ సీపీ నేతలను అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వ్యానుల్లోకి గెంటేశారు. ఉరితాళ్లతో మహిళల ఆందోళన అగ్రిగోల్డ్ ఏజెంట్లు, వినియోగదారుల సంక్షేమ సంఘం చేపట్టిన ‘చలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరులోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు చేరుకున్న అగ్రిగోల్డ్ బాధితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కన్నుగప్పి హాయ్‌ల్యాండ్ వద్దకు వచ్చిన ఏలూరుకు చెందిన వృద్ధురాలిని అడ్డుకుని ఆటోలో తాడేపల్లి తరలించారు. మంగళగిరి ‘వై’ జంక్షన్ వద్ద పోలీసులను ప్రతిఘటించిన బాధిత మహిళలు తమను అరెస్ట్ చేస్తే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ ఉరితాళ్లను పట్టుకుని హెచ్చరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘మా ఆగ్రహ జ్వాలల్లో మాడిమసైపోతావ్ చంద్రబాబూ..’ అంటూ మహిళలు శాపనార్ధాలు పెట్టారు. పైసాపైసా కూడబెట్టి డబ్బు దాచుకుంటే తమ కడుపు కొడతారా? అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ‘ఇంత విషం పెట్టి చంపండి.. లేదంటే అగ్రిగోల్డ్ యాజమాన్యాన్నైనా ఉరి తీయండి..’ అంటూ ఆక్రోశించారు. అరెస్టులు, గృహ నిర్బంధం అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావంగా హాయ్‌ల్యాండ్ వద్దకు బయల్దేరిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, హరినాధరెడ్డి, ఏపీ మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులకు బాసటగా నిలిచిన వైఎస్సార్ సీపీ నేత, అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరులో గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. చలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి అనుమతి లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా కొంతమందిని అరెస్ట్ చేసినట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. తాడేపల్లి కళ్యాణ మండపంలో బాధితుల ధర్నా గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులు, రోజువారీ కూలీలు, పనుల నిమిత్తం వెళుతున్న వారిని సైతం కిందకు దించి నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు ఆదేశించడంతో అవస్థలు పడ్డారు. హాయ్‌ల్యాండ్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు మంగళవారం నుంచే పలువురు నేతలు, అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులను గృహ నిర్భంధంలోకి తీసుకోవడంతోపాటు నోటీసులు జారీ చేసి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ అగ్రిగోల్డ్ బాధితులు హాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో అరెస్టులు చేసి తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. మరోవైపు హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీలకు చెందినదేనంటూ హైకోర్టుకు సమర్పించిన తమ నివేదికను వక్రీకరించడంపై మానసిక వ్యధకు గురైనట్లు మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరు వెంకటేశ్వరరావు పేరుతో ప్లెక్సీలను హాయ్‌ల్యాండ్ వద్ద ఏర్పాటు చేశారు. లెఫ్ట్ నేతల అరెస్టులు.. హాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి తరలి వస్తున్న పలువురు నేతలు, అగ్రిగోల్డ్ బాధితుల పట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. హాయ్‌ల్యాండ్‌కు వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను కనకదుర్గ వారధి వద్ద అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సినీనటుడు నాగినీడులతోపాటు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులను మంగళగిరి వద్ద పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితులు పోలీసు స్టేషన్లో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలపై ఆయన మండిపడ్డారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ ర్యాలీ అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన హాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో గృహ నిర్భంధం చేసిన పోలీసులు పార్టీకి చెందిన పలువురు నేతలకు నోటీసులిచ్చారు. హౌస్ అరెస్టులో ఉన్న అప్పిరెడ్డిని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు భరోసాగా నిలవకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్‌విలాస్ సెంటర్ వరకు అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు రోజులుగా గృహ నిర్భంధంలో ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాలు కలిసి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రోశం చంద్రబాబుకు అగ్రిగోల్డ్ నుంచి పార్టీ ఫండ్...చంద్రబాబు నాయుడు 1995లో విజయవాడలో అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించి ఆ సంస్థ నుంచి పార్టీ ఫండ్‌గా కొంత సొమ్ము తీసుకున్నారు. అనంతరం ఆయన హయాంలోనే 2015లో అగ్రిగోల్డ్ ప్లేటు ఫిరాయించింది. అనేకసార్లు చర్చలకు పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.11 వేల కోట్లు విడుదల చేసి బాధితులకు న్యాయం చేయాలి. – విశ్వనాధరెడ్డి, అనంతపురం ఊళ్లో తలెత్తుకోలేకపోతున్నాం... అగ్రిగోల్డ్‌లో రూ.60 లక్షల దాకా డబ్బులు కట్టించాం. బాధితులంతా మా ఇంటికి వచ్చి నిలదీయడంతో ఊళ్లో తలెత్తుకోలేకపోతున్నాం. వాళ్లు అడిగే మాటలకు ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. మా మీద నమ్మకంతో అంత సొమ్ము కట్టిన వారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణం. – రాజ్యలక్ష్మి, నెల్లూరు ఉరి తీయాలి... అగ్రిగోల్డ్ సంస్థలో కట్టిన డబ్బులు నా పిల్లాడి వైద్యానికి పనికొస్తాయనుకున్నాం. 2015 జనవరి 1వ తేదీన మా బాబుకు రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మూడు రోజుల్లో డబ్బులొస్తాయి, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించవచ్చనుకున్నాం. రూపాయి కూడా రాలేదు. ఆపరేషన్ చేయించినా మా అబ్బాయి ఆరోగ్యం క్షీణించింది. దీనికి బాధ్యులైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఉరి తీయాలి. – భాగ్యవతి, చిత్తూరు హాయ్‌ల్యాండ్‌పై బాబు కన్ను పడకుంటే న్యాయం జరిగేది.. చంద్రబాబు ఉద్యమం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చివరకు కోర్టులను సైతం మభ్యపెడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హాయ్‌ల్యాండ్‌పై కన్నేయకుంటే ఈపాటికి బాధితులకు న్యాయం జరిగేది. బాధితులకు అన్యాయం చేస్తే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పటం ఖాయం. – ఎం.అప్పలనాయుడు (విజయనగరం) నేరస్తుల్లా దెబ్బలు తినే దుస్థితి కల్పించింది... పేదలు కష్టపడి సంపాదించిన డబ్బు అగ్రిగోల్డ్‌లో కట్టి మోసపోయారు. న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించి నీరుగార్చింది. సొమ్ము కట్టి మోసపోయింది కాకుండా నేడు నేరస్తుల్లా పోలీసులతో దెబ్బలు తినాల్సిన పరిస్థితిని ప్రభుత్వం మాకు కల్పించింది. – బి. వెంకాయమ్మ, అగ్రిగోల్డ్ బాధితురాలు, తణుకు పోలీసులను ఉసిగొల్పారు.. అగ్రిగోల్డ్‌కు చెల్లించిన డబ్బులిప్పిస్తామని ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచింది. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ మా కడుపు కొడుతోంది. డబ్బులు ఇప్పించకపోగా పోలీసులను ఉసిగొలిపి చోద్యం చూస్తోంది. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతాం. – జి.వీరలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా మేం చేసిన తప్పేంటి? కష్టపడి సంపాదించిన డబ్బు కట్టి మోసపోవడమే మేం చేసిన తప్పా? కడుపుమండి రోడ్లపైకి వస్తే ప్రభుత్వం మాపై పోలీసులను ప్రయోగించి దారుణంగా ప్రవర్తిస్తోంది. శ్రీకాకుళం నుంచి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చా. పోలీసులు నేరస్తుడిలా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. – డి.బెహర, శ్రీకాకుళం ఊరు వదిలి దాక్కుని బతుకుతున్నా... నేను అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా పని చేశా. మా ఊరి ప్రజల నుంచి రూ.50 లక్షల వరకూ డబ్బులు కట్టించా. ఇప్పుడు వాళ్లంతా మా ఇంటి మీద పడుతున్నారు. సమాధానం చెప్పుకోలేక ఊరు వదిలి దాక్కొని బతుకుతున్నా. ఇలా ఇంకా ఎన్ని రోజులు దాక్కొని బతకాలి? ప్రభుత్వం ఇప్పటికైనా అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి మాకు డబ్బు చెల్లించి న్యాయం చేయాలి. లేకుంటే చావే శరణ్యం. – కె. సురేశ్, రాజమండ్రి వైఎస్సార్సీపీ నాయకుల గృహ నిర్బంధం అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన హాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో గృహ నిర్భంధం చేసిన పోలీసులు పార్టీకి చెందిన పలువురు నేతలకు నోటీసులిచ్చారు. హౌస్ అరెస్టులో ఉన్న అప్పిరెడ్డిని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు భరోసాగా నిలవకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్‌విలాస్ సెంటర్ వరకు అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు రోజులుగా గృహ నిర్భంధంలో ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాలు కలిసి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. మరో అగ్రిగోల్డ్ బాధితుడు మృతి మాచర్ల: హాయ్‌ల్యాండ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన ఓ అగ్రిగోల్డ్ బాధితుడు మనోవేదనతో మరణించాడు. గుంటూరు జిల్లా మాచర్లలో చిరు వ్యాపారంతో పొట్టపోసుకుంటూ రూపాయిరూపాయి కూడబెట్టి.. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసిన కొమెర గోవిందు (52) బుధవారం కన్నుమూశాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్‌కు చెందిన గోవిందు బడ్డీ కొట్టు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అందులో వచ్చిన కొద్దికొద్ది మొత్తాన్ని రూ.1.70 లక్షల మేర కూడబెట్టి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అగ్రిగోల్డ్ చేతులెత్తేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. న్యాయం జరగకపోతుందా? అని ఇన్నాళ్లూ ఎదురు చూసిన గోవిందు.. హాయ్‌ల్యాండ్ తమది కాదంటూ అగ్రిగోల్డ్ పిటిషన్ వేసినట్లు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తినోతినకో పొదుపు చేసిన సొమ్ము భవిష్యత్‌లో అక్కరకు వస్తుందని మదుపు చేస్తే.. నిండా మునిగిపోయామని కుమిలిపోయాడు. మూడు రోజులుగా బయటకు రాకుండా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. గోవిందుకు భార్య దుర్గ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు ప్రసాద్ బీటెక్ పూర్తిచేయగా.. రెండో కుమారుడు శివ డిగ్రీ, కుమార్తె శిరీష ఎంబీఏ చదువుతున్నారు. గోవిందు మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, న్యాయవాదుల సంఘం నాయకులు డేవిడ్ రాజు, మార్కొండారెడ్డి, సీపీఐ నేతలు బాలస్వామిరెడ్డి, బాబూరావు తదితరులు అతని ఇంటికి చేరుకొని కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గోవిందు అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగిన ప్రతిసారీ పాల్గొనేవాడని.. మూడు, నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆందోళనకు గురై మృతి చెందాడని ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘వారి చేతుల్లో టీడీపీ ఓటమి ఖాయం’
సాక్షి, విజయవాడ : హాయ్‌ల్యాండ్‌ను పోలీస్‌లతో అడ్డుకుని.. అరెస్టులు చేయడం అప్రజాస్వామికం.. అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నయాన్ని ముందుకు తీసుకు రావడానికి విపక్ష పార్టీలు కార్యాచరణ రూపొందించాయని తెలిపారు. వచ్చే నెల 20న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీలు, ఇతర కలిసి వచ్చే పార్టీలతో సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. హాయల్యాండ్ అంశంలో ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను కనీసం ఖండిచడం లేదని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికై చిత్త శుద్ధితో పని చేయడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెయ్యి కోట్లు కేటాయించి చిన్న మొత్తాల డిపాజిట్‌దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలపై విద్యార్థి యువజన సంఘాలు చేపట్టబోయే కార్యక్రమానికి తమ పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలే తమ ప్రధాన అజెండా అంటూ రామకృష్ణ ప్రకటించారు. కరువుపై ఆందోళన కార్యక్రమాలు : మధు తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందకు వెళ్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తెలిపారు. ఉపాధి హామీ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కరువుతో రైతులు వలస వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రాయలసీమ కరువుపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై రాబోయే పార్లమెంట్లో ప్రతిఘటన కార్యక్రమాలు చేపడతామన్నారు. -
‘ఛలో హాయ్‌ల్యాండ్’: కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం..
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీకి సిద్ధమైన బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పేరుతో ముట్టడి కార్యక్రమం చేపడుతుండటంతో.. గుంటూరు అర్బన్ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బాధితులు హాయ్‌ల్యాండ్‌ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాము తలపెట్టిన హ్యాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని బాధితులు కోరుతుండగా.. మరోవైపు ముట్టడిని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులను ప్రయోగిస్తోంది. ముట్టడిలో పాల్గొనేందుకు వస్తున్న బాధితులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ‘ఛలో హాయ్‌ల్యాండ్’ అప్డేట్స్ ఇవి.. అరెస్టులు, ఉద్రిక్తత అగ్రిగోల్డ్ బాధితులు తలపెట్టిన ఛలో హాయ్‌ల్యాండ్‌కు మద్దతు తెలిపేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హాయ్‌ల్యాండ్ సమీపంలో అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగలు పట్టుకోవడం చేతకాని పోలీసులు.. తమను అరెస్ట్ చేస్తున్నారని వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హాయ్‌ల్యాండ్ చుట్టూ 15 చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. గుంటూరు అర్బన్ జిల్లా మొత్తం 50 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముట్టడికి వచ్చే అగ్రిగోల్డ్ బాధితులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కాజా టోల్‌గేటు వద్ద పలువురు బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇక్కడ పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళగిరి వై జంక్షన్ వద్ద కూడా బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు ప్రతిఘటిస్తుండం పరిస్థితి ఉద్రిక్తం అనుమతి లేదు ‘‘ఛలో హాయ్‌ల్యాండ్’కు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పర్మిషన్ కోరింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వారికి అనుమతి ఇవ్వలేదు. శాంతిభద్రతలు విఘాతం కలిగించకుండా అందరూ సహకరించాలి. ఈ క్రమంలో ముందస్తుగా కొంతమందిని అరెస్ట్ చేశాం’ అని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు విలేకరులు తెలిపారు. బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పిలుపునివ్వడంతో ప్లేట్ ఫిరాయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ తమదేనంటూ మంగళవారం హడావుడిగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని అగ్రిగోల్డ్ బాధితులు స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు యాజమాన్యానికి మామూలేనని పేర్కొంటూ తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం సిద్ధమైందని, కోర్టు చీవాట్లు పెట్టినందువల్లే ప్లేట్ ఫిరాయించారని పేర్కొంటున్నారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ ఆస్తుల్లో భాగమేనని, తమకు వెంటనే న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు కోరుతున్నారు. -
హాయ్‌ల్యాండ్.. అగ్రిగోల్డ్ గ్రూప్‌దే
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని హాయ్‌ల్యాండ్ సంస్థ అగ్రిగోల్డ్ గ్రూపుల్లో భాగమేనని ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవే ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి వెం కటేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. హాయ్‌ల్యాండ్ యాజమాన్యమైన మెస్సర్స్ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈనెల 16న హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్లో తాము ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెం ట్ ప్రైవేట్ లిమిటెడ్.. అగ్రిగోల్డ్ గ్రూపునకు చెందిన ఒక కంపెనీగా తెలియజేశామన్నా రు. హాయ్‌ల్యాండ్ కానీ, ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు అగ్రిగోల్డ్ సంస్థ కు చెందినవి కాదని తాము ఎక్కడా, ఎప్పుడూ తెలపలేదని పిటిషన్లో పేర్కొన్నామన్నారు. తమ నివేదికను వక్రీకరించి తప్పు గా అర్థం చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేయడంతోపాటు మనోవ్యధకు గురిచేసిందన్నారు. అఫి డవిట్‌లో హాయ్‌ల్యాండ్ అనేది ఆతిథ్య పర్యాటక పరిశ్రమ, వినోద్ థీమ్ పార్కు నడిపేదానిగా తెలియజేశామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇం డియా ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం స్థిరాస్తి కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపా రు. కం పెనీస్ యాక్ట్ 1956 కింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్‌లో రెండు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయన్నారు. హాయ్‌ల్యాండ్ నిర్వహణ, వ్యాపారం అగ్రిగోల్డ్ గ్రూపులో మరో కంపెనీ అయిన అగ్రిగోల్డ్ ఫార్మా ఎస్టేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపారం నిర్వహణ నుంచి పూర్తిగా భిన్నమైనదని చెప్పారు. -
నేడు చలో హాయ్‌ల్యాండ్
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీకి బాధితులు సిద్ధమయ్యారు. అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బుధవారం ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పేరుతో ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్లేట్ ఫిరాయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ తమదేనంటూ మంగళవారం హడావుడిగా ప్రకటన చేసింది. అయితే తమ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని అగ్రిగోల్డ్ బాధితులు స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు యాజమాన్యానికి మామూలేనని పేర్కొంటూ తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం సిద్ధమైందని, కోర్టు చీవాట్లు పెట్టినందువల్లే ప్లేట్ ఫిరాయించారని పేర్కొంటున్నారు. తాము తలపెట్టిన హ్యాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని, శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలీసు అనుమతికి దరఖాస్తు.. ఛలో హాయ్‌ల్యాండ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పోలీసుశాఖకు సోమవారమే దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి లేదనే సాకుతో పోలీసులు తమపై విరుచుకుపడితే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంక్షేమం సంఘం హెచ్చరించింది. తమకు రావాల్సిన న్యాయమైన డిపాజిట్ల కోసం ‘ఛలో హాయ్‌ల్యాండ్’ నిర్వహించడం తప్పా? అని సంఘం ప్రశ్నించింది. అక్రమ అరెస్టులకు ఖండన... ఛలో హాయ్‌ల్యాండ్ నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేయడంతోపాటు గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. గుంటూరులో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను, అసోసియేషన్ నాయకులు కోట మాల్యాద్రి, ఉపవలపూడి రాము, బుదాల శ్రీనివాస్, వెంకట్రావ్, బొర్రా మల్లిఖార్జునరావు, చిన్న తిరుపతయ్య, హరినాధ్ తదితరులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నాలుగున్నరేళ్లుగా న్యాయం కోసం పోరాడిన బాధితులు గత్యంతరం లేక పోరాటానికి దిగితే అరెస్టులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బృందాలుగా ముట్టడి.. – అగ్రిగోల్డ్ బాధితులు నేడు చినకాకాని నుంచి ‘ఛలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరి ముట్టడిస్తారు. – విజయవాడ కనకదుర్గ వారధి వైపు ఒక బృందం, మంగళగిరి శివార్ల నుంచి మరో బృందం హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటుంది. -
పచ్చ కుట్ర
-
‘అగ్రిగోల్డ్’ ఆశలకు సమాధి.. హాయ్‌ల్యాండ్ ఆరగింపు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆశలకు సమాధి కడుతూ.. అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కోటరీ తాజాగా భారీగా స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ యాజమాన్యంతోనే న్యాయస్థానానికి కట్టుకథలు చెప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విలువైన ఆస్తిని కొల్లగొట్టడానికి దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడుతున్నారు. రూ.1,000 కోట్లకు పైగా విలువైన హాయ్‌ల్యాండ్ తమది కాదని చెప్పడం ద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రలకు యాజమాన్యం సహకరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు మనోవేదన గురై మరణిస్తున్నా సర్కారులో చలనం కనిపించడం లేదు. అగ్రిగోల్డ్ మోసంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తన పరిధిలోని సీఐడీకి ఈ కేసును హడావుడిగా అప్పగించి చేతులు దులుపుకుంది. హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం తాజాగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హాయ్‌ల్యాండ్ తమదేనని ఇన్నాళ్లూ చెప్పుకున్న యాజమాన్యం ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చడం వెనుక ప్రభుత్వంలోని బడాబాబుల హస్తం ఉందని బాధితులు చెబుతున్నారు. హాయ్‌ల్యాండ్ తమదేనని, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని ఆర్కా లీజర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అల్లూరు వెంకటేశ్వరరావు హైకోర్టుకు చెప్పడాన్ని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తప్పుపడుతోంది. దీనిపై ఆందోళనకు సిద్ధమని ప్రకటించింది. హాయ్‌ల్యాండ్‌పై తొలుత దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ కన్నేసింది. బేరం కుదరకపోవడంతో వెనక్కి తగ్గింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే దాదాపు 86 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్ విస్తరించింది. 68 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్, 18 ఎకరాల్లో కల్యాణ మండపం, క్లబ్‌హౌస్, వాహనాల పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇందులోనే దాదాపు 10 ఎకరాల్లో గుంటూరుకు చెందిన ఓ ప్రముఖుడు స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని కృష్ణా జిల్లా నూజివీడులో ఏర్పడుతుందని ఒకసారి, గుంటూరు–విజయవాడ మధ్య వస్తుందని ఇంకోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీకులిచ్చిన సంగతి తెలిసిందే. చివరకు అమరావతిని రాజధాని కేంద్రంగా ఎంపిక చేశారు. ఈ వ్యవహారాలన్నీ ముందుగానే పక్కాగా తెలిసిన ఓ పత్రికాధిపతి హాయ్‌ల్యాండ్‌ను దక్కించుకోవడానికి స్కెచ్ వేశారు. ఇందుకోసం అప్పట్లో రూ.400 వందల కోట్ల దాకా బేరసారాలు జరిగాయని సమాచారం. అనంతరం ఆ పత్రికాధిపతి అనూహ్యంగా ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. తర్వాత గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరపైకి వచ్చింది. హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను అగ్రిగోల్డ్ యాజమాన్యం అంగీకరించలేదు. ఇంతలో రాష్ట్ర ముఖ్యనేత కుమారుడు, ఆయనకు సన్నిహితుడైన ఓ మంత్రి కలిసి హాయ్‌ల్యాండ్‌పై కన్నేశారు. అగ్రిగోల్డ్ బాగోతాలపై ఎలాంటి కేసులు రాకుండా చూస్తామని, హాయ్‌ల్యాండ్‌ను తమకు ఉచితంగా ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో చివరకు రూ.200 కోట్లు ఇస్తామని ప్రతిపాదించారు. చినబాబు–అగ్రిగోల్డ్ డీల్‌కు అప్పటి విజయవాడ పోలీసు ఉన్నతాధికారి మధ్యవర్తిగా వ్యవహరించారు. చినబాబుకు సన్నిహితుడైన మంత్రి అప్పట్లో ఆరేడు నెలల పాటు హాయ్‌ల్యాండ్‌లోనే మకాం వేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముఖ్యనేతకు భాగస్వామిగా ఉన్న అధికార పార్టీ ఎంపీ కూడా హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎస్సెల్ గ్రూప్ కూడా రంగ ప్రవేశం చేసింది. విజయవాడ ఏలూరు రోడ్డులో అగ్రిగోల్డ్‌కు చెందిన మిల్క్ భవన్లో ఎస్సెల్ గ్రూప్ తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. రసవత్తరంగా టేకోవర్ డ్రామా అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేస్తామంటూ ఎస్సెల్ గ్రూప్‌నకు(జీ గ్రూప్) చెందిన సుభాష్‌చంద్ర పౌండేషన్ ముందుకు రావడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ప్రచారం జరిగింది. రూ.వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన అగ్రిగోల్డ్ ఆస్తులను నామమాత్రపు ధరకు టేకోవర్ చేసుకునే ప్రతిపాదన వెనుక చాలా తతంగం నడిచింది. ఇందుకు విజయవాడ, హైదరాబాద్‌లకు చెందిన పలువురు మధ్యవర్తిత్వం నెరిపారు. ఎస్సెల్ గ్రూప్ ఎండీ సుభాష్‌చంద్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతకు ముందే రెండు పర్యాయాలు వేర్వేరు ప్రాంతాల్లో వీరి భేటీ రహస్యంగా జరిగినట్టు సమాచారం. ఆ నేపథ్యంలోనే ఎస్సెల్ గ్రూప్‌నకు అగ్రిగోల్డ్ ఆస్తులను అప్పగించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తూ రావడంతో ఈ వ్యవహారం పక్కకు పోయింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయమై సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాయబేరం సాగించారు. బహిరంగ మార్కెట్లో రూ.35,000 కోట్లు వాస్తవానికి అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.35,000 కోట్ల పైమాటే. అగ్రిగోల్డ్ సంస్థ 32,02,630 మంది నుంచి రూ.6,380.52 కోట్ల డిపాజిట్లను సేకరించింది. ఈ డిపాజిట్లకు రూ.3,150 కోట్లకు పైగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్ముతో అనుబంధ సంస్థల పేరుతో అగ్రిగోల్డ్ యాజమాన్యం అపార్టుమెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, విల్లాలు, పవర్ ప్రాజెక్టులు, టింబర్ డిపోలు, డెయిరీఫామ్, రిసార్టులు, కార్యాలయ భవంతులను సమకూర్చుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ యజమాన్యం 18,395.74 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.35 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థల పేరిట 16,857.81 ఎకరాల భూములున్నాయి. తొలినుంచీ అడ్డగోలు వ్యవహారాలే... అగ్రిగోల్డ్ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత డైరెక్షన్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కొందరు తొలుత అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు బేరసారాలు జరిపారు. ప్రభుత్వాధినేతకు, అధికార పార్టీ ముఖ్యులకు అత్యంత సన్నిహితుడనే గుర్తింపు కలిగిన ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా అగ్రిగోల్డ్ ఆస్తులు, కేసుల వ్యవహారాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఒకదశలో హాయ్‌ల్యాండ్‌తోపాటు విజయవాడలోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయ భవనం, షాపింగ్ కాంప్లెక్స్, కీసరలోని పొలాలను తమకు కట్టబెడితే కేసుల నుంచి బయటపడేస్తామనే ప్రతిపాదనను అధికార పార్టీ పెద్దల తరఫున ఆ అధికారి తెచ్చారు. చివరకు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి బిడ్డర్లు రాకుండా అధికార పక్షం అడ్డుకున్నట్టు విమర్శలు వచ్చాయి. బిడ్లు వేసేందుకు వచ్చిన ఔత్సాహికులను కొందరు అధికార పక్షం నేతలు భయపెట్టి వెనక్కి పంపినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని ఆస్తులను దక్కించుకునేందుకు ఇతరులు బిడ్లు వేయకుండా తమ మనుషులనే రంగంలోకి దించినట్లు కూడా ప్రచారం జరిగింది. తక్కువ ధరకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు హాయ్‌ల్యాండ్‌ను తక్కువ ధరకే ఇచ్చేయాలని కొందరు ప్రముఖులు ఒత్తిడి తెచ్చారని, అయినా తాము లొంగలేదని అగ్రిగోల్డ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను అప్పణంగా కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చారు. పోలీసు అ«ధికారులను ప్రయోగించారు. బెదిరించారు. మేం ఏమాత్రం అంగీకరించలేదు. ముందుగా డిపాజిటర్లు, ఏజెంట్లకు డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేయండి. ఆ తరువాత మాట్లాడుకుని నిర్ణయానికి వద్దామని చెప్పాం. వారికి హాయ్‌ల్యాండ్ నచ్చిందట. ముందుగా ఇవ్వాలట. ఆ తరువాత మాట్లాడుతామన్నారు. మేం దానికి అంగీకరించలేదు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చెప్పాం. అందుకే మమ్మల్ని జైలుకు పంపారు’’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. డిపాజిటర్లకు సర్కారు అన్యాయం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నాలుగన్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారు 2.75 లక్షల మంది ఉన్నారు. వీరంతా మొత్తం రూ.491.99 కోట్లు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేశారు. ప్రభుత్వం కనీసం రూ.500 కోట్లు ఇచ్చినా ఇలాంటి చిన్న డిపాజిటర్లను న్యాయం జరుగుతుంది. కానీ, ఆ దిశగా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో దాదాపు 80 శాతం మంది ఏజెంట్లే ఉన్నారని అంచనా. ఒక్కో బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారాన్ని దశలవారీగా చెల్లిస్తోంది. హాయ్‌ల్యాండ్ విలువ గరిష్టంగా రూ.2,200 కోట్లు - హాయ్‌ల్యాండ్ విలువను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ హాయ్‌ల్యాండ్ విలువను రూ.522 కోట్లుగా లెక్కించింది. - ఇదే సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. - అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. - సుభాష్‌చంద్ర ఫౌండేషన్ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. - ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను సుభాష్‌చంద్ర ఫౌండేషన్ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2,200గా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ.6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. - ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ.3,966 కోట్ల మేర మోసం చేసినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా 160 కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. - తాజాగా హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీ కాదన్న విషయాన్ని గుర్తించకపోవడంపై సీఐడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్ వ్యవహారం హైకోర్టుకొచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని నిలదీసింది. 21న ‘చలో హాయ్‌ల్యాండ్’ అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకోవడానికి అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం సన్నద్ధమైంది. ఈ నెల 21వ తేదీలోగా ప్రజాప్రతినిధులు సైతం స్పందించాలని అల్టిమేటం ఇచ్చింది. తాము నోరు తెరిస్తే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించింది. ఈ నెల 21న ‘చలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి పిలుపిచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు ఆదివారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మీడియాతో మాట్లాడారు. హాయ్‌ల్యాండ్ కచ్చితంగా అగ్రిగోల్డ్ యాజమాన్యానిదేనని, ఇందుకు తగిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫున వాదిస్తున్న న్యాయవాది సైతం పలు సందర్భాల్లో కోర్టుకు కూడా ఈ విషయాన్ని చెప్పారని అన్నారు. హాయ్‌ల్యాండ్ తమదంటూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేని ఆర్కా లీజర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అల్లూరి వెంకటేశ్వరరావు చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావును అగ్రిగోల్డ్ యాజమాన్యం తన మేనేజర్‌గా నియమించుకుంటే ఇప్పుడాయన ఏకంగా బినామీగా మారి హాయ్‌ల్యాండ్ భూమి తనదనేదాకా ఎదిగారని మండిపడ్డారు. ప్రజాకోర్టులో శిక్ష తప్పదు 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్నిగోల్డ్ యాజమాన్యం కుట్ర పన్నుతోందని, దీని వెనుక రెండు రాజకీయ పార్టీల నేతలు, కొందరు అనధికార ప్రముఖులు ఉన్నారని ముప్పాళ్ల నాగేశ్వరరావు, తిరుపతిరావు ఆరోపించారు. రాజకీయ నేతల అండదండలు లేకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇంత బరితెగింపునకు ఒడిగట్టలేదన్నారు. కోర్టులో తప్పించుకున్నా ప్రజాకోర్టులో వీరికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆర్కా తరఫున వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 200 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని, వెంకటేశ్వరరావు పిటిషన్‌తో బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు కూడా నాటకాలు ఆడుతున్నారని, అగ్రిగోల్డ్‌లో దాదాపు 160 బినామీ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. హాయ్‌ల్యాండ్ భూమి తనదేనంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫున హాజరవుతున్న న్యాయవాది సైతం పలుమార్లు కోర్టుకు విన్నవించారని తెలిపారు. హాయ్‌ల్యాండ్ తమ కలల సౌధమని, దాని జోలికి రావొద్దని ఆ న్యాయవాది చెప్పారని గుర్తుచేశారు. దీనితో సంబంధం లేకుండానే బాధితులకు చెల్లించదగిన ఆస్తులు ఉన్నాయని ఆ న్యాయవాది గతంలో చెప్పారన్నారు. కోర్టునే మోసగించడానికి ప్రయత్నించిన అగ్రిగోల్డ్ యాజమాన్యానికి తగిన శిక్ష తప్పదన్నారు. ఈ నెల 21న హాయ్‌ల్యాండ్ ముట్టడికి పిలుపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించొద్దని, బందోబస్తు అవసరం లేదని ప్రభుత్వాన్ని కోరారు. 22వ తేదీ నుంచి గ్రామగ్రామాన సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై 21వ తేదీలోగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోతే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఆస్తులు దోచుకోవడానికి కుట్ర ‘‘అగ్రిగోల్డ్ వ్యవహారమంతా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. హాయ్‌ల్యాండ్‌తో అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని కోర్టుకు చెప్పడం వెనుక బడాబాబులున్నారు. కేసును విచారిస్తున్న సీఐడీ, మంత్రులు, అధికారులు అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని చెప్పకపోవడం గమనార్హం. విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు, లోకేశ్ కుట్ర పన్నారు. లక్షలాది మంది డిపాజిటర్లు, ఏజెంట్లను మోసగిస్తున్నారు.బాధితులెవరూ అధైర్యపడొద్దు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల వ్యవధిలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటారు’’ – ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, లేళ్ల అప్పిరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటి కన్వీనర్, న్యాయస్థానానికి ఎవరేం చెప్పారంటే.. - హాయ్‌ల్యాండ్ విలువను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ హాయ్‌ల్యాండ్ విలువను రూ.522 కోట్లుగా లెక్కించింది. - ఇదే సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. - అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. - సుభాష్‌చంద్ర ఫౌండేషన్ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. - ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను సుభాష్‌చంద్ర ఫౌండేషన్ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2,200గా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ.6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. - ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ.3,966 కోట్ల మేర మోసం చేసినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా 160 కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. - తాజాగా హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీ కాదన్న విషయాన్ని గుర్తించకపోవడంపై సీఐడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్ వ్యవహారం హైకోర్టుకొచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని నిలదీసింది. – సాక్షి, హైదరాబాద్ -
అగ్రిగోల్డ్ దెబ్బ.. అట్టుడికిన వినుకొండ!
బుచ్చినాయుడుకండ్రిగ/వినుకొండ: తమ ఏజెంట్లు, డిపాజిటర్లకు అగ్రిగోల్డ్ యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చింది. హాయ్‌ల్యాండ్ ఆస్తులతో తమకు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఏజెంట్లు, డిపాజిటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శనివారం చిత్తూరు జిల్లాలో ఓ ఏజెంట్ గుండెపోటుకు గురై మృతి చెందగా.. గుంటూరు జిల్లాలో ఆరుగురు బాధితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాలు.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కారణికి చెందిన సుబ్రమణ్యం (55) స్థానిక సోలార్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సోలారు ఫ్యాక్టరీ కొన్ని కారణాలతో మూతపడడంతో 2008లో కుటుంబ పోషణ నిమిత్తం అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా చేరాడు. దాదాపు 40 మంది దగ్గర అగ్రిగోల్డ్ రోజువారి కలెక్షన్లతో పాటు డిపాజిట్ల రూపంలో సుమారు రూ.15 లక్షలను సేకరించాడు. అగ్రిగోల్డ్ మూతపడడంతో సుబ్రమణ్యంకు డిపాజిటర్ల నుంచి ఒత్తిడి ప్రారంభమయ్యింది. శుక్రవారం హాయ్‌ల్యాండ్‌తో తమకు సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుబ్రమణ్యం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. గుండెలో నొప్పిగా ఉందని తెలపడంతో భార్య, కుమారుడు శ్రీకాళహస్తిలోని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వినుకొండలో మిన్నంటిన నిరసనలు అగ్రిగోల్డ్ బాధితుల నిరసనలతో గుంటూరు జిల్లా వినుకొండ అట్టుడికింది. సీపీఐ ఆధ్వర్యంలో బాధితులు పట్టణంలో భారీ నిరసనలకు దిగారు. శివయ్య స్థూపం సెంటర్‌కు చేరుకున్న బాధితుల ర్యాలీని ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆఖరి రూపాయి చివరి ఏజెంట్‌కు చేరేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ శివయ్య స్థూపం సెంటర్‌కు చేరుకోగానే మండలంలోని భారతాపురానికి చెందిన రాజారపు మునెయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. పోలీసులు, సీపీఐ నాయకులు రాజారపు మునెయ్యను అడ్డుకున్నారు. ఇంతలోనే పెదకంచర్లకు చెందిన మంచికంటి అప్పారావు, ఏటి సత్యం, విఠంరాజుపల్లికి చెందిన కె.సురేష్, పిట్టంబండకు చెందిన శివాసింగ్, నూజెండ్లకు చెందిన అరిగెల నాగేశ్వరరావు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు ఐదుగురు యువకులను క్షేమంగా కిందకు దించి ప్రథమ చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. బొల్లా పరామర్శ.. అంతకుముందు వైఎస్సార్సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు వెంటనే ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. బాధితుల ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై బాధితులు దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వ తీరుతోనే తమకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బాధితులు వైఎస్సార్సీపీ వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా రాగానే ఆయన్ని కలసి తమ సమస్యలు వినిపిస్తుండగా..ఆ సమయంలో అక్కడే ఉన్న సీపీఐ నేత ముప్పాళ్ల బాధితులనుద్దేశించి ‘పోరాటం చేయాలంటే వైఎస్సార్సీపీతో పొండి.. న్యాయం జరగాలంటే మాతో ఉండండి’ అని అనడంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ముప్పాళ్ల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు ‘జెండా కాదు ముఖ్యం అజెండా’ అని చెప్పడంతో ముప్పాళ్ల సర్దుకుని ‘అలా అనలేదు’ అంటూ మాటమార్చారు. -
అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తు తీరుపై ఉమ్మడి హైకోర్టు మండిపడింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి, దర్యాప్తు బాధ్యతలను దానికి అప్పగిస్తామని తేల్చి చెప్పింది. హాయ్ల్యాండ్కూ, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇదే సమయంలో హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎంత మాత్రం సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. మరోపక్క హాయ్‌ల్యాండ్ యాజమాన్యం కూడా తమని అగ్రిగోల్డ్‌కి చెందిన కంపెనీగా భావిస్తూ, తమ ఆస్తులను ఏపీ డిపాజిటర్ల చట్టం కింద ఇప్పటికే జప్తు చేశారని, అందువల్ల సర్ఫేసీ చట్టం కింద వాటిని వేలం వేసే అధికారం బ్యాంకులకు లేదని హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేసింది. హాయ్‌ల్యాండ్ విషయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం మాటమార్చడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇప్పటి వరకు హాయ్‌ల్యాండ్ తమదేనని చెప్పుకుంటూ ఆ మేర అఫిడవిట్ చేసి, ఇప్పుడు దానితో తమకు సంబంధం లేదని చెప్పడంలో ఉద్దేశం ఏమిటని నిలదీసింది. దీనికి అగ్రి గోల్డ్ యాజమాన్యం తగిన మూల్యం చెల్లించకపోక తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా మాట మార్చకుండా గట్టి గుణపాఠం నేర్పుతామంది. అప్పుడు డిపాజిటర్లతో, ఇప్పుడు న్యాయస్థానంతో ఆటలాడుకుంటున్నారని, ఇందుకు ఎదుర్కోబోయే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. సీఐడీ దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హాయ్‌ల్యాండ్ ఎంఓయూను పరిశీలిస్తే అందులో ఈ కంపెనీ యాజమాన్యం వివరాలుంటాయని, వాటి ఆధారంగా అగ్రిగోల్డ్ యాజమానులకు, హాయ్‌ల్యాండ్ యాజమానులకు ఉన్న సంబంధం తెలిసి ఉండేదని, ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏముందని నిలదీసింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ యాజమాన్యం విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోనున్నారో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. పర్యవసానాలు ఎదుర్కొంటారు విచారణ సందర్భంగా సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది.. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు, వాటి మార్కెట్, రిజిస్టర్ విలువను ధర్మాసనం ముందుంచారు. అటు తరువాత హాయ్‌ల్యాండ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ వాదనలు వినిపిస్తూ, హాయ్ల్యాండ్కూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తమ పూర్తి వాదనలను వినాలని కోరారు. దీనిపై అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ధర్మాసనం వివరణ కోరింది. ఆయన కూడా సంబంధం లేదని చెప్పారు. దీంతో ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది. హాయ్‌ల్యాండ్ విషయంలో మాట మార్చినందుకు వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. న్యాయస్థానాలతో ఆటలాడుకుంటే ఎలా ఉంటుందో వారికి చూపిస్తామని, వారు మోసం చేసింది కోర్టునే కాదు.. 32 లక్షల మంది డిపాజిటర్లను కూడా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్ పిటిషన్‌పై బ్యాంకులకు నోటీసులు హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారా? అని సీఐడీ అధికారులను ధర్మాసనం ప్రశ్నించగా, అతడు ఈ కేసులో నిందితుడు కాదని, అందుకే అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ చెప్పారు. అయితే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ మధ్య ఉన్న సంబంధాలను తప్పక తెలుసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకుల వేలం ప్రక్రియను సవాలు చేస్తూ హాయ్‌ల్యాండ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఎస్బీఐ, కర్ణాటక, ఓబీసీ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యాజ్యంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చి, వారికి కూడా నోటీసులిచ్చింది. అవ్వా సీతారామారావు, అల్లూరి వెంకటేశ్వరరావుల మధ్య ఉన్న సంబంధాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే హాయ్‌ల్యాండ్ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. -
హాయ్‌ల్యాండ్ వేలం వేసుకోండి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల్లో విలువైన హాయ్‌ల్యాండ్‌ను వేలం వేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు హైకోర్టు అనుమతి నిచ్చింది. హాయ్‌ల్యాండ్ భూములను తాకట్టు పెట్టి అగ్రిగోల్డ్ యాజమాన్యం దాదాపు రూ. 100 కోట్లు అప్పు తీసుకున్న నేపథ్యంలో సర్ఫేసీ (సెక్యూరిటైజేషన్ అండ్ రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ) చట్టం కింద వేలం ద్వారా ఆ అప్పును రాబట్టుకునేందుకు అనుమతి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ మోసంపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. లక్షల మంది డిపాజిటర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. హాయ్‌ల్యాండ్ వేలం తరువాత అందుకు సంబంధించిన వివరాలతో నివేదికను తమ ముందుంచాలని, ఆ నివేదికను పరిశీలించిన తరువాతే వేలాన్ని ఖరారు చేస్తామని ఎస్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్‌రెడ్డికి తెలిపింది. అదే విధంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం తాకట్టుపెట్టిన ఆస్తులన్నింటినీ కూడా వేలం వేసుకునేందుకు ఇతర బ్యాంకులకు కూడా హైకోర్టు అనుమతినిచ్చింది. తాకట్టు ఉన్న ఆస్తుల వేలానికి ఇకపై తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని బ్యాంకులకు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక తదుపరి విచారణ నాటికి జిల్లాల వారీగా అగ్రిగోల్డ్‌కు చెందిన 234 ఆస్తుల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్, మార్కెట్, రియల్టర్ల విలువలను తమ ముందుంచి తీరాలని, ఇది తామిస్తున్న చివరి అవకాశమని సీఐడీ, ఉభయ రాష్ట్రాలు, పిటిషనర్లకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటీవల అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన కీలక వ్యక్తి అరెస్టయిన నేపథ్యంలో అగ్రిగోల్డ్ నగదు మళ్లింపు వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, దాని నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది. ధర్మాసనం తీవ్ర అసంతృప్తి.. జిల్లాల వారీగా అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను సమర్పించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, పిటిషనర్లు, అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీనికి ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది కృష్ణప్రకాశ్ స్పందిస్తూ, తాము జిల్లాల వారీగా 54 ఆస్తుల వివరాలను ఓ నిర్ధిష్ట నమూనాలో సిద్ధం చేశామని తెలిపారు. ఆ నమూనాను పరిశీలించిన ధర్మాసనం ఇదే రీతిలో మిగిలిన ఆస్తుల వివరాలను సమర్పించాలంది. తెలంగాణ ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా ఆస్తుల వివరాలిచ్చింది. అయితే అటు పిటిషనర్లు, ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యం వివరాలు సమర్పించకకోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్ విలువ ఎంత?.. హాయ్‌ల్యాండ్ విలువ ఎంత కట్టారని ఎస్బీఐ న్యాయవాది నరేందర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో కట్టిన విలువ రూ. 366 కోట్లని ఆయన సమాధానం ఇచ్చారు. దీనికి అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి అభ్యంతరం చెబుతూ.. హాయ్‌ల్యాండ్ ప్రస్తుత విలువ రూ. 1000 కోట్లు ఉంటుందని, గత ఏడాది ప్రభుత్వమే రూ.600 కోట్లుగా లెక్కకట్టిందని తెలిపారు. హాయ్‌ల్యాండ్ విలువపై సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు న్యాయవాది రాహుల్ స్పందిస్తూ.. తమ వద్ద వివరాలు వేవన్నారు. ఇక శ్రీకాళహస్తిలోని సర్వే నంబర్ 272లో అగ్రిగోల్డ్‌కు చెందిన 5.86 ఎకరాలను రిత్విక్ ఎనర్జీస్ సంస్థ రూ.8.88 కోట్లకు కొనుగోలుకు ముందుకొచ్చిందని నరేందర్‌రెడ్డి తెలిపారు. తమకు రావాల్సింది రూ.7.66 కోట్లను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హైకోర్టు వద్ద డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ వేలానికి అనుమతి ఇచ్చింది. అలాగే విజయవాడ, మొఘల్రాజపురంలో ఉన్న అగ్రిగోల్డ్ కార్పొరేట్ కార్యాలయం వేలంలో రూ. 11.11 కోట్లకు బిడ్ దాఖలు చేసిన టి.చంద్రశేఖరరావు మిగిలిన మొత్తం చెల్లిస్తే, ఆ భవనాన్ని అతనికి స్వాధీనం చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. -
వేలానికి హాయ్‌ల్యాండ్!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ ప్రతిపాదన నుంచి ఎస్సెల్ గ్రూపునకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో హైకోర్టు తాజాగా హాయ్‌ల్యాండ్ విక్రయంపై దృష్టి సారించింది. హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయడం ద్వారా భారీగా డబ్బు సమకూరే అవకాశం ఉండటంతో ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ భూములను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ) నుంచి రుణం తీసుకుంది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో హాయ్‌ల్యాండ్ విలువ, అప్పుల వివరాలను తెలియచేయాలని ఎస్బీఐ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ వేలానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, దీనివల్ల డబ్బు సమకూరి డిపాజిటర్లకు మొదటి ఇన్స్టాల్మెంట్ కింద ఎంతో కొంత చెల్లించేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది. తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల విలువెంత? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను జిల్లాల వారీగా విభజించి బహిరంగ మార్కెట్ విలువ, రియల్టీ విలువ, సబ్ రిజిష్ట్రార్ విలువను పట్టిక రూపంలో సమర్పించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని, పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఎవరికి వారు స్వతంత్రంగా ఈ వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. వీటిని పరిశీలించి ఒక్కో ఆస్తి కనీస వేలం ధరను నిర్ణయిస్తామని తెలిపింది. ఇకపై అగ్రిగోల్డ్ ఆస్తులను జిల్లా కమిటీల ద్వారా ఏకకాలంలో వేలం వేస్తామని పేర్కొంది. మినహాయిస్తామని మొదటి రోజే చెప్పాం.. అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని, దీనికి అనుమతినిస్తూ తాము డిపాజిట్ చేసిన రూ.10 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ సుభాష్‌చంద్ర ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. అయితే మొత్తం రూ.10 కోట్లను వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని, కొంత మినహాయించి మిగిలింది ఇస్తామని ప్రకటించింది. టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోయారన్న కారణంతో తాము ఈ పని చేయడం లేదని, ఎంతో కొంత మొత్తాన్ని మినహాయిస్తామని ఈ కేసులో ప్రతివాదిగా చేరిన మొదటి రోజే చెప్పామని గుర్తు చేసింది. ఆస్తుల టేకోవర్‌కు తాము శక్తివంచన లేకుండా కృషి చేశామని, తమ అదుపులో లేని కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కి వెళ్లిపోతున్నామని, సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం తెలిపారు. ఇక ప్రతి శుక్రవారం కేసు విచారణ అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్‌కు సంబంధించి సీఐడీ నివేదికను తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇకపై ఈ కేసును ప్రతి శుక్రవారం విచారించనున్నట్లు పేర్కొంటూ తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మీ పాత్ర చాలా పరిమితం... వేలం నిమిత్తం అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 50 వరకు గుర్తించినట్లు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్ జాబితాను కోర్టుకు సమర్పించారు. కొన్ని ఆస్తులకు సీఐడీ చెబుతున్న ధర చాలా తక్కువగా ఉందని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ద్వారా జరిగే వేలంలో భూములకు తక్కువ ధరే వస్తుందని పేర్కొంది. ‘మీరు (అగ్రిగోల్డ్) మీ ఆస్తుల విలువ రూ.20 వేల కోట్లకు పైగా చెప్పారు. చివరకు అది రూ.2 వేల కోట్ల వద్ద ఆగిపోయింది. మీరు ఒక్క వేలందారుడిని కూడా తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఆస్తుల విలువ తక్కువగా ఉందంటున్నారు. ఈ కేసులో ఇకపై మీ పాత్ర చాలా పరిమితం. టేకోవర్ ప్రతిపాదన నుంచి వెనక్కివెళ్లిపోవడానికి మీరు కూడా కారణమని సుభాష్‌చంద్ర ఫౌండేషన్ చెబుతోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగానే అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్ గురించి హైకోర్టు ఆరా తీసింది. -
నవ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
-
నవ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
-
నవ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
గుంటూరు : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. గురువారం హాయ్లాండ్లో జరిగిన ముస్తఫా కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. నవ దంపతులను ఆశీస్సులు అందించారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన వైఎస్ జగన్ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హాయ్‌లాండ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళతారు. -
గుంటూరు బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం గుంటూరు బయల్దేరారు. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి రూరల్ మండల పరిధిలోని హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటారు. కాగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె షేక్ నూరి ఫాతిమా వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు. -
'కారణాలు చిరంజీవే వివరిస్తారు'
ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకోకుండా వేదిక మార్చాల్సి రావటంతో ఏర్పాట్లను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గుంటూరులోని హాయ్లాండ్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడగా.. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఫంక్షన్‌కు అనుమతులు వచ్చినట్టుగా ప్రకటించారు. అయితే వేదిక మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చిరంజీవే వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు అనుమతి ఇవ్వలేదని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. మెగా హీరోలందరూ ఈ వేడుకలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతుండగా.. పవన్ వస్తాడా రాడా అన్న అనుమానం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ విషయం పై కూడా క్లారిటీ ఇచ్చిన అరవింద్, పవన్ ఖైదీ వేడుకకు హాజరు కావటం లేదని తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రాలేకపోతున్నారన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు. -
‘సీఐడీ ద్వారానే ఆస్తుల అమ్మకం జరపాలి’
-
‘సీఐడీ ద్వారానే ఆస్తుల అమ్మకం జరపాలి’
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి సీఐడీ ద్వారానే ఆస్తుల అమ్మకం జరపాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీలోగా ఆస్తుల తొలిదశ వివరాలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. విజయవాడలో ఉన్న ఏడు ఆస్తులు అమ్మాలని హైకోర్టు సూచనలు చేసింది. 19న ఓపెన్ బిడ్డింగ్ చేపట్టాలని...ఆస్తుల మార్కెట్ విలువను 21న కోర్టుకు సమర్పించి, 28న పత్రికలో ప్రకటన ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు అగ్రిగోల్డ్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. హాయ్‌ల్యాండ్‌పై కొంతమంది ప్రభుత్వ పెద్దలు కన్నేశారని, సీఐడీ ద్వారా కాజేయాలని ప్రయత్నించారని ఆరోపించింది. హాయ్‌లాండ్‌ను అమ్మకుండానే డబ్బులు చెల్లిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యం తెలిపింది. -
బాబు సీఎం అయ్యాకే అగ్రిగోల్డ్ సమస్య
అగ్రిగోల్డ్ సదస్సులో బాధితుల ఆగ్రహం విజయవాడ : చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే అగ్రిగోల్డ్ సమస్య వచ్చిందని పలువురు బాధితులు ధ్వజమెత్తారు. స్థానిక అమ్మ కల్యాణమండపంలో శనివారం సీఐడీ ఏర్పాటుచేసిన అగ్రిగోల్డ్ ఖాతాదారుల అవగాహన సదస్సులో పలువురు సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పలువురు బాధితులు సీఐడీ వారిని నిలదీయడంతో సదస్సు గందరగోళంగా మారింది. లక్షలాది మంది ఖాతాదారుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కొంతమంది ఖాతాదారులు పేర్కొన్నారు. డబ్బు చెల్లించిన ఖాతాదారులు తమ ఇళ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతున్నారని ఏజెంట్లు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు వందమంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే మరెందరో ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఐడీ చీఫ్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ ఆవేశం, ఉద్రేకంతో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. స్పెషల్ కోర్టు నుంచి ఈ కేసు హైకోర్టుకు వెళ్లిందన్నారు. సీఐడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో హాయ్‌ల్యాండ్ కూడా ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లు ఇంకా ఏమైనా సమ్యలు ఉంటే సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఒక దశలో పలువురు బాధితులు సంయమనం కోల్పోవడంతో సీఐడీ చీఫ్ జోక్యం చేసుకుని ఈ కేసులో తమది దర్యాప్తు సంస్థ మాత్రమేనన్నారు. తాము ఖాతాదారులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, సహకరించాలన్నారు. ఎన్నాళ్లు ఆగాలి ఎన్నాళ్లు ఆగాలి. మా డబ్బు ఎప్పటికి వస్తుంది. అగ్రిగోల్డ్ కేసు విషయంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. ఆస్తులు వేలం ఎప్పుడు వేస్తారు. ఆస్తులు స్వాధీనం చేసుకున్నందున ప్రభుత్వ ప్యాకేజీ ఇవ్వాలి. ముందుగా కొంత డబ్బు విడుదల చేసి ఖాతాదారులకు చెల్లించాలి. చిల్లిగవ్వలేక నానా అగచాట్లు పడుతున్నాం. వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. - లక్ష్మి, రాయగడ, ఒడిశా మా సొమ్ము ఇప్పించండి.. అగ్రిగోల్డ్ ఎప్పటినుంచో నష్టాల్లో ఉంది. టీడీపీ అధికారంలోకి రాక ముందు నుంచే చెక్కులు ఆలస్యంగా చెల్లుబాటు అవుతున్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి పాలపక్షం నేతలు ఎందరో అగ్రిగోల్డ్ యాజమాన్యంతో మాట్లాడుకుని తమ చెక్కులు క్లియర్ అయ్యేలా చూసుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాకే ఈ సమస్య వచ్చింది. వెంటనే హాయ్‌ల్యాండ్‌ను విక్రయించి బాధితులకు సొమ్ము చెల్లించాలి. - యువరాజు, గుంటూరు -
బైక్ రేసుల జోరు
మంగళగిరి మండలంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు రోడ్లు, చినకాకాని హాయ్‌ల్యాండ్ రోడ్డు బైక్ రేసులకు అడ్డాగా మారాయి. శని,ఆదివారాల్లో కొందరు యువకులు ఖరీదైన బైకులతో ఈ ప్రాంతాల్లో ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ అతివేగంగా తిరుగుతూ స్థానికులను హడలెత్తిస్తున్నారు. రేసుల్లో విజయవాడకు చెందిన బడాబాబుల, రాజకీయ పార్టీల నేతల కుమారులు పాల్గొంటున్నారు. రేసుల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన బైకులను వినియోగిస్తున్నారు. ్ధ బైక్ రేసులను కేవలం సరదా కోసమే కాకుండా డబ్బు సంపాదనకు మార్గంగా ఎంచుకోవటం విస్మయం కలిగిస్తోంది. రేసులపై లక్షలాది రూపాయల మేర పందాలు సాగుతున్నారుు. వీటిని పోలీసులు సీరియస్‌గా తీసుకోవటం లేదు. సమాచారం అందినపుడు తూతూమంత్రంగా స్పందించి చేతులు దులుపుకుంటున్నారు. రేసులకు పాల్పడుతున్నది బడాబాబుల పిల్లలు కావటంతో ఒత్తిళ్లకు తలొగ్గి హెచ్చరికలతో వదిలేస్తున్నారు. ఎలాంటి కేసులూ నమోదు చేయటం లేదు. ్ధ మంగళగిరి పరిసరాల్లో బైక్ రేస్‌లు నిర్వహిస్తూ యువకులు ఈ నెలలో ఇప్పటివరకు మూడుసార్లు పోలీసులకు పట్టుబడ్డారు. అరుుతే అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారిని వదిలేశారు. తాజాగా ఆదివారం ఉదయం కాజ టోల్గేట్ వద్ద బైక్ రేసులో పాల్గొనేందుకు వచ్చి రూరల్ పోలీసులకు పట్టుబడినవారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్ధ ఉన్నారు. అరుుతే ఎమ్మెల్యే ఒత్తిడితో రేసు కోసం వచ్చిన మరో ఏడుగురు యువకులను, ఐదు బైకులను పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలివేయడం గమనార్హం. ్ధ రేస్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవటం ఖాయం. దీనివల్ల ఆయూ కుటుంబాలవారికి తీరని విషాదమే మిగులుతుంది. అలాంటిదేదైనా జరిగితే తామే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిసినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రేసుల్లో పాల్గొంటున్న యువకులు ఇంజినీరింగ్‌లాంటి ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నవారే కావడం విశేషం. వేగం, ఫీట్లపై పందాలు.. బైక్ రేసుల్లో పాల్గొనే యువకులు వేగం, ఫీట్లపై పందాలు కాస్తుంటారు. ఉదాహరణకు జాతీయ రహదారిపై కాజ టోల్గేట్ నుంచి మంగళగిరి-తెనాలి జంక్షన్ వరకు గమ్యమని నిర్ణయించుకుంటే సుమారు ఐదు కిలోమీటర్లు ఉండే ఈ దూరాన్ని ఎవరు ముందు దాటితే వారు విజయం సాధించినట్లు పరిగణిస్తారు. అత్యాధునిక బైకులు కావడంతో స్టార్ట్ చేసిన కొద్ది సెకన్లలోనే గంటకు 150 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంటాయి. = ఇక పందెం కోసం బైకులపై యువకులు చేసే ఫీట్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి ఫీట్లను పెద్దగా జనసంచారం లేని రోడ్లపై చేస్తుంటారు. ప్రధానంగా చినకాకాని హాయ్‌ల్యాండ్ రోడ్డును వినియోగిస్తుంటారు. అతివేగంగా దూసుకువచ్చి సడన్ బ్రేక్ వేసి ముందు చక్రంపై బైక్‌ను నిలబెట్టడం, అతివేగంగా రింగ్‌లు తిరగడం, బైక్‌ను పడుకోబెట్టినట్టు ఉంచి ఎంతసేపు నడుపుతారనే విషయాలపై పందాలు జరుగుతుంటాయి. చర్యలు తీసుకుంటాం.. ఈ విషయమై రూరల్ సీఐ హరికృష్ణ వివరణ కోరగా బైక్ రేసులు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎవరైనా బైక్ రేసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేసులు జరిగే ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేస్తామని, రేసులు జరుగకుండా అడ్డుకోవడంతోపాటు యువకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.