సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తు తీరుపై ఉమ్మడి హైకోర్టు మండిపడింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి, దర్యాప్తు బాధ్యతలను దానికి అప్పగిస్తామని తేల్చి చెప్పింది. హాయ్‌ల్యాండ్‌కూ, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇదే సమయంలో హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎంత మాత్రం సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. మరోపక్క హాయ్‌ల్యాండ్ యాజమాన్యం కూడా తమని అగ్రిగోల్డ్‌కి చెందిన కంపెనీగా భావిస్తూ, తమ ఆస్తులను ఏపీ డిపాజిటర్ల చట్టం కింద ఇప్పటికే జప్తు చేశారని, అందువల్ల సర్ఫేసీ చట్టం కింద వాటిని వేలం వేసే అధికారం బ్యాంకులకు లేదని హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేసింది. హాయ్‌ల్యాండ్ విషయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం మాటమార్చడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇప్పటి వరకు హాయ్‌ల్యాండ్ తమదేనని చెప్పుకుంటూ ఆ మేర అఫిడవిట్ చేసి, ఇప్పుడు దానితో తమకు సంబంధం లేదని చెప్పడంలో ఉద్దేశం ఏమిటని నిలదీసింది. దీనికి అగ్రి గోల్డ్ యాజమాన్యం తగిన మూల్యం చెల్లించకపోక తప్పదని హెచ్చరించింది.
భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా మాట మార్చకుండా గట్టి గుణపాఠం నేర్పుతామంది. అప్పుడు డిపాజిటర్లతో, ఇప్పుడు న్యాయస్థానంతో ఆటలాడుకుంటున్నారని, ఇందుకు ఎదుర్కోబోయే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. సీఐడీ దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హాయ్‌ల్యాండ్ ఎంఓయూను పరిశీలిస్తే అందులో ఈ కంపెనీ యాజమాన్యం వివరాలుంటాయని, వాటి ఆధారంగా అగ్రిగోల్డ్ యాజమానులకు, హాయ్‌ల్యాండ్ యాజమానులకు ఉన్న సంబంధం తెలిసి ఉండేదని, ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏముందని నిలదీసింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ యాజమాన్యం విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోనున్నారో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది.
పర్యవసానాలు ఎదుర్కొంటారు
విచారణ సందర్భంగా సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది.. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు, వాటి మార్కెట్, రిజిస్టర్ విలువను ధర్మాసనం ముందుంచారు. అటు తరువాత హాయ్‌ల్యాండ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ వాదనలు వినిపిస్తూ, హాయ్‌ల్యాండ్‌కూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తమ పూర్తి వాదనలను వినాలని కోరారు. దీనిపై అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ధర్మాసనం వివరణ కోరింది. ఆయన కూడా సంబంధం లేదని చెప్పారు. దీంతో ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది. హాయ్‌ల్యాండ్ విషయంలో మాట మార్చినందుకు వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. న్యాయస్థానాలతో ఆటలాడుకుంటే ఎలా ఉంటుందో వారికి చూపిస్తామని, వారు మోసం చేసింది కోర్టునే కాదు.. 32 లక్షల మంది డిపాజిటర్లను కూడా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
హాయ్‌ల్యాండ్ పిటిషన్‌పై బ్యాంకులకు నోటీసులు
హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారా? అని సీఐడీ అధికారులను ధర్మాసనం ప్రశ్నించగా, అతడు ఈ కేసులో నిందితుడు కాదని, అందుకే అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ చెప్పారు. అయితే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ మధ్య ఉన్న సంబంధాలను తప్పక తెలుసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకుల వేలం ప్రక్రియను సవాలు చేస్తూ హాయ్‌ల్యాండ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఎస్‌బీఐ, కర్ణాటక, ఓబీసీ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యాజ్యంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చి, వారికి కూడా నోటీసులిచ్చింది. అవ్వా సీతారామారావు, అల్లూరి వెంకటేశ్వరరావుల మధ్య ఉన్న సంబంధాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే హాయ్‌ల్యాండ్ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment