‘అగ్రిగోల్డ్‌’ ఆశలకు సమాధి.. హాయ్‌ల్యాండ్‌ ఆరగింపు! | TDP leaders eye on most valuable assets of Haailand | Sakshi
Sakshi News home page

హాయ్‌ల్యాండ్‌ ఆరగింపు!

Published Mon, Nov 19 2018 3:55 AM | Last Updated on Mon, Nov 19 2018 1:08 PM

TDP leaders eye on most valuable assets of Haailand - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి:  లక్షలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితుల ఆశలకు సమాధి కడుతూ.. అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కోటరీ తాజాగా భారీగా స్కెచ్‌ వేసింది. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతోనే న్యాయస్థానానికి కట్టుకథలు చెప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విలువైన ఆస్తిని కొల్లగొట్టడానికి దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడుతున్నారు. రూ.1,000 కోట్లకు పైగా విలువైన హాయ్‌ల్యాండ్‌ తమది కాదని చెప్పడం ద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రలకు యాజమాన్యం సహకరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు, ఏజెంట్లు మనోవేదన గురై మరణిస్తున్నా సర్కారులో చలనం కనిపించడం లేదు.

అగ్రిగోల్డ్‌ మోసంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తన పరిధిలోని సీఐడీకి ఈ కేసును హడావుడిగా అప్పగించి చేతులు దులుపుకుంది. హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తాజాగా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హాయ్‌ల్యాండ్‌ తమదేనని ఇన్నాళ్లూ చెప్పుకున్న యాజమాన్యం ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చడం వెనుక ప్రభుత్వంలోని బడాబాబుల హస్తం ఉందని బాధితులు  చెబుతున్నారు. హాయ్‌ల్యాండ్‌ తమదేనని, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని ఆర్కా లీజర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ అల్లూరు వెంకటేశ్వరరావు హైకోర్టుకు చెప్పడాన్ని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం తప్పుపడుతోంది. దీనిపై ఆందోళనకు సిద్ధమని ప్రకటించింది. 

హాయ్‌ల్యాండ్‌పై తొలుత దేశంలోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ కన్నేసింది. బేరం కుదరకపోవడంతో వెనక్కి తగ్గింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే దాదాపు 86 ఎకరాల్లో  హాయ్‌ల్యాండ్‌ విస్తరించింది. 68 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్, 18 ఎకరాల్లో కల్యాణ మండపం, క్లబ్‌హౌస్, వాహనాల పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇందులోనే దాదాపు 10 ఎకరాల్లో గుంటూరుకు చెందిన ఓ ప్రముఖుడు స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని కృష్ణా జిల్లా నూజివీడులో ఏర్పడుతుందని ఒకసారి, గుంటూరు–విజయవాడ మధ్య వస్తుందని ఇంకోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీకులిచ్చిన సంగతి తెలిసిందే. చివరకు అమరావతిని రాజధాని కేంద్రంగా ఎంపిక చేశారు. ఈ వ్యవహారాలన్నీ ముందుగానే పక్కాగా తెలిసిన ఓ పత్రికాధిపతి హాయ్‌ల్యాండ్‌ను దక్కించుకోవడానికి స్కెచ్‌ వేశారు. ఇందుకోసం అప్పట్లో రూ.400 వందల కోట్ల దాకా బేరసారాలు జరిగాయని సమాచారం. అనంతరం ఆ పత్రికాధిపతి అనూహ్యంగా ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. తర్వాత గుర్గావ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరపైకి వచ్చింది. హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది.

ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను అగ్రిగోల్డ్‌ యాజమాన్యం అంగీకరించలేదు. ఇంతలో రాష్ట్ర ముఖ్యనేత కుమారుడు, ఆయనకు సన్నిహితుడైన ఓ మంత్రి కలిసి హాయ్‌ల్యాండ్‌పై కన్నేశారు. అగ్రిగోల్డ్‌ బాగోతాలపై ఎలాంటి కేసులు రాకుండా చూస్తామని, హాయ్‌ల్యాండ్‌ను తమకు ఉచితంగా ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో చివరకు రూ.200 కోట్లు ఇస్తామని ప్రతిపాదించారు. చినబాబు–అగ్రిగోల్డ్‌ డీల్‌కు అప్పటి విజయవాడ పోలీసు ఉన్నతాధికారి మధ్యవర్తిగా వ్యవహరించారు. చినబాబుకు సన్నిహితుడైన మంత్రి అప్పట్లో ఆరేడు నెలల పాటు హాయ్‌ల్యాండ్‌లోనే మకాం వేశారు. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ముఖ్యనేతకు భాగస్వామిగా ఉన్న అధికార పార్టీ ఎంపీ కూడా హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎస్సెల్‌ గ్రూప్‌ కూడా రంగ ప్రవేశం చేసింది. విజయవాడ ఏలూరు రోడ్డులో అగ్రిగోల్డ్‌కు చెందిన మిల్క్‌ భవన్‌లో ఎస్సెల్‌ గ్రూప్‌ తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. 

రసవత్తరంగా టేకోవర్‌ డ్రామా  
అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేస్తామంటూ ఎస్సెల్‌ గ్రూప్‌నకు(జీ గ్రూప్‌) చెందిన సుభాష్‌చంద్ర పౌండేషన్‌ ముందుకు రావడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ప్రచారం జరిగింది. రూ.వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన అగ్రిగోల్డ్‌ ఆస్తులను నామమాత్రపు ధరకు టేకోవర్‌ చేసుకునే ప్రతిపాదన వెనుక చాలా తతంగం నడిచింది. ఇందుకు విజయవాడ, హైదరాబాద్‌లకు చెందిన పలువురు మధ్యవర్తిత్వం నెరిపారు. ఎస్సెల్‌ గ్రూప్‌ ఎండీ సుభాష్‌చంద్ర  సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతకు ముందే రెండు పర్యాయాలు వేర్వేరు ప్రాంతాల్లో వీరి భేటీ రహస్యంగా జరిగినట్టు సమాచారం. ఆ నేపథ్యంలోనే ఎస్సెల్‌ గ్రూప్‌నకు అగ్రిగోల్డ్‌ ఆస్తులను అప్పగించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తూ రావడంతో ఈ వ్యవహారం పక్కకు పోయింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయమై సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాయబేరం సాగించారు. 

బహిరంగ మార్కెట్‌లో రూ.35,000 కోట్లు
వాస్తవానికి అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.35,000 కోట్ల పైమాటే. అగ్రిగోల్డ్‌ సంస్థ 32,02,630 మంది నుంచి రూ.6,380.52 కోట్ల డిపాజిట్లను సేకరించింది. ఈ డిపాజిట్లకు రూ.3,150 కోట్లకు పైగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్ముతో అనుబంధ సంస్థల పేరుతో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం అపార్టుమెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, విల్లాలు, పవర్‌ ప్రాజెక్టులు, టింబర్‌ డిపోలు, డెయిరీఫామ్, రిసార్టులు, కార్యాలయ భవంతులను సమకూర్చుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌ యజమాన్యం 18,395.74 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. వీటి విలువ ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.35 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే అగ్రిగోల్డ్‌ అనుబంధ సంస్థల పేరిట 16,857.81 ఎకరాల భూములున్నాయి. 

తొలినుంచీ అడ్డగోలు వ్యవహారాలే... 
అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత డైరెక్షన్‌లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కొందరు తొలుత అగ్రిగోల్డ్‌ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు బేరసారాలు జరిపారు. ప్రభుత్వాధినేతకు, అధికార పార్టీ ముఖ్యులకు అత్యంత సన్నిహితుడనే గుర్తింపు కలిగిన ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా అగ్రిగోల్డ్‌ ఆస్తులు, కేసుల వ్యవహారాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఒకదశలో హాయ్‌ల్యాండ్‌తోపాటు విజయవాడలోని అగ్రిగోల్డ్‌ ప్రధాన కార్యాలయ భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్, కీసరలోని పొలాలను తమకు కట్టబెడితే కేసుల నుంచి బయటపడేస్తామనే ప్రతిపాదనను అధికార పార్టీ పెద్దల తరఫున ఆ అధికారి తెచ్చారు. చివరకు అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి బిడ్డర్లు రాకుండా అధికార పక్షం అడ్డుకున్నట్టు విమర్శలు వచ్చాయి. బిడ్‌లు వేసేందుకు వచ్చిన ఔత్సాహికులను కొందరు అధికార పక్షం నేతలు భయపెట్టి వెనక్కి పంపినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని ఆస్తులను దక్కించుకునేందుకు ఇతరులు బిడ్లు వేయకుండా తమ మనుషులనే రంగంలోకి దించినట్లు కూడా ప్రచారం జరిగింది. 

తక్కువ ధరకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు 
హాయ్‌ల్యాండ్‌ను తక్కువ ధరకే ఇచ్చేయాలని కొందరు ప్రముఖులు ఒత్తిడి తెచ్చారని, అయినా తాము లొంగలేదని అగ్రిగోల్డ్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను అప్పణంగా కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చారు. పోలీసు అ«ధికారులను ప్రయోగించారు. బెదిరించారు.  మేం ఏమాత్రం అంగీకరించలేదు. ముందుగా డిపాజిటర్లు, ఏజెంట్లకు డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేయండి. ఆ తరువాత మాట్లాడుకుని నిర్ణయానికి వద్దామని చెప్పాం. వారికి హాయ్‌ల్యాండ్‌ నచ్చిందట. ముందుగా ఇవ్వాలట. ఆ తరువాత మాట్లాడుతామన్నారు. మేం దానికి అంగీకరించలేదు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చెప్పాం. అందుకే మమ్మల్ని జైలుకు పంపారు’’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. 

డిపాజిటర్లకు సర్కారు అన్యాయం 
అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నాలుగన్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారు 2.75 లక్షల మంది ఉన్నారు. వీరంతా మొత్తం రూ.491.99 కోట్లు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేశారు. ప్రభుత్వం కనీసం రూ.500 కోట్లు ఇచ్చినా ఇలాంటి చిన్న డిపాజిటర్లను న్యాయం జరుగుతుంది. కానీ, ఆ దిశగా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు, ఏజెంట్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో దాదాపు 80 శాతం మంది ఏజెంట్లే ఉన్నారని అంచనా. ఒక్కో బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారాన్ని దశలవారీగా చెల్లిస్తోంది. 

హాయ్‌ల్యాండ్‌ విలువ గరిష్టంగా రూ.2,200 కోట్లు 
- హాయ్‌ల్యాండ్‌ విలువను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది.
- అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ హాయ్‌ల్యాండ్‌ విలువను రూ.522 కోట్లుగా లెక్కించింది. 
- ఇదే సమయంలో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్‌ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు.
- అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్‌ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. 
- సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. 
- ప్రస్తుతం అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2,200గా లెక్కగట్టింది.
- అగ్రిగోల్డ్‌ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ.6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. 
- ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ.3,966 కోట్ల మేర మోసం చేసినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా 160 కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. 
- తాజాగా హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌ గ్రూపు కంపెనీ కాదన్న విషయాన్ని గుర్తించకపోవడంపై సీఐడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్‌ వ్యవహారం హైకోర్టుకొచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇక ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసి ప్రయోజనం ఏమిటని నిలదీసింది.

21న ‘చలో హాయ్‌ల్యాండ్‌’
అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకోవడానికి అగ్రిగోల్డ్‌ బాధితుల సంక్షేమ సంఘం సన్నద్ధమైంది. ఈ నెల 21వ తేదీలోగా ప్రజాప్రతినిధులు సైతం స్పందించాలని అల్టిమేటం ఇచ్చింది. తాము నోరు తెరిస్తే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అడ్రస్‌ లేకుండా పోతారని హెచ్చరించింది. ఈ నెల 21న ‘చలో హాయ్‌ల్యాండ్‌’ కార్యక్రమానికి  పిలుపిచ్చింది. అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు ఆదివారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హాయ్‌ల్యాండ్‌ కచ్చితంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యానిదేనని, ఇందుకు తగిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తరఫున వాదిస్తున్న న్యాయవాది సైతం పలు సందర్భాల్లో కోర్టుకు కూడా ఈ విషయాన్ని చెప్పారని అన్నారు. హాయ్‌ల్యాండ్‌ తమదంటూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేని ఆర్కా లీజర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ అల్లూరి వెంకటేశ్వరరావు చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావును అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తన మేనేజర్‌గా నియమించుకుంటే ఇప్పుడాయన ఏకంగా బినామీగా మారి హాయ్‌ల్యాండ్‌ భూమి తనదనేదాకా ఎదిగారని మండిపడ్డారు.

ప్రజాకోర్టులో శిక్ష తప్పదు 
32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్నిగోల్డ్‌ యాజమాన్యం కుట్ర పన్నుతోందని, దీని వెనుక రెండు రాజకీయ పార్టీల నేతలు, కొందరు అనధికార ప్రముఖులు ఉన్నారని ముప్పాళ్ల నాగేశ్వరరావు, తిరుపతిరావు ఆరోపించారు. రాజకీయ నేతల అండదండలు లేకుండా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఇంత బరితెగింపునకు ఒడిగట్టలేదన్నారు. కోర్టులో తప్పించుకున్నా ప్రజాకోర్టులో వీరికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆర్కా తరఫున వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 200 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని, వెంకటేశ్వరరావు పిటిషన్‌తో బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు కూడా నాటకాలు ఆడుతున్నారని, అగ్రిగోల్డ్‌లో దాదాపు 160 బినామీ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. హాయ్‌ల్యాండ్‌ భూమి తనదేనంటూ అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తరఫున హాజరవుతున్న న్యాయవాది సైతం పలుమార్లు కోర్టుకు విన్నవించారని తెలిపారు.

హాయ్‌ల్యాండ్‌ తమ కలల సౌధమని, దాని జోలికి రావొద్దని ఆ న్యాయవాది చెప్పారని గుర్తుచేశారు. దీనితో సంబంధం లేకుండానే బాధితులకు చెల్లించదగిన ఆస్తులు ఉన్నాయని ఆ న్యాయవాది గతంలో చెప్పారన్నారు. కోర్టునే మోసగించడానికి ప్రయత్నించిన అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి తగిన శిక్ష తప్పదన్నారు. ఈ నెల 21న హాయ్‌ల్యాండ్‌ ముట్టడికి పిలుపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించొద్దని, బందోబస్తు అవసరం లేదని ప్రభుత్వాన్ని కోరారు. 22వ తేదీ నుంచి గ్రామగ్రామాన సైకిల్‌ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై 21వ తేదీలోగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోతే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. 

ఆస్తులు దోచుకోవడానికి కుట్ర 
‘‘అగ్రిగోల్డ్‌ వ్యవహారమంతా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. హాయ్‌ల్యాండ్‌తో అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని కోర్టుకు చెప్పడం వెనుక బడాబాబులున్నారు. కేసును విచారిస్తున్న సీఐడీ, మంత్రులు, అధికారులు  అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని చెప్పకపోవడం గమనార్హం. విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు, లోకేశ్‌ కుట్ర పన్నారు. లక్షలాది మంది డిపాజిటర్లు, ఏజెంట్లను మోసగిస్తున్నారు.బాధితులెవరూ అధైర్యపడొద్దు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల వ్యవధిలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటారు’’                
– ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, లేళ్ల అప్పిరెడ్డి, అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటి కన్వీనర్,  

న్యాయస్థానానికి ఎవరేం చెప్పారంటే..
- హాయ్‌ల్యాండ్‌ విలువను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది.
అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ హాయ్‌ల్యాండ్‌ విలువను రూ.522 కోట్లుగా లెక్కించింది. 
ఇదే సమయంలో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్‌ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు.
అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్‌ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. 
సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. 
ప్రస్తుతం అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2,200గా లెక్కగట్టింది.
అగ్రిగోల్డ్‌ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ.6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. 
ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ.3,966 కోట్ల మేర మోసం చేసినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా 160 కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. 
తాజాగా హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌ గ్రూపు కంపెనీ కాదన్న విషయాన్ని గుర్తించకపోవడంపై సీఐడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్‌ వ్యవహారం హైకోర్టుకొచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇక ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసి ప్రయోజనం ఏమిటని నిలదీసింది.      
 – సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement