హైకోర్టు ఆదేశాలతో సీఐడీలో చలనం  | AgriGold Haailand MD Alluri Venkateswara Rao Arrest | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆదేశాలతో సీఐడీలో చలనం 

Published Fri, Nov 23 2018 1:09 AM | Last Updated on Fri, Nov 23 2018 9:52 AM

AgriGold Haailand MD Alluri Venkateswara Rao Arrest - Sakshi

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ అస్తులు, నిందితుల అరెస్టుల విషయంలో ఇన్నాళ్లూ నిర్లిప్తంగా వ్యవహరించిన నేర పరిశోధన సంస్థ(సీఐడీ) ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు ముందుకు కదిలింది. హాయ్‌ల్యాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) అల్లూరి వెంకటేశ్వరరావును బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. హాయ్‌ల్యాండ్‌ తమది కాదంటూ ఈ నెల 16న అగ్రిగోల్డ్‌ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు విషయంలో సీఐడీ వ్యవహరిస్తున్న తీరుపైనా న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసి, ఈ కేసు విచారణ బాధ్యతను దానికి అప్పగిస్తామని తేల్చిచెప్పింది. అగ్రిగోల్డ్‌కు, హాయ్‌ల్యాండ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఇక ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్‌ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్‌ విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగక తప్పలేదు.  

ఉదయ్‌ దినకర్‌ను వదిలేసిన  అధికారులు  
హాయ్‌ల్యాండ్‌ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావుకు గురువారం గుంటూరు ఆరో అదనపు కోర్టు రిమాండ్‌ విధించింది. బుధవారం రాత్రి హాయ్‌ల్యాండ్‌ ఎండీ వెంకటేశ్వరరావు, మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) ఉదయ్‌ దినకర్‌లను గుంటూరులో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో విచారించారు. అనంతరం ఉదయ్‌ దినకర్‌ను వదిలేసి అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్వరరావు అరెస్టును చూపించారు. అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ అవ్వా వెంకటరామారావుతో కలిసి హాయ్‌ల్యాండ్‌ విషయంలో కుట్ర చేశాడనే అభియోగంపై డిపాజిట్ల యాక్ట్‌ 402, 403, 420 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.  

27కు చేరిన అగ్రిగోల్డ్‌  నిందితుల సంఖ్య  
ఆర్కా లీజర్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(హాయ్‌ల్యాండ్‌) ఎండీగా 2005 ఆగస్టు 29న వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఆయన అరెస్టుతో అగ్రిగోల్డ్‌ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. వెంకటేశ్వరరావు ఆర్కా లీజర్స్‌తోపాటు మరో 18 కంపెనీల్లో అదనపు డైరెక్టర్, డైరెక్టర్‌ హోదాలో కొనసాగుతున్నారు. ఇవన్నీ అగ్రిగోల్డ్‌ గ్రూపునకు సంబంధించిన డొల్ల కంపెనీలే. వీటిలో 14 కంపెనీల్లో అగ్రిగోల్డ్‌ కేసుల్లో నిందితులైనఅవ్వా వెంకటశేషునారాయణరావు, కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, అవ్వా సీతారామారావు, సవడం శ్రీనివాస్, ఇమ్మడి సదాశివ వరప్రసాద్, అవ్వా హేమసుందర వరప్రసాద్, పఠాన్‌లాల్‌ అహ్మద్‌ఖాన్‌ తదితరులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వివిధ రకాల ఆకర్షణీయ పథకాల పేరిట సేకరించిన డిపాజిట్ల సొమ్మును మొత్తం 156 డొల్ల సంస్థల్లోకి అగ్రిగోల్డ్‌ యాజమాన్యం మళ్లించడంపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గకుండా సీఐడీ దర్యాప్తు చేపడితేనే తమకు న్యాయం జరుగుతుందని డిపాజిటర్లు, ఏజెంట్లు కోరుతున్నారు.  

సీఐడీకి నిబద్ధత లేదు  
డీజీపీకి అగ్రిగోల్డ్‌ కస్టమర్స్, ఏజెంట్స్‌ అసోసియేషన్‌ వినతి
సాక్షి, అమరావతి:  అగ్రిగోల్డ్‌ ఆస్తులు, కేసుల విషయంపై సీఐడీ దర్యాప్తులో నిబద్ధత లేదని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్, ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విమర్శించారు. దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ మేరకు వారు గురువారం డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం, సీఐడీ దర్యాప్తులో నిర్లక్ష్యం వల్ల 211 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు చనిపోయారని చెప్పారు. అగ్రిగోల్డ్‌ సిస్టర్స్‌ కంపెనీలుగా ఉన్న 156 సంస్థల డైరెక్టర్‌లను సీఐడీ కçస్టడీలోకి తీసుకొని విచారించాలని, వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకొని బాధితులకు పంచాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌లు, వారికుటుంబ సభ్యుల పేరిట ఉన్నబినామీ ఆస్తులను జప్తు చేసేందుకు సీఐడీ ఏనాడూ తగిన శ్రద్ధ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీని కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్, ఏజెంట్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షులు బి.విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, ఉపప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌రావు ఉన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు త్వరలోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని డీజీపీ హామీ ఇచ్చినట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement