సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీకి సిద్ధమైన బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పేరుతో ముట్టడి కార్యక్రమం చేపడుతుండటంతో.. గుంటూరు అర్బన్ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బాధితులు హాయ్‌ల్యాండ్‌ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాము తలపెట్టిన హ్యాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని బాధితులు కోరుతుండగా.. మరోవైపు ముట్టడిని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులను ప్రయోగిస్తోంది. ముట్టడిలో పాల్గొనేందుకు వస్తున్న బాధితులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ‘ఛలో హాయ్‌ల్యాండ్’ అప్‌డేట్స్ ఇవి..
అరెస్టులు, ఉద్రిక్తత
- అగ్రిగోల్డ్ బాధితులు తలపెట్టిన ఛలో హాయ్‌ల్యాండ్‌కు మద్దతు తెలిపేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు.
- అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
- హాయ్‌ల్యాండ్ సమీపంలో అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగలు పట్టుకోవడం చేతకాని పోలీసులు.. తమను అరెస్ట్ చేస్తున్నారని వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు.
- అగ్రిగోల్డ్ బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హాయ్‌ల్యాండ్ చుట్టూ 15 చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. గుంటూరు అర్బన్ జిల్లా మొత్తం 50 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముట్టడికి వచ్చే అగ్రిగోల్డ్ బాధితులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కాజా టోల్‌గేటు వద్ద పలువురు బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇక్కడ పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళగిరి వై జంక్షన్ వద్ద కూడా బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు ప్రతిఘటిస్తుండం పరిస్థితి ఉద్రిక్తం
అనుమతి లేదు
- ‘‘ఛలో హాయ్‌ల్యాండ్’కు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పర్మిషన్ కోరింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వారికి అనుమతి ఇవ్వలేదు. శాంతిభద్రతలు విఘాతం కలిగించకుండా అందరూ సహకరించాలి. ఈ క్రమంలో ముందస్తుగా కొంతమందిని అరెస్ట్ చేశాం’ అని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు విలేకరులు తెలిపారు.
- బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పిలుపునివ్వడంతో ప్లేట్ ఫిరాయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ తమదేనంటూ మంగళవారం హడావుడిగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని అగ్రిగోల్డ్ బాధితులు స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు యాజమాన్యానికి మామూలేనని పేర్కొంటూ తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం సిద్ధమైందని, కోర్టు చీవాట్లు పెట్టినందువల్లే ప్లేట్ ఫిరాయించారని పేర్కొంటున్నారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ ఆస్తుల్లో భాగమేనని, తమకు వెంటనే న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment