సాక్షి, హైదరాబాద్: హాయ్‌ల్యాండ్ తమది కాదని గత వారం చెప్పిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇప్పుడు మళ్లీ మాట మార్చింది. సమాచార లోపంవల్లే ఆ పొరపాటు జరిగిందని, హాయ్‌ల్యాండ్ కూడా అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీల్లో భాగమేనని అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఈ విషయాలన్నింటితో వచ్చే వారం పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో సీఐడీ అధికారులు సైతం హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీదేనని హైకోర్టుకు నివేదించారు. అందుకు సంబంధించిన యాజమాన్య వివరాలను, తాజాగా దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచారు. వీటిని పరిశీలించిన హైకోర్టు, దర్యాప్తునకు సంబంధించిన వివరాలను పక్కన పెట్టి మిగిలిన వివరాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది.
అదే విధంగా హాయ్‌ల్యాండ్‌ను తాకట్టుపెట్టి దాని యాజమాన్యం రుణం తీసుకున్న నేపథ్యంలో, ఆ రుణ దరఖాస్తును, ఎప్పుడు రుణం ఇచ్చారు.. రుణం తీసుకున్నప్పుడు.. హాయ్‌ల్యాండ్ యజమానులు ఎవరు?.. ప్రస్తుతం హాయ్‌ల్యాండ్ యజమానులు ఎవరు?.. తదితర వివరాలను తమ ముందుంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. 2014లో హాయ్‌ల్యాండ్‌కు చెందిన 8 ఎకరాల భూమిని తాము కొనుగోలు చేశామని, అందువల్ల జప్తు నుంచి ఆ భూమిని విడుదల చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ శ్రీనివాసరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అటు ఎస్‌బీఐని, ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
విచారణ సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ రెండు సీల్డ్ కవర్లను ధర్మాసనం ముందుంచారు. హాయ్‌ల్యాండ్ యాజమాన్యానికి సంబంధించిన వివరాలతో పాటు, సీఐడీ దర్యాప్తు నివేదికలు అందులో ఉన్నాయని తెలిపారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ యాజమాన్యానిదేనని తెలిపారు. దీనిపై ధర్మాసనం అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ప్రశ్నించింది. సమాచారం లోపంవల్ల పొరపాటు జరిగిందని, హాయ్‌ల్యాండ్ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిందని, ఇది అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీల్లో ఒకటని ఆయన కోర్టుకు నివేదించారు. గత వారం హాయ్‌ల్యాండ్ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించామని, అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆయనను ధర్మాసనం ప్రశ్నించింది.
వచ్చే వారం పూర్తి వివరాలతో దాఖలు చేస్తానని జానకిరామిరెడ్డి చెప్పగా, ఏం వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆలోచిస్తున్నారా? అంటూ ధర్మాసనం వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఈ సమయంలో హాయ్‌ల్యాండ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ స్పందిస్తూ, అగ్రిగోల్డ్‌తో తమకు సంబంధం లేదంటూ గత వారం తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తనకు మౌఖిక సూచనలు వచ్చాయన్నారు. హాయ్‌ల్యాండ్ ఎండీ అరెస్టయ్యారని, అందువల్ల లిఖితపూర్వక సూచనలు రాలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అగ్రిగోల్డ్, హాయ్‌ల్యాండ్ యజమానులు చాలా తెలివిగా సాలెగూడు అల్లారని, ఇందులో ఇప్పుడు వారే చిక్కుకుపోతున్నారని వ్యాఖ్యానించింది. తమ ముందున్న అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి హాయ్‌ల్యాండ్ కనీస వేలం ధరను నిర్ణయిస్తామని తెలిపింది.
హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌లో భాగమే!
Published Sat, Nov 24 2018 1:45 AM | Last Updated on Sat, Nov 24 2018 1:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment