సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల్లో విలువైన హాయ్‌ల్యాండ్‌ను వేలం వేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు హైకోర్టు అనుమతి నిచ్చింది. హాయ్‌ల్యాండ్ భూములను తాకట్టు పెట్టి అగ్రిగోల్డ్ యాజమాన్యం దాదాపు రూ. 100 కోట్లు అప్పు తీసుకున్న నేపథ్యంలో సర్ఫేసీ (సెక్యూరిటైజేషన్ అండ్ రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ) చట్టం కింద వేలం ద్వారా ఆ అప్పును రాబట్టుకునేందుకు అనుమతి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ మోసంపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. లక్షల మంది డిపాజిటర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
హాయ్‌ల్యాండ్ వేలం తరువాత అందుకు సంబంధించిన వివరాలతో నివేదికను తమ ముందుంచాలని, ఆ నివేదికను పరిశీలించిన తరువాతే వేలాన్ని ఖరారు చేస్తామని ఎస్‌బీఐ తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్‌రెడ్డికి తెలిపింది. అదే విధంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం తాకట్టుపెట్టిన ఆస్తులన్నింటినీ కూడా వేలం వేసుకునేందుకు ఇతర బ్యాంకులకు కూడా హైకోర్టు అనుమతినిచ్చింది. తాకట్టు ఉన్న ఆస్తుల వేలానికి ఇకపై తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని బ్యాంకులకు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక తదుపరి విచారణ నాటికి జిల్లాల వారీగా అగ్రిగోల్డ్‌కు చెందిన 234 ఆస్తుల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్, మార్కెట్, రియల్టర్ల విలువలను తమ ముందుంచి తీరాలని, ఇది తామిస్తున్న చివరి అవకాశమని సీఐడీ, ఉభయ రాష్ట్రాలు, పిటిషనర్లకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటీవల అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన కీలక వ్యక్తి అరెస్టయిన నేపథ్యంలో అగ్రిగోల్డ్ నగదు మళ్లింపు వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, దాని నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది.
ధర్మాసనం తీవ్ర అసంతృప్తి..
జిల్లాల వారీగా అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను సమర్పించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, పిటిషనర్లు, అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీనికి ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది కృష్ణప్రకాశ్ స్పందిస్తూ, తాము జిల్లాల వారీగా 54 ఆస్తుల వివరాలను ఓ నిర్ధిష్ట నమూనాలో సిద్ధం చేశామని తెలిపారు. ఆ నమూనాను పరిశీలించిన ధర్మాసనం ఇదే రీతిలో మిగిలిన ఆస్తుల వివరాలను సమర్పించాలంది. తెలంగాణ ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా ఆస్తుల వివరాలిచ్చింది. అయితే అటు పిటిషనర్లు, ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యం వివరాలు సమర్పించకకోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
హాయ్‌ల్యాండ్ విలువ ఎంత?..
హాయ్‌ల్యాండ్ విలువ ఎంత కట్టారని ఎస్‌బీఐ న్యాయవాది నరేందర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో కట్టిన విలువ రూ. 366 కోట్లని ఆయన సమాధానం ఇచ్చారు. దీనికి అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి అభ్యంతరం చెబుతూ.. హాయ్‌ల్యాండ్ ప్రస్తుత విలువ రూ. 1000 కోట్లు ఉంటుందని, గత ఏడాది ప్రభుత్వమే రూ.600 కోట్లుగా లెక్కకట్టిందని తెలిపారు. హాయ్‌ల్యాండ్ విలువపై సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు న్యాయవాది రాహుల్ స్పందిస్తూ.. తమ వద్ద వివరాలు వేవన్నారు. ఇక శ్రీకాళహస్తిలోని సర్వే నంబర్ 272లో అగ్రిగోల్డ్‌కు చెందిన 5.86 ఎకరాలను రిత్విక్ ఎనర్జీస్ సంస్థ రూ.8.88 కోట్లకు కొనుగోలుకు ముందుకొచ్చిందని నరేందర్‌రెడ్డి తెలిపారు. తమకు రావాల్సింది రూ.7.66 కోట్లను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హైకోర్టు వద్ద డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ వేలానికి అనుమతి ఇచ్చింది. అలాగే విజయవాడ, మొఘల్‌రాజపురంలో ఉన్న అగ్రిగోల్డ్ కార్పొరేట్ కార్యాలయం వేలంలో రూ. 11.11 కోట్లకు బిడ్ దాఖలు చేసిన టి.చంద్రశేఖరరావు మిగిలిన మొత్తం చెల్లిస్తే, ఆ భవనాన్ని అతనికి స్వాధీనం చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.
హాయ్‌ల్యాండ్ వేలం వేసుకోండి
Published Sat, Sep 29 2018 5:26 AM | Last Updated on Sat, Sep 29 2018 10:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment