సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ ప్రతిపాదన నుంచి ఎస్సెల్ గ్రూపునకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో హైకోర్టు తాజాగా హాయ్‌ల్యాండ్ విక్రయంపై దృష్టి సారించింది. హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయడం ద్వారా భారీగా డబ్బు సమకూరే అవకాశం ఉండటంతో ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది.
అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ భూములను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి రుణం తీసుకుంది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో హాయ్‌ల్యాండ్ విలువ, అప్పుల వివరాలను తెలియచేయాలని ఎస్‌బీఐ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ వేలానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, దీనివల్ల డబ్బు సమకూరి డిపాజిటర్లకు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఎంతో కొంత చెల్లించేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది.
తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల విలువెంత?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను జిల్లాల వారీగా విభజించి బహిరంగ మార్కెట్ విలువ, రియల్టీ విలువ, సబ్ రిజిష్ట్రార్ విలువను పట్టిక రూపంలో సమర్పించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని, పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఎవరికి వారు స్వతంత్రంగా ఈ వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. వీటిని పరిశీలించి ఒక్కో ఆస్తి కనీస వేలం ధరను నిర్ణయిస్తామని తెలిపింది. ఇకపై అగ్రిగోల్డ్ ఆస్తులను జిల్లా కమిటీల ద్వారా ఏకకాలంలో వేలం వేస్తామని పేర్కొంది.
మినహాయిస్తామని మొదటి రోజే చెప్పాం..
అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని, దీనికి అనుమతినిస్తూ తాము డిపాజిట్ చేసిన రూ.10 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ సుభాష్‌చంద్ర ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. అయితే మొత్తం రూ.10 కోట్లను వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని, కొంత మినహాయించి మిగిలింది ఇస్తామని ప్రకటించింది.
టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోయారన్న కారణంతో తాము ఈ పని చేయడం లేదని, ఎంతో కొంత మొత్తాన్ని మినహాయిస్తామని ఈ కేసులో ప్రతివాదిగా చేరిన మొదటి రోజే చెప్పామని గుర్తు చేసింది. ఆస్తుల టేకోవర్‌కు తాము శక్తివంచన లేకుండా కృషి చేశామని, తమ అదుపులో లేని కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కి వెళ్లిపోతున్నామని, సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం తెలిపారు.
ఇక ప్రతి శుక్రవారం కేసు విచారణ
అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్‌కు సంబంధించి సీఐడీ నివేదికను తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇకపై ఈ కేసును ప్రతి శుక్రవారం విచారించనున్నట్లు పేర్కొంటూ తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో మీ పాత్ర చాలా పరిమితం...
వేలం నిమిత్తం అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 50 వరకు గుర్తించినట్లు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్ జాబితాను కోర్టుకు సమర్పించారు. కొన్ని ఆస్తులకు సీఐడీ చెబుతున్న ధర చాలా తక్కువగా ఉందని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ద్వారా జరిగే వేలంలో భూములకు తక్కువ ధరే వస్తుందని పేర్కొంది.
‘మీరు (అగ్రిగోల్డ్) మీ ఆస్తుల విలువ రూ.20 వేల కోట్లకు పైగా చెప్పారు. చివరకు అది రూ.2 వేల కోట్ల వద్ద ఆగిపోయింది. మీరు ఒక్క వేలందారుడిని కూడా తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఆస్తుల విలువ తక్కువగా ఉందంటున్నారు. ఈ కేసులో ఇకపై మీ పాత్ర చాలా పరిమితం. టేకోవర్ ప్రతిపాదన నుంచి వెనక్కివెళ్లిపోవడానికి మీరు కూడా కారణమని సుభాష్‌చంద్ర ఫౌండేషన్ చెబుతోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగానే అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్ గురించి హైకోర్టు ఆరా తీసింది.
Comments
Please login to add a commentAdd a comment