గుడ్‌న్యూస్‌: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్‌ | Pay scale to RTC employees soon Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్‌

Published Fri, Jun 3 2022 4:50 AM | Last Updated on Fri, Jun 3 2022 5:32 PM

Pay scale to RTC employees soon Andhra Pradesh - Sakshi

ఉద్యోగులతో మాట్లాడుతున్న ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు

తిరుపతి అర్బన్‌: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్‌ ప్రకటించనున్నట్లు ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసీ) ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం ఆయన తిరుపతి, అలిపిరి, మంగళం, చంద్రగిరి బస్టాండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు నూతన పే స్కేల్స్‌ కూడా ప్రకటించనున్నారని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్‌ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టామని.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి బస్సులను వినియోగిస్తున్నారో అదే తరహాలో 100 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. జూలై 1న తొలి బస్సు అలిపిరి డిపోకు చేరుకుంటుందన్నారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు మిగిలిన బస్సులను కూడా తిరుపతి జిల్లాకు తీసుకొస్తామన్నారు. తిరుమల ఘాట్‌ రోడ్డు కోసం 30–50 బస్సులు, రేణిగుంట ఎయిర్‌పోర్టు, నెల్లూరు, కడప, ప్రముఖ దేవాలయాలున్న పట్టణాలకు మరో 50 బస్సులు కేటాయిస్తామని చెప్పారు. బస్సులకు చార్జింగ్‌ పాయింట్లు, విద్యుత్‌ చార్జీలు, కండక్టర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసుకుంటుందని.. డ్రైవర్లు, బస్సుల మరమ్మతులను మాత్రం యజమానులే చూసుకుంటారని వెల్లడించారు.

రాష్ట్రంలో తొలి ఎలక్ట్రిక్‌ బస్సుల బస్టాండ్‌గా అలిపిరి నిలుస్తుందన్నారు. అలాగే ఆర్టీసీకి చెందిన డీజిల్‌ బస్సులను కన్వర్షన్‌ పద్ధతిలో ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తిరుపతి డిపోకు చెందిన సప్తగిరి బస్సును ఎలక్ట్రిక్‌ బస్సుగా మార్పు చేయించామని పేర్కొన్నారు. అనంతరం ద్వారకా తిరుమలరావు అలిపిరి డిపోలో ఏర్పాటు చేసిన 48 చార్జింగ్‌ పాయింట్లను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు కృష్ణమోహన్, గోపినాథ్‌రెడ్డి, రవివర్మ, బ్రహ్మానందయ్య, చెంగల్‌రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement