సుప్రీంకోర్టు విచారణ అనంతరం నిర్ణయం
డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఆ ఆరోపణలపై విచారణ కోసం ఆయనే ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ నిలిచిపోయింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలలో మంగళవారం ప్రకటించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని.. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల దర్యాప్తును ఆపుతున్నామని తెలిపారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులతో తిరుమలలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడిన కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని.. మూడు రోజుల పాటు టీటీడీలో సిట్ దర్యాప్తు సాగిందన్నారు. ప్రస్తుతానికి సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 3 రోజుల దర్యాప్తు వివరాలను సిట్ చీఫ్ తమకు అందజేశారని చెప్పారు.
బ్రహ్మోత్సవాల్లో పటిష్ట భద్రత
బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని డీజీపీ తెలిపారు. 5,145 మంది పోలీస్ సిబ్బందిని బ్రహోత్సవాలకు వినియోగిస్తున్నామన్నారు. గరుడ వాహనం రోజున ప్రత్యేకంగా మరో 1,264 మందిని భద్రత కోసం నియమిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో 24 ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను గుర్తించామని, వీటిలో 8 వేల వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చన్నారు.
దసరాకు 6,100 ప్రత్యేక బస్సులు
భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమలకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. వీటిలో అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment