సాక్షి, విజయవాడ: జిల్లాలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పోలీసు కమీషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. శుక్రవారం జిల్లాలోని రెడ్‌జోన్ ప్రాంతాలలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పాత రాజరాజేశ్వరి పేటలో పాజిటివ్ కేసులు పెరగకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని సబ్బందిని ఆదేశించారు. ఇక నమోదైన 25 కరోనా పాజిటివ్ కేసులలో నలుగురు విదేశాల నుంచి రాగా వారి ద్వారా మరొకరికి కరోనా సోకినట్లు వెల్లడించారు. మరో 17 కేసులు ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు కాగా.. మిగిలిన ముగ్గురు ఇతర మార్గాలతో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. జిల్లాలో కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. (మా చేతగాని తనంగా తీసుకోవద్దు: సీపీ)
భవానీ పురం, సనత్ నగర్, బుద్దూస్ నగర్, రాణిగారి తోట, పాయకాపురం, పాత రాజరాజేశ్వరి పేట ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి పూర్తిగా రాకపోకలు నిషేధించినట్లు ఆయన తెలిపారు. ఇక మిగతా ప్రాంతాలలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అనుమతించినట్లు సీపీ పేర్కొన్నారు. అయితే రెడ్‌జోన్ ప్రాంతాలలో భోజనం, ఇతర తినే పదార్థాలు పంపిణి చేసే వారు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం ముందుగానే ఎంత ఫుడ్ అనేది కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూంకి సమాచారం ఇస్తే.. ప్రాంతాల వారీగా పంపిణీకి అనుమతిస్తామన్నారు. రెడ్‌జోన్ పరిధిలో పెద్దలు అందరూ కలిసి కమిటీలు ఏర్పాటు చేసుకుని.. నిర్ణయాలు తీసుకోవచ్చని, వారి ద్వారా అధికారుల దృష్టి తీసుకు వస్తే రాకపోకలు నియంత్రణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment