సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోలు, టాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు ఉద్దేశించిన ‘అభయ’ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు పిలిచిన టెండర్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించే బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించారు. ఈ ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిటీకి విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్ల ఎంపిక విధానం, అమలు అంశాల్ని ఈ కమిటీ పరిశీలించనుంది. అభయ ప్రాజెక్టు అమలు బాధ్యత రవాణా శాఖదే అయినప్పటికీ పోలీసు శాఖ సహకారం అవసరం ఉంటుంది. దీంతో పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించింది.
మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులతో గతంలోనే రవాణా శాఖ అభయ ప్రాజెక్టును రూపొందించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం 2015లో రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలుపై నాన్చివేత ధోరణి అవలంభించింది. చివరకు ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్ రూపొందించింది. ఈ మొబైల్ యాప్‌తో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో.. తెలుసుకునే వీలుంది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా ఆపద, అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేందుకు అభయ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది.
‘అభయ’ అమలు ఇలా..
- రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు.
- పోలీసుల సహకారంతో రవాణా శాఖ ఐటీ అధికారులు ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తారు.
- రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్సులు అమర్చాలి.
- ఈ బాక్సులు అమరిస్తే రవాణా, పోలీస్ శాఖ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు.
- మహిళలు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది.
- తొలుత విశాఖ, విజయవాడల్లో లక్ష ఆటోలకు ఈ ఐఓటీ బాక్సులు అమర్చాలని రవాణా శాఖ గతంలో నిర్ణయించింది.
- ఇందుకు రూ.138 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఐఓటీ బాక్సుల్ని రవాణా శాఖ సమకూర్చనుంది.
- ఈ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు ఇస్తారు.
- ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది.
- ఆటోల్లో/క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే యాప్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు సమాచారమిస్తే.. వాహనం ఎక్కడుందో తెలుసుకుని ఇట్టే పట్టుకుంటారు.
- కమిటీ సిఫారసుల్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను పట్టా లెక్కిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment