కడదాం.. 'దిశ' కంకణం | Awareness seminars across Andhra Pradesh On Disha APP | Sakshi
Sakshi News home page

కడదాం.. 'దిశ' కంకణం

Published Sat, Jun 26 2021 3:24 AM | Last Updated on Sat, Jun 26 2021 6:52 AM

Awareness seminars across Andhra Pradesh On Disha APP - Sakshi

యువతులు, మహిళల్లో అవగాహన కల్పించేందుకు హోంమంత్రి సుచరిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొబైల్‌లో దిశ యాప్‌ చూపుతున్న విద్యార్థినులు, డీఎస్పీ జెస్సీ ప్రశాంతి

► విద్యార్థినులు, యువతులు, మహిళలు తమ ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం తమ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ వెంటనే ఆ మొబైల్‌ నంబర్‌కు ఒక ఓటీపీ నంబర్‌ వస్తుంది. దాన్ని కూడా యాప్‌లో నమోదు చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. 
► దిశ యాప్‌లో అత్యవసర సహాయం (ఎస్‌వోఎస్‌) బటన్‌ ఉంటుంది. యువతులు, మహిళలు ఎక్కడైనా ఆపదలో చిక్కుకున్నారని భావిస్తే వెంటనే యాప్‌ను ఓపెన్‌ చేసి, అందులో ఉన్న ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్‌)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది.
► ఆ వెంటనే కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు.  
► ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కడం ద్వారా వారి వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియో కూడా రికార్డ్‌ చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు పంపుతుంది. 
► విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్‌ వెంటనే దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా పోలీసులు అక్కడికి చేరుకుంటారు. పోలీస్‌ వాహనాల్లో అమర్చిన ‘మొబైల్‌ డేటా టెర్మినల్‌’ ఇందుకు సహాయ పడుతుంది. 

సాక్షి, అమరావతి: వేళ కాని వేళనో.. ఊరు కాని ఊరులోనో.. ఎక్కడైనా కావచ్చు అనుకోకుండా బయటికి వెళ్లినప్పుడో, ఇంటి వద్దనే ఒంటరిగా ఉన్నప్పుడో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే దాని నుంచి ఎలా బయట పడాలి? తొలుత ఎవరికి ఫోన్‌ చేయాలి? అలా ఫోన్‌ చేసినప్పుడు వారు లిఫ్ట్‌ చేయకపోతే పరిస్థితి ఏమిటి? తిరిగి మరొకరికి ఫోన్‌ చేసే అవకాశం ఉండకపోతే? కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్‌. సెల్‌ ఫోన్‌లోని ఈ యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే సరి.. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి వచ్చి రక్షణ కల్పిస్తారు. వర్తమాన కాలంలో ఆపద వేళ యువతులు, మహిళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన సమాచార సాంకేతిక అద్భుతం ‘దిశ’ మొబైల్‌ యాప్‌. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం మేరకు పోలీసు శాఖ ఈ యాప్‌ను రూపొందించింది. దీనిని సీఎం వైఎస్‌ జగన్‌ గత ఏడాది ఫిబ్రవరి 8న ఆవిష్కరించారు. ఆ యాప్‌ తమ మొబైల్‌ ఫోన్లో ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ అన్నయ్య తోడు ఉన్నట్టే. తాము ఆపదలో ఉన్నామని సందేశం ఇస్తే చాలు.. క్షణాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని రక్షిస్తారు. అందుకే అద్భుత ఆవిష్కరణగా ‘దిశ’ యాప్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఏడాదిలోనే నాలుగు జాతీయ అవార్డులను సాధించడం విశేషం. ఇదిలా ఉండగా యాప్‌ డౌన్‌లోడ్, ఉపయోగించే విధానం గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక ఇంటికి స్వయంగా వెళ్లి వివరించనున్నారని తెలిసింది. 

యాప్‌తో పూర్తిరక్షణ 
దిశ యాప్‌తో విద్యార్థినులు, యువతులు, మహిళలకు పూర్తి రక్షణ లభిస్తుంది. వారు ఆపదలో ఉన్నారని యాప్‌ ద్వారా సమాచారమిస్తే చాలు పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని వారిని రక్షిస్తారు. మహిళల రక్షణ కోసం ఇతరత్రా అనేక ఫీచర్లు ఈ యాప్‌లో పొందుపరిచారు. కాబట్టి ఈ యాప్‌ను యువతులు, మహిళలు అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.
– దీపికా పాటిల్, ప్రత్యేక అధికారి, దిశ విభాగం

యాప్‌ వినియోగంపై అవగాహన సదస్సులు
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం దిశ యాప్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎల్‌.ఎన్‌.పేట, కొత్తూరు, బొద్దాం, బడివానిపేట, చిలకపాలెం, జరజాం, కుప్పిలి, బెజ్జిపుట్టుగ, బూర్జపాడు, కేశుపురం, మండపల్లి పంచాయతీల్లో యాప్‌ ఆవశ్యకత గురించి పోలీసులు మహిళలకు వివరించారు. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. 

► తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, ఉప్పలగుప్తం, విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని 22 పోలీసుస్టేషన్లలో అవగాహన సదస్సులు నిర్వహించారు. విజయవాడ కమిషనరేట్‌లో జరిగిన సదస్సులో డీసీపీలు విక్రాంత్‌పాటిల్, హర్షవర్ధన్‌రాజు, ఏసీపీలు, సీఐలు, సిబ్బంది 
పాల్గొన్నారు. 

కుటుంబ సభ్యులకూ సమాచారం, ఇతరత్రా సాయం 
► యువతులు, మహిళలు తాము ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతోపాటు తమ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు దిశ యాప్‌లో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఐదు నంబర్లను ఆ యాప్‌లో ఫీడ్‌ చేసుకోవచ్చు. దాంతో ఆ ఐదు నంబర్లకు కూడా సమాచారం చేరుతుంది. వారు కూడా వెంటనే పోలీసులను సంప్రదించేందుకు అవకాశం ఉంటుంది. 
► ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం కూడా దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అందుకోసం ఆ యాప్‌లో ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేయాలి. వారు ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు, వారి బంధుమిత్రులకు సమాచారాన్ని పంపుతుంది. దాంతో వారు అప్రమత్తమై రక్షణకు వస్తారు. 
► దిశ యాప్‌లోనే డయల్‌ 100, డయల్‌ 112 నంబర్లు కూడా ఉంటాయి. పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్‌ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా ఉన్నాయి. 

ఇప్పటి వరకు 16 లక్షల డౌన్‌లోడ్లు
► దిశ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 16 లక్షల మందికిపైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. విపత్తుల్లో చిక్కుకున్న ఎందరో ఈ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. నిందితులను అరెస్టు చేసి, న్యాయస్థానాల ద్వారా వారికి శిక్షలు విధించారు. 
► దిశ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు తప్పనిసరిగా తమ మొబైల్‌ ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. 

2 నిమిషాల్లో స్పందన
గుంటూరు రూరల్‌: దిశ యాప్‌ పని తీరుపై విద్యార్థినులు, యువతులు, మహిళల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని హోం మంత్రి సమక్షంలోనే యాప్‌ పనితీరును పరిశీలించింది. గుంటూరు నగర శివారులోని నల్లపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో జరిగిన సభలో విద్యార్థిని దొడ్డా తేజస్విని సభా ప్రాంగణంలోనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కింది. బటన్‌ నొక్కిన 30 సెకన్లలో కాల్‌ సెంటర్‌ నుంచి విద్యార్థినికి కాల్‌ వచ్చింది. తాను నల్లపాడు సెంటర్‌లో ఉన్నానని, ఆకతాయిలు వేధిస్తున్నారని విద్యార్థిని చెప్పింది. మరో 30 సెకన్లలో జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది.

నీవు ఉన్న ప్రదేశం గుర్తించామని, మరో నిమిషంలో అక్కడకు వస్తున్నామని చెప్పారు. అంతలో మరో అధికారి ఫోన్‌ చేసి.. భయపడవద్దని ధైర్యం చెప్పారు. అలా రెండు నిమిషాల్లో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు చెందిన దిశ మహిళా కానిస్టేబుల్‌ షేక్‌ ఫాతిమా దిశ, పెట్రోలింగ్‌ వాహనంతో విద్యార్థిని ఉన్న లొకేషన్‌కు చేరుకుంది. దిశ బృందం స్పందన చూసి, అక్కడ ఉన్న వారందరూ  చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ యాప్‌ ఉపయోగం ఎంతగా ఉంటుందో తెలిసినందున మహిళలందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత విజ్ఞప్తి చేశారు. ‘ఈ యాప్‌ ఉపయోగం ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. నా స్నేహితులందరితోనూ డౌన్‌లోడ్‌ చేయిస్తాను’ అని విద్యార్థిని దొడ్డా తేజస్విని పేర్కొంది. 

పుష్‌ బటన్‌ ఆప్షన్‌...
‘పుష్‌ బటన్‌’ ఆప్షన్‌ పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పరిధిలో ఉంటుంది. ఈ ఆప్షన్‌ ద్వారా పోలీసులు అందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయవచ్చు. ఈ బటన్‌ను ఒకసారి నొక్కితే చాలు యాప్‌ ఉపయోగించే వారందరికీ ఒకేసారి పోలీసుల సందేశం చేరుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement