శనివారం రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్‌ను సీఎస్ నీలం సాహ్ని, దిశ చట్టం అధికారిణి కృతికా శుక్లాతో కలిసి ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఇతర ప్రజా ప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా తీసుకువచ్చిన ‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచి పోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే శిక్షించడం కోసమే ఈ చట్టం తీసుకువచ్చామని చెప్పారు. శాంతి భద్రతలే తమ మొదటి ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. దిశ చట్టం దేశంలోనే ప్రత్యేకమైనదని తెలిపారు. నెలాఖరులోగా రాష్ట్రంలో 18 దిశ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, ఆ మేరకు 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్నామన్నారు. తిరుపతి, విశాఖలో కొత్తగా రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఆయన రాష్ట్రంలోనే తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం నన్నయ వర్సిటీలో ‘దిశ’ చట్టంపై పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొని దిశ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..
దేశంలోనే సరికొత్త అధ్యాయం
‘‘రాష్ట్రంలోని 1,349 పోలీసుస్టేషన్లు, అందులోని 1,049 వన్ స్టాప్ సెంటర్లు దిశ పోలీస్ చట్టానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. అక్కడ ఉన్న పోలీస్ అక్క చెల్లెమ్మలు, సోదరులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో మరచిపోలేని రోజుగా ఇది నిలిచిపోతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ జరిగిన రోజున నేను అన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పాను. మహిళల మీద నేరాలను ఏ మాత్రం ఉపేక్షించబోమన్నాం. అక్క చెల్మెమ్మలు అందరికీ తోడుగా ఉంటామని చెప్పాం. మహిళలు, చిన్నారులపై ఎవరు నేరాలకు పాల్పడటానికి సాహసించినా నిర్ధాక్షిణ్యంగా చట్టాన్ని ప్రయోగించాలని చెప్పడానికి దేశంలోనే తొలిసారిగా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం.
రాజమహేంద్రవరంలోని నన్నయ వర్సిటీలో ‘దిశ’ చట్టంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్‌షాపులో సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో దిశ ప్రతిజ్ఞ చేయిస్తున్న చిన్నారులు
ఈ రోజు రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్‌ను ఇక్కడ రాజమహేంద్రవరంలో ప్రారంభించినందుకు చాలా గర్వపడుతున్నా. ఈ చట్టం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం. హైదరాబాద్‌లో ఒక చెల్లెమ్మ ‘ఇఫ్ మై మెమొరీ గోస్ టు ఐ థింక్ నేమ్ ఈజ్ ప్రియాంక. 26 ఏళ్ల ఒక డాక్టర్ చెల్లెమ్మ. టోల్ గేట్ దగ్గర నుంచి రాత్రి పోతున్నప్పుడు జరిగిన ఘటన. ఒక చెల్లెమ్మ రాత్రి పూట ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉందని ఆ ఘటన మన కళ్లెదుట కనిపిస్తోంది. ఆ తర్వాత దేశమంతా చర్చనీయాంశమైంది. ఈ అంశం ఒక్కటే కాదు. మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పిల్లల్ని సైతం వదలకుండా అఘాయిత్య ఘటనలు జరుగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. మనషులు రాక్షసులవుతుండటం కళ్లెదుట కనిపిస్తోంది. నలుగురు కలిసి తాగినప్పుడు మనుషులు రాక్షసులవుతున్నారు. అలా రాక్షసులైనప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థంకాని పరిస్థితి.
వెంటనే శిక్షలు పడితే వ్యవస్థలో మార్పు
ఇలాంటి ఘటనలకు కారణమైన వాళ్లను ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది. సినిమాల్లో అయితే ఇటువంటిæ ఘటనలు ఎక్కడైనా జరిగితే హీరో టప టపా కాల్చేస్తాడు. అప్పుడు మనమంతా కూడా చప్పట్లు కొడతాం. కానీ దురదృష్టవశాత్తు చట్టాలు మనకు ఆ స్వేచ్ఛ ఇవ్వవు. మరోవైపు జరిగిన ఘటనలు చూస్తే విపరీతమైన కోపమొస్తుంది. న్యాయం జరగడం ఆలస్యమవుతోంది. ఇటువంటి పరిస్థితిలో చట్టాల మీద మనకున్న గౌరవం పోతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చాం. చట్టం పరిధిలోనే న్యాయం జరగాలి. ఆ చట్టం త్వరిగతిన న్యాయాన్ని అందించాలి. దోషులకు వెంటనే శిక్షలు పడినప్పుడు వ్యవస్థలో భయమనేది ఒకటి వస్తుంది. అప్పుడే వ్యవస్థ బాగు పడుతుంది. నిర్భయ చట్టం చూశాం. జ్యోతి సింగ్ అనుకుంటా.. 8 సంవత్సరాలవుతున్నా కూడా ఆ ఘటనలో దోషులకు శిక్ష పడని పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ దర్యాప్తు, కోర్టుల విచారణకు సంవత్సరాలకు సంవత్సరాలు పడుతుండటం నేరాలు పెరిగేందుకు దారి తీస్తుంది.
ఇలాగే వదిలేద్దామనుకోలేదు..
దిశ చట్టంతో ఏం జరగబోతోంది? ఇంతకు ముందు, ఇప్పటికీ తేడా ఏమిటి? అని ఈ చట్టం గురించి నాలుగు మాటలు చెప్పాలంటే.. మహిళల మీద, పిల్లల మర్యాదకు భంగం కలిగించే నేరాలు ఎక్కడైనా జరిగితే వాటిలో రెడ్ హ్యాండెడ్ కేసులు అంటే కేసెస్ విత్ అడిక్వెట్ కంక్లూసివ్ ఎవిడెన్స్.. ఎక్కడైనా ఉంటే 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం. 14 రోజుల్లోగా విచారణ కూడా పూర్తి చేసి ఏకంగా ఉరిశిక్ష వేయడానికి కూడా అనువుగా ఈ చట్టాన్ని తయారు చేశాం. అంటే ఎక్కడైనా మన కళ్లెదుటనే ఒక పాశవికæ ఘటన జరిగిన తర్వాత కూడా దాన్ని అలానే వదిలేస్తే, న్యాయం జరక్కపోతే ఇక ఆ తర్వాత ఈ వ్యవస్థలో మార్పు అనేది రాదు. మైకులు పట్టుకుని మాట్లాడటమనేది ఉంటుంది కానీ, మార్పు మాత్రం రాని పరిస్థితి. అందుకే సీఆర్‌పీసీ, ఐపీసీ చట్టాల్లో కావాల్సిన మార్పులు చేశాం.
ఈ చట్టం కాంక్రెంట్ లిస్ట్‌లో ఉంది కాబట్టి బిల్లును ఆమోదించి ప్రెసిడెన్సియల్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. హోం మినిస్ట్రీలో ఫైల్ నడుస్తోంది. దేవుడు ఆశీర్వదిస్తే ఈ బిల్లు చట్టం రూపంలో త్వరలోనే వస్తుందనీ, రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అది పూర్తిగా మన చేతుల్లో ఉన్న అంశం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేశాం. ఒక వైపు ఈ ప్రయత్నం చేయడమన్నది ఒక యాస్పెక్ట్ అయితే రెండవ యాస్పెక్ట్ మన చేతుల్లో రాష్ట్రం పరిధిలో కొన్ని మార్పులు. వీటి మీద ధ్యాస పెట్టాం.
13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులు
పిల్లలు, మహిళల మీద జరిగే నేరాల్లో దోషులకు వెంటనే శిక్ష విధించేందుకు 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పాం. ఇందు కోసం రూ.26 కోట్లు ఇచ్చి హైకోర్టును అభ్యర్థించాం. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రతి జిల్లాలోనూ ఒక డెడికేటెడ్ ఎక్స్‌క్లూసివ్ కోర్టు దిశ మీదనే పని చేస్తుంది. ఈ 13 కోర్టుల్లోనూ 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించేందుకు రూ.1.65 కోట్లు మంజూరు చేశాం. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణ కోసం డెడికేటెడ్ పోలీసుస్టేషన్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఒక పోలీసుస్టేషన్‌ను ప్రారంభించాం. ఇలాంటి పోలీసుస్టేషన్లు ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా 18 ఉంటాయని చెప్పడానికి గర్వ పడుతున్నా. ఇందులో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఐదుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, మొత్తం మీద దాదాపు 36 నుంచి 47 మంది సిబ్బందితో ఈ స్టేషన్లు పని చేస్తాయి. ఇందులో అత్యధికంగా మహిళలే ఉంటారు. రాజమహేంద్రవరం పోలీసుస్టేషన్‌లో అయితే ఒక అడుగు ముందుకు వేశారు. ఇక్కడి అర్బన్ ఎస్పీ షిమూషి బాజ్‌పేయి మహిళే కాబట్టి ఏకంగా 47 మంది సిబ్బందిని పెట్టేశారు. ఇందుకు ఆమెను అభినందిస్తున్నా.
ఫొరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యం పెంచాం
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క చోట ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. అక్కడ కూడా సిబ్బంది, ఎక్విప్‌మెంట్ కూడా సరిగా లేని పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చడానికి రూ.31 కోట్లు కేటాయించాం. మంగళగిరిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్స్‌ను కలుపుతూ విశాఖపట్నం, తిరుపతిలలో ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకువచ్చాం. అందులో 118 మంది సిబ్బంది పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆ చట్టం వచ్చే సరికే అన్ని రకాలుగా మనం ముందడుగులో ఉండాలనే ఉద్దేశంతో ఇలా అడుగులు ముందుకు వేశాం. ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే సహాయం చేసే వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం కాసేపటి క్రితమే దిశ కాల్‌సెంటర్, దిశ యాప్‌ను ప్రారంభించాం. 10 సెకన్లలోనే పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం పంపుతుంది. ఆ తర్వాత ఆపదలో ఉన్న వారిని ఎలా కాపాడతారో చూశాం.
అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ తోడుంటాం
అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కూడా తిరక్క మునుపే 42 లక్షల మంది తల్లులకు తద్వారా 82 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా దేవుడు దయతో గొప్పగా మేలు చేసే అవకాశం లభించింది. అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఈ ఉగాది నాటికి అక్క చెల్లెమ్మల చేతుల్లో 25 లక్షల ఇళ్ల పట్టాలు పెట్టి.. వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. నాడు–నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూళ్ల రూపు రేఖలు మార్చబోతున్నాం. ఇంగ్లిష్ మీడియం ద్వారా పిల్లల జీవితాలను మేలి మలుపు తిప్పబోతున్నాం. అక్కచెల్లెమ్మల కుటుంబాలలో ఆనందం నింపేలా మద్యాన్ని నియంత్రిస్తూ అడుగులు ముందుకు వేశాం. రాబోయే రోజుల్లో ఆ అడుగులు ఇంకా గట్టిగా పడతాయి.
అక్కచెల్లెమ్మల కోసం నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ తప్పక ఉండాలని ఏకంగా చట్టాన్నే తెచ్చిన ప్రభుత్వం మనదేనని గర్వంగా చెబుతున్నా. పొదుపు సంఘాల్లోని, అట్టడుగులో ఉన్న అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమాన్ని మళ్లీ తీసుకువస్తున్నాం. ఆ కార్యక్రమం ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. 2016 అక్టోబర్ నుంచి ఆ కార్యక్రమం పూర్తిగా రద్దయిపోయింది. అందుకే ఆ కార్యక్రమానికి మన ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుడుతోంది. అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే మీ బిడ్డను, మీ అన్నను, మీ తమ్ముడిని దీవించాలని, ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నా’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజిని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ‘దిశ’ పోలీసుస్టేషన్ల ప్రత్యేకాధికారిణి దీపికాపటేల్ తదితరులు పాల్గొన్నారు.
దిశ యాప్ ప్లే స్టోర్‌లో అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిని దాదాపు 5,048 మొబైల్ టీమ్స్‌కు లింక్ చేశాం. ఈ యాప్ ఓపెన్ చేసి ఎస్‌ఓఎస్ అనే బటన్ నొక్కితే కేవలం 10 సెకన్లలో ఆడియో, వీడియో ట్రాన్స్‌మీట్ అవుతుందని ఇంతకు ముందే మనం చూశాం. (సీఎం దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ కనెక్ట్ అవ్వడం.. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ గుర్తించిన కంట్రోల్ రూమ్ సిబ్బంది సమీపంలోని రాజానగరం పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం.. 10 నిమిషాల్లో ఒక ఎస్‌ఐ, ఒక మహిళా కానిస్టేబుల్ కాల్ చేసిన సీఎం వద్దకు చేరుకోవడం ప్రత్యక్షంగా చూపించారు)
నేరం చేస్తే ప్రతి అడుగులోనూ శిక్ష తప్పదని గట్టిగా సందేశాన్ని పంపించడం కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం. మూడు నాలుగు నెలల్లో అన్నీ పూర్తిగా అమల్లోకి వచ్చేస్తాయి. నేరాన్ని ఆపడం, నేరం జరిగితే వెంటనే శిక్షించడం.. తద్వారా నేరగాళ్లు, నేర మనస్తత్వం ఉన్న వారికి గట్టిగా సంకేతం పంపాలనేదే నా ఉద్దేశం.
మహిళల అక్షరాస్యత, ఆర్థికంగా స్వతంత్రులు కావడం, నిర్భయంగా సంచరించగలగడం వంటివి సమాజం అభివృద్ధికి ప్రామాణికాలు. పురుషులతో సమానంగా వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి అన్ని రకాల అవకాశాలు ఉండాలనే తపన, తాపత్రయం ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఉంది. వారందరి కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, చివరకు వారి పిల్లలకు ఒక మంచి మేనమామగా వారి గురించి ఆలోచించి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచే అవతరించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment