సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 4,940 బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 10 నుంచి 13 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ పరిధిలో 3,414 బస్సులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రాంతాలకు 1,526 బస్సులు ప్రత్యేక సర్వీసులుగా తిరగనున్నాయి. రోజువారి నడిచే రెగ్యులర్ సర్వీసులకు ఇవి అదనం. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, సీబీఎస్, జూబ్లీబస్ స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, టెలీఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్‌బీనగర్‌లతోపాటు నగరంలోని కొన్ని ముఖ్యమైన కాలనీల నుంచి ఈ సర్వీసులు బయల్దేరనున్నాయి.
తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు, ముఖ్యమైన పట్టణాలు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పొదిలి తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు తిరుగుతాయి. పదో తేదీన 965 బస్సులు, 11న 1,463, 12న 1,181 బస్సులు 13న మిగతావి నడుపుతారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ అదనపు బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
ఎక్కడ్నుంచి ఎక్కడకు..
సీబీఎస్: కర్నూలు, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, మదనపల్లి తదితర ప్రాంతాల వైపు వెళ్లేందుకు ఏర్పాటు.
ఎంజీబీఎస్: ప్లాట్‌ఫామ్ 1–5: గరుడప్లస్, గరుడ, అంతర్రాష్ట్ర షెడ్యూల్ బస్సులు. 6–7: బెంగళూరు వైపు, 10–13: ఖమ్మం వైపు, 14–15:దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌కు ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సు. 18–19: ఉప్పల్ క్రాస్‌రోడ్డుకు ప్రతి 10 ని.కు సిటీ బస్సు. 23–25: శ్రీశైలం, కల్వకుర్తి వైపు, 26–31: రాయచూర్, మహబూబ్‌నగర్ వైపు, 32–34 నాగర్‌కర్నూలు, షాద్‌నగర్ వైపు, 35–36, 39: విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు వైపు, 37–38, 40: ఏపీ బస్సులు.
రూ.6 కోట్ల ఆదాయం లక్ష్యం
గత సంక్రాంతి సమయంలో 4,600 బస్సులు తిప్పగా దాదాపు రూ.5 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి ఛార్జీల పెంపు, బస్సుల సంఖ్య ఎక్కువ కావటంతో దాదాపు రూ.6 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రత్యేక సర్వీసులకు 50% అదనపు రుసుము వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈసారి అంతర్రాష్ట్ర సర్వీసులకు అంతమేర వసూలు చేస్తూ, రాష్ట్రం పరిధిలో తిరిగే వాటి విషయంలో రీజినల్ మేనేజర్లకు స్వేచ్ఛనిచ్చారు. ఇటీవలే చార్జీలు పెంచినందున, 50 అదనపు మొత్తం వసూలు చేస్తే ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి స్థానిక ఆర్‌ఎంలు అదనపు చార్జీల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈమేరకు ఈడీ ఆపరేషన్స్ యాదగిరి గురువారం సీటీఎం మునిశేఖర్, రీజినల్ మేనేజర్లతో భేటీ అయి ఈ అదనపు సర్వీసుల గురించి చర్చించారు.
ఆర్టీసీ సిబ్బందికి మొబైల్ టాయిలెట్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బంది కోసం ఆ సంస్థ సంచార బయోటాయిలెట్లను ఏర్పాటు చేయనుంది. కండీషన్ తప్పిన బస్సులను బయోటాయిలెట్లుగా రూపొందించారు. సిబ్బంది డ్రెస్ మార్చుకోవటం, విశ్రాంతిగా కూర్చోవటం, మూత్రశాల, మరుగు దొడ్డి వినియోగం.. వంటి అవసరాలకు ఆర్టీసీ ప్రత్యేకంగా వీటిని రూపొందించింది. స్థలాభావం ఉన్న చోట నిర్మాణాలు చేపట్టే అవకాశం లేకపోవటంతో, పాత బస్సులనే చేంజ్ ఓవర్ గదులుగా మార్చేశారు. ప్రస్తుతానికి 9 పాయింట్ల వద్ద వీటిని ఉంచనున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్నాయి. ఉదయం షిఫ్ట్ సమయానికి వాహనాలు అక్కడికి వచ్చి సెకండ్ ఫిఫ్ట్ పూర్తయ్యే వరకు ఉండి.. తర్వాత డిపోకి వెళ్లిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment