లాభాల రూట్‌లోకి..
- డీజిల్ ధర తగ్గడంతో ఆర్టీసీ విజయవాడ జోన్‌లో నెలకు రూ.5.30కోట్ల ఆదా
- నెలకు నష్టం కేవలం రూ.70లక్షలు..
- ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే లాభాలు వచ్చే అవకాశం
- మరోసారి ఇంధన ధరలు తగ్గితే నష్టాలు ఉండవు
సాక్షి, విజయవాడ : వరుసగా డీజిల్ ధరలు తగ్గుతూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఊరట లభించింది. ముఖ్యంగా విజయవాడ జోన్ నష్టాల నుంచి బయటపడే అవకాశం లభించింది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో డీజిల్ ధరలు ఎనిమిదిసార్లు తగ్గాయి. దీంతో జోన్ పరిధిలో నెలకు రూ.5.30 కోట్ల ఖర్చు తగ్గింది. ఇదే తరహాలో మరోసారి డీజిల్ ధర తగ్గితే ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్ పూర్తిస్థాయిలో లాభాలబాటలో పయనిస్తుంది. విజయవాడ ఆర్టీసీ జోన్‌లో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి.
గతంలో వివిధ కారణాలతో కారణాలతో ఆర్టీసీకి నెలకు సగటున రూ.6 కోట్ల వరకు నష్టం వచ్చేది. గడచిన ఆరు నెలల్లో ఏడుసార్లు డీజిల్ ధరలు తగ్గాయి. తాజాగా రూ.2.15 తగ్గింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం లీటరు డీజిల్ ధర సుమారు రూ.13 వరకు తగ్గింది. దీంతో విజయవాడ జోన్‌లో ఉన్న 3,200 బస్సులకు రోజూ రూ.16 లక్షల మేర ఖర్చు తగ్గింది. నెలకు రూ.5.30 కోట్ల వరకు తగ్గింది. దీంతో నష్టం కూడా నెలకు రూ.70 లక్షలు మాత్రమే వస్తోంది. ఈ నష్టాన్ని కూడా అధిగమించేందుకు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియోను పెంచడానికి కసరత్తు చేస్తున్నారు.
రోజుకు 2.50 లక్షల కిలోమీటర్లు..
జోన్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న 3,200 బస్సులు కలిపి రోజుకు 2.50 లక్షల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. పల్లెవెలుగు బస్సులకు సగటున 50 శాతంపైన, ఎక్స్‌ప్రెస్, ఏసీ, గరుడ సర్వీసులకు 65 శాతంపైగా ఆక్యుపెన్సీ రేషియో ఉంటే నష్టాలు రావు. కానీ, గతంలో ఆర్టీసీకి కిలోమీటర్‌కు మూడు రూపాయల వరకు నష్టం వచ్చేది. ప్రస్తుతం డీజిల్ ధర తగ్గడంతో అద్దె బస్సు కాంట్రాక్టర్లకు చెల్లించే మొత్తం కాస్త తగ్గింది.
డీజిల్ ధరలు మరోసారి తగ్గితే ఖర్చు, ఆదాయం సమానమై ఆర్టీసీ బ్రేక్ ఈవెన్ దశకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో కాస్త పెరిగితే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుందని భావిస్తున్నారు. డీజిల్ ధరలు తగ్గడం ఆర్టీసీకి ఊరట కలిగించాయని, మళ్లీ ధరలు తగ్గితే లాభాల బాట పట్టే అవకాశం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నాగరాజు ‘సాక్షి’కి తెలిపారు.