ఏపీఎస్‌ఆర్టీసీ@విజయవాడ
{పధాన పాలనా కేంద్రాన్ని తరలించే యోచనలో ఎండీ
ఇందుకోసం అక్కడ ప్రత్యేక భవనాన్ని నిర్మించేందుకు కసరత్తు
నష్టాల్లో ఉన్న ఆంధ్రా ఆర్టీసీ గట్టెక్కాలంటే పాలన అక్కడే ఉండాలని నిర్ణయం
ఇది జరిగితే విభజన తర్వాత ఏపీకి తరలే తొలి కార్పొరేషన్ ఇదే
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయి పది నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ పాలన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రంగానే సాగుతోంది. ప్రభుత్వ విభాగాలు గానీ, కార్పొరేషన్లుగానీ అక్కడి నుంచి ఇంకా తరలలేదు. ఈ తరుణంలో హైదరాబాద్ వెలుపల పాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే తొలి కార్పొరేషన్‌గా ఏపీఎస్ ఆర్టీసీ నిలవబోతోంది. ఈ దిశగా ఆర్టీసీ ఎండీ సాంబశివరావు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం విజయవాడలో భవనాన్ని నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆర్టీసీకి రాకముందు ఏపీ ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేసిన సమయంలో ఆ విభాగానికి విజయవాడలో పరిపాలన భవనం నిర్మించారు. అదే తరహాలో ఆర్టీసీకి కూడా భవనాన్ని సమకూర్చి పాలనను అక్కడి నుంచే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. నష్టాల ఊబిలో చిక్కుకున్న ఆర్టీసీని గాడిలో పెట్టాలంటే ముందుగా దాన్ని విభజించడం తప్పదన్న అభిప్రాయాన్ని సాంబశివరావు మొదట్లోనే వ్యక్తం చేశారు. దానికి సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదురుకావటంతో ‘స్థానికత’ ఆధారంగా ఏ ప్రాంత అధికారులు, సిబ్బంది అక్కడే ఉండేలా తాత్కాలిక విభజన చేపట్టారు. అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కేటాయింపు కూడా పూర్తిచేశారు. వారి నుంచి ‘ఆప్షన్లు’ స్వీకరిస్తున్న ఆయన... మే 15 నాటికి అవసరమైన మార్పు చేర్పులతో తుది కేటాయింపులు పూర్తిచేసి పోస్టింగులు ఇవ్వనున్నారు. ఫలితంగా పాలనపరంగా కూడా ఆర్టీసీ పూర్తిగా విడిపోయినట్లవుతుంది. అప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ పాలన సరికాదనేది ఆయన అభిప్రాయం. దీంతో విజయవాడలో పరిపాలన కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు.
అధికారులు, కార్మిక నేతల్లో వ్యతిరేకత
ఏపీఎస్ ఆర్టీసీ పాలనను విజయవాడకు తరలించాలన్న ఎండీ నిర్ణయాన్ని ఉన్నతాధికారులు, కార్మిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీఎం, రవాణా మంత్రి, కార్యదర్శుల కార్యాలయాలు సచివాలయంలో ఉన్నందున... ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌ను వీడి విజయవాడలో ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తే కొత్తగా వచ్చే ప్రయోజనమేమీ ఉండదని వారు పేర్కొంటున్నారు. అలా చేస్తే ప్రతి ముఖ్యమైన పనికి హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తుల వివాదం తేలకుండా ఇక్కడి నుంచి వెళ్లడం కూడా సరికాదని వాదిస్తున్నారు. అయితే మరో 3 నెలల్లో ఈ ఆస్తుల విషయాన్ని కూడా తేల్చేందుకు ఎండీ కసరత్తు చేస్తున్నారు. అది కూడా ముగిస్తే ఇక హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం లేదని... ఫోన్ ద్వారానో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో సచివాలయంతో సంప్రదింపులు జరిపే వెసులుబాటు ఉందని ఎండీ పేర్కొంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ‘ఎ’ బ్లాక్‌ను ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయించారు. అందులో ఇటీవల రూ.1.85 కోట్ల వ్యయంతో వసతులు కల్పించారు. ఇప్పుడు విజయవాడకు తరలితే.. అదంతా వృథా అవుతుందని, దానికితోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని అంటున్నారు. కానీ ఎండీ మాత్రం ఇవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేనట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో ఆరు నెలల్లో అయినా ఏపీఎస్ ఆర్టీసీని తరలించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.