అరకొర బస్సులతో అవస్థలు
{పమాదమని తెలిసినా తప్పని ప్రయాణం
ఇబ్బందుల్లో విద్యార్థులు
మునగపాక: విద్యారంగం అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ ప్రకటనలు చేయడమే తప్పా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో శ్రద్ధ వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి చుదువుకోవాలంటే పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. వారు పడుతున్న కష్టాలు చెప్పలేనివి. మునగపాకతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు అనకాపల్లి, గాజువాక, కశింకోటలోని ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్‌లో చదువుకుంటున్నారు. అటు అచ్యుతాపురం, విశాఖపట్నంలోని పలు ఐటీఐలో విద్యను అభ్యసిస్తున్నారు. వీరు వేచి ఉండేందుకు కనీసం బస్‌షెల్టర్లు లేవు. ఉదయం నుంచి బస్సుల కోసం ఎదురు చూడడం తీరా బస్సులు వస్తే ర ద్దీగా ఉండడంతో కొంతమంది విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. వీరు సకాలంలో కళాశాలలకు చేరుకోలేకపోతున్నారు. మరి కొందరు విద్యార్థులు ప్రమాదమని తెలిసినా తప్పని స్థితిలో పుట్‌పాత్‌పై నిలబడి గ్రిల్స్‌ను పట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వేలాడుతూ వెళ్లడం వల్ల పొరపాటున పట్టుతప్పితే ప్రమాదం బారినపడక తప్పదు. ఆయా ప్రాంతాలకు వెళ్లాలం టే బస్సు ప్రయాణం ఒక్కటే మార్గం. దీంతో ఉదయం 8 గంటల నుంచి విద్యార్థులు మునగపాకలోని మెయిన్ రోడ్డుకు చేరుకుంటారు. ఆ సమయం లో ఉన్న ఒకటి, రెండు బస్సులు కూడా కిక్కిరిసిన ప్రయాణికులతో వస్తుండడంతో బస్సులు ఆపకపోవడంతో ఆర్థికభారమైనా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రమాదమైనా తప్పడం లేదు
నేను ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్‌లో చదువుకునేందుకు బస్సుపై వెళ్తున్నాను. ఉదయం సమయంలో పై గ్రామాల నుంచి వచ్చే బస్సు అసలు ఖాళీ ఉండడం లేదు. కళాశాలకు హాజరుకావాలన్న ఆత్రుతతో ప్రమాదమని తెలిసినా పుట్‌పాత్‌పై నిలబడి రాకపోకలు సాగిస్తున్నాను. అయినా సకాలంలో కళాశాలకు వెళ్లలేకపోతున్నాం.
-దాడి తులసీరామ్, పాలిటెక్నిక్ విద్యార్థి
హాజరు కోల్పోతున్నాం
అరకొర బస్సుల కారణంగా కళాశాలలకు అనుకున్న సమయాలకు హాజరుకాలేకపోతున్నాం. కొన్నిసార్లు ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారనే నెపంతో బస్సులు ఆపడం లేదు. దీంతో ఆటోలను ఆశ్రయించి వెళ్తున్నాం. ఆటోలో ప్రయాణికులంతా ఎక్కుతే గానీ తీసుకువెళ్లడం లేదు. ఫలితంగా హాజరు కోల్పోతున్నాం.
-ప్రదీప్, ఇంటర్ విద్యార్థి, మునగపాక
ఉన్నత చదువులకు ఎన్ని కష్టాలో...
Published Thu, Feb 26 2015 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement