సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో ఏసీలు పని చేయడం లేదు. దీంతో బయటి ఉష్ణోగ్రతలకు ఏమాత్రం తీసిపోని విధంగా బస్సుల్లో వేడి ఉంటోంది. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, నిర్వహణ లోపం కారణంగా ఏసీ యంత్రాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏసీ బస్సులు ఆర్డినరీ కంటే అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అన్ని మార్గాల్లోనూ ఏసీ బస్సుల పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో ప్రవేశపెట్టిన టాటా కంపెనీకి చెందిన సుమారు 60 మార్కోపోలో టైప్ ఏసీ బస్సులను మొదటహైటెక్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ‘సిటీ శీతల్’గా నడిపారు. ఆ తర్వాత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘పుష్పక్’ బస్సులుగా నడిపారు. వీటి స్థానంలో మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు ప్రవేశపెట్టి.. ఆ తర్వాత ఆ బస్సులనే వివిధ ప్రాంతాల నుంచి ‘పుష్పక్’లుగా ఎయిర్‌పోర్టుకు నడిపారు.
ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వరకు నడిచే 300 రూట్‌లో ఈ సిటీ శీతల్ బస్సులు నడుస్తున్నాయి. కానీ ఏ ఒక్క బస్సులోనూ ఏసీ సరిగ్గా పని చేయడం లేదు. ‘బయటి గాలి లోపలికి వచ్చేందుకు అవకాశం లేకుండా అన్ని వైపులా గ్లాస్‌విండోస్ ఉంటాయి. అలాగని ఏసీ ఉండదు. దీంతో ఈ రూట్‌లో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామ’ని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఏసీ చార్జీలు చెల్లించి ఆర్డినరీ బస్సుల్లో పయనించినట్లుగా ఉంటోంద’ని బండ్లగూడ ప్రాంతానికి చెందిన ప్రయాణికుడు ఒకరు పేర్కొన్నారు. మరోవైపు సామర్థ్యం (ఫిట్‌నెస్) దృష్ట్యా బస్సులు బాగానే ఉన్నప్పటికీ సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో, ప్రత్యేకించి ఏసీలు రిపేర్ చేసే టెక్నీషియన్‌లు లేకపోవడంతో ఏసీలు పని చేయడం లేదని’ మెహిదీపట్నం డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు చెప్పారు. ఒక్క 300 రూట్ బస్సులే కాకుండా ఒకప్పటి సిటీ శీతల్ బస్సులన్నీ ఇప్పుడు చాలా వరకు డొక్కు బస్సుల జాబితాలో చేరిపోయాయి. నిర్వహణ లోపం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్టీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
‘మెట్రో లగ్జరీ’లోనూ...
ఇక 2014లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సుల్లోనూ ఏసీ అరకొరగానే ఉంటోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ‘బస్సులో వాతావరణం చల్లగా ఉండాలంటే కనీసం 25 డిగ్రీల లోపు టెంపరేచర్ ఉండాలి. కానీ 35 డిగ్రీలపైనే ఉంటోంది. ఏసీలు పని చేస్తున్నాయో లేదో తెలియదు. ఏసీల నుంచి చాలా తక్కువగా గాలి వస్తోంది. ఉక్కపోత తప్పడం లేదు’ అని ఎల్‌బీనగర్ నుంచి బీహెచ్‌ఈఎల్ మధ్య నడిచే 222 రూట్ బస్సు ప్రయాణికుడు సిద్ధేశ్వర్ తెలిపారు. ‘బీహెచ్‌ఈఎల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు రూ.100 చార్జీ ఉంటుంది. కానీ ఏసీ మాత్రం ఉండదు’ అని విస్మయం వ్యక్తం చేశారు. మధ్యాహ్న సమయంలో ఏసీ బస్సుల్లో ప్రయాణించడం దుస్సాహసమేనని పేర్కొన్నారు.
ఐదేళ్ల క్రితం 80 మెట్రో లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీటిని నడిపారు. ఇటీవల విమానాశ్రయానికి ఎలక్ట్రిక్ ఓల్వో బస్సులు వచ్చిన తరువాత ఇతర రూట్‌లలోకి వీటిని మళ్లించారు. కానీ బస్సుల నిర్వహణ మాత్రం కొరవడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మెట్రో రైల్ రాకతో నిరాదరణకు గురవుతున్న ఏసీ బస్సులు నిర్వహణ లోపం కారణంగా మరింత ఘోరంగా తయారవుతున్నాయి. మెట్రో రైల్ దృష్ట్యా ఇప్పటికే పలు రూట్‌లలో ఏసీ బస్సులను ఉపసంహరించుకున్నారు. ప్రయాణికుల నిరాదరణ వల్ల మరిన్ని నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment