Hyderabad Bus Stand Problems: ఇక్కడ బస్టాప్‌ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు! - Sakshi
Sakshi News home page

Hyderabad City Bus Stops: ఇక్కడ బస్టాప్‌ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు!

Published Wed, Sep 1 2021 7:53 AM | Last Updated on Wed, Sep 1 2021 11:12 AM

Bus Stops Are Disappearing In GreaterHyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిటీ బస్సులే కాదు.. బస్టాపులు కూడా ఉన్నపళంగా మాయమవుతున్నాయి. ఇప్పుడు ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు, ఫ్లైవర్‌ నిర్మాణ పనుల కారణంగా నగరంలో ప్రజారవాణా స్వరూపం పూర్తిగా మారిపోయింది. గ్రేటర్‌లో సుమారు 1,050 రూట్లలో బస్సులను నిలిపి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు గతంలో 2,550కుపైగా బస్టాపులు ఉండేవి. విస్తరిస్తున్న మహానగర అవసరాలను దృష్టిలో ఉంచుకొంటే వీటి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి.

రోజురోజుకూ కొత్త కాలనీలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో సిటీ బస్సులు, బస్టాపులు పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వాటి సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గిపోవడం గమనార్హం. గత రెండేళ్లలో సుమారు 850కిపైగా బస్టాపులను తొలగించినట్లు అంచనా. మరోవైపు కొన్ని రూట్లలో షెల్టర్‌లు ఉన్న చోట డ్రైవర్లు బస్సులు నిలపడంలేదు. అభివృద్ధి పనుల దృష్ట్యా మార్పులు అనివార్యమే. కానీ.. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండానే బస్టాపులను తొలగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు నిలిపే స్థలాలు  తెలియకపోవడంతో గందరగోళం నెలకొంటోంది. 


 
మచ్చుకు కొన్ని ప్రాంతాలు.. 
► వీఎస్‌టీ నుంచి ఇందిరా పార్కు వరకు సిటీ బస్సులు నిలిపేందుకు ఆరు చోట్ల బస్టాపులు ఉన్నాయి. ఉప్పల్‌ నుంచి మెహిదీపట్నం, జియాగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులు, సికింద్రాబాద్‌ నుంచి కోఠీకి ఈ రూట్లో బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో కొంతకాలంగా జరుగుతున్న ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులతో బస్టాపులు ఉనికిని కోల్పోయాయి. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఒకప్పుడు వీఎస్‌టీ బస్టాపులో పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అక్కడ  ప్రయాణికులు కనిపించడం లేదు.  

►లక్డీకాపూల్‌ ఒకప్పుడు అతిపెద్ద బస్టాపు. నగరం నలువైపుల నుంచి బస్సులు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండేది. మెట్రో రైలు కోసం బస్టాపులను తొలగించారు. ఒక్క లక్డీకాఫూల్‌ మాత్రమే కాదు. మాసాబ్‌ట్యాంక్, విజయ్‌నగర్‌ కాలనీ, ఎన్‌ఎండీసీ బస్టాపులు కూడా మాయమయ్యాయి. 

►హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌– 8 వద్ద ఒక బస్టాపు ఉండేది. ఇప్పుడు అక్కడ మెట్రో స్టేషన్‌ వచి్చంది. దీంతో ఆ ఇరుకు రోడ్డుపైనే బస్సులు నిలపడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.  

► ఫ్లై ఓవర్‌ రాకతో ఎల్‌బీనగర్‌ స్వరూపం మారింది, చాలా చోట్ల బస్టాపుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూపార్కు వద్ద ప్రస్తుతం ఫ్లై ఓవర్‌ పనులను చేపట్టారు. దీంతో ఆ రూట్‌ లో బస్సులకు బ్రేక్‌ పడింది. కానీ అదేసమయంలో ప్రైవేట్‌ వాహనాలకు ఇప్పుడు బహదూర్‌పురా చౌరస్తా ఒక ప్రధాన అడ్డాగా మారింది.  ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.   

సర్వీసుల్లోనూ కోత... 
బస్టాపుల తీరు ఇలా ఉంటే.. సిటీ బస్సుల సేవలు కూడా అందుకు తగినవిధంగానే ఉన్నాయి. వందలకొద్దీ రూట్లలో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలకు, గ్రామాలకు రాకపోకలు సాగించే సుమారు 5 వేలకుపైగా ట్రిప్పులను రద్దు చేశారు.  
►షాద్‌నగర్, మేడ్చల్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, చేవెళ్ల తదితర ప్రాంతాల వైపు ఉన్న సుమారు 100కు పైగా గ్రామాలకు 70 శాతం సరీ్వసులు రద్దయ్యాయి.  
►గతంలో గ్రేటర్‌లో 3,850 బస్సులు, ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరిగితే ఇప్పుడు వాటి సంఖ్య 2,700 పరిమితమైంది. వివిధ కారణాలతో కనీసం 10 వేలకు పైగా ట్రిప్పులు రద్దయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement