bus shelter
-
టీడీపీ కార్యకర్త దౌర్జన్యం.. బస్సు షెలర్ట్ కబ్జా!
శ్రీకాకుళం: తెలుగుదేశం నేతలు కబ్జాపర్వానికి తెరతీశారు. ఆర్టీసీ స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. అధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలం బ్యారేజీ సెంటర్ మూడు రహదారులకు జంక్షన్ కావడంతో(2018 –19) టీడీపీ హయాంలో బస్ షెల్టర్ నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.లక్షన్నర నిధులు కేటాయించారు. లోతట్టు ప్రాంతం కావడంతో పిల్లర్లు, బేస్మెంట్ శ్లాబ్ వేసి విడిచిపెట్టారు. అప్పటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలో నిలిపివేశారు. తర్వాత కొద్దిరోజులకే ఎన్నికలు జరగడంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆరేళ్లుగా అసంపూర్తి ఉన్న ఈ నిర్మాణంపై టీడీపీ నాయకుడు, ఎంపీటీసీ భర్త కన్ను పడింది. ఆర్అండ్ఆర్ కాలనీ సర్పంచ్ భర్త సహకారం తీసుకుని తనదే భూమి అన్నట్టు వ్యవహరించడం ప్రారంభించాడు. అసంపూర్తిగా ఉన్న బస్‌షెల్టర్ చుట్టూ సిమెంట్ ఇటుకలతో గోడల నిర్మాణానికి పూనుకున్నాడు. దీనిపై కొందరు స్థానికులు ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆర్అండ్బీ ఏఈ పోలీసుల సహకారంతో చేరుకుని పనులు నిలిపివేయించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆక్రమణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా స్థలం స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగా రాత్రిపూట బస్‌షెల్టర్ పిల్లర్ల చుట్టూ గోడలు కడుతున్నారు. సమీపంలోని కొంత ఖాళీ స్థలాన్ని సైతం ఆక్రమించి గదులు కట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. రాత్రికి రాత్రే దర్శనమిస్తున్న నిర్మాణాలతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు. ఇక్కడ ఆక్రమణల్లో ఉన్న భూమి విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని అంచనా. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే భూమి మొత్తం ఆక్రమిస్తారని, ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నోటీసులు ఇస్తాం.. ఈ విషయమై తహసీల్దారు మురళీమోహన్ వద్ద ప్రస్తావించగా బస్‌షెల్టర్ అక్రమ నిర్మాణం విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇప్పటికే ఆర్ఐ, సర్వేయర్లును పంపించి సర్వే చేయించామని చెప్పారు. ఆ స్థలం మేజర్ పంచాయతీ పరిధిలోకి వస్తుందన్నారు. పంచాయతీ అధికారుల ద్వారా సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. ఇవి కూడా చదవండి: మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ! -
ఏకంగా బస్‌షెల్టర్‌నే మాయం చేశారు
శివాజీనగర: ఇనుప వంతెనలు, భారీ వస్తు సామగ్రిని మాయం చేస్తున్న దొంగల కళ్లు..ఇప్పుడు బస్ షెల్టర్‌పై పడ్డాయి. బెంగళూరు నగరం నడిబొడ్డున నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న సిటీ బస్ షెల్టర్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఒక ప్రైవేటు సంస్థ విరాళంగా అందజేసిన రూ.10 లక్షలతో స్థానిక కన్నింగ్హం రోడ్డులో బెంగళూరు మెట్రో సిటీ బస్ సంస్థ (బీఎంటీసీ) ఏడాదిన్నర క్రితం స్టీల్, ఇనుప రాడ్లు, షీట్లతో బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసింది. కొన్నిరోజులుగా అక్కడ బస్సు షెల్టర్ స్థానం ఖాళీగా కనిపిస్తుండటంతో అధికారులే తొలగించి ఉంటారని స్థానికులు భావించారు. సదరు ప్రైవేటు సంస్థకు విషయం తెలిసి కార్పొరేషన్ అధికారులను ఆరా తీశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు వారం క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
ఇక్కడ బస్టాప్ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు!
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులే కాదు.. బస్టాపులు కూడా ఉన్నపళంగా మాయమవుతున్నాయి. ఇప్పుడు ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు, ఫ్లైవర్ నిర్మాణ పనుల కారణంగా నగరంలో ప్రజారవాణా స్వరూపం పూర్తిగా మారిపోయింది. గ్రేటర్లో సుమారు 1,050 రూట్లలో బస్సులను నిలిపి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు గతంలో 2,550కుపైగా బస్టాపులు ఉండేవి. విస్తరిస్తున్న మహానగర అవసరాలను దృష్టిలో ఉంచుకొంటే వీటి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. రోజురోజుకూ కొత్త కాలనీలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో సిటీ బస్సులు, బస్టాపులు పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వాటి సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గిపోవడం గమనార్హం. గత రెండేళ్లలో సుమారు 850కిపైగా బస్టాపులను తొలగించినట్లు అంచనా. మరోవైపు కొన్ని రూట్లలో షెల్టర్లు ఉన్న చోట డ్రైవర్లు బస్సులు నిలపడంలేదు. అభివృద్ధి పనుల దృష్ట్యా మార్పులు అనివార్యమే. కానీ.. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండానే బస్టాపులను తొలగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు నిలిపే స్థలాలు తెలియకపోవడంతో గందరగోళం నెలకొంటోంది. మచ్చుకు కొన్ని ప్రాంతాలు.. ► వీఎస్టీ నుంచి ఇందిరా పార్కు వరకు సిటీ బస్సులు నిలిపేందుకు ఆరు చోట్ల బస్టాపులు ఉన్నాయి. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం, జియాగూడ, దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులు, సికింద్రాబాద్ నుంచి కోఠీకి ఈ రూట్లో బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో కొంతకాలంగా జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో బస్టాపులు ఉనికిని కోల్పోయాయి. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఒకప్పుడు వీఎస్టీ బస్టాపులో పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అక్కడ ప్రయాణికులు కనిపించడం లేదు. ►లక్డీకాపూల్ ఒకప్పుడు అతిపెద్ద బస్టాపు. నగరం నలువైపుల నుంచి బస్సులు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండేది. మెట్రో రైలు కోసం బస్టాపులను తొలగించారు. ఒక్క లక్డీకాఫూల్ మాత్రమే కాదు. మాసాబ్‌ట్యాంక్, విజయ్‌నగర్ కాలనీ, ఎన్ఎండీసీ బస్టాపులు కూడా మాయమయ్యాయి. ►హబ్సిగూడ స్ట్రీట్ నంబర్– 8 వద్ద ఒక బస్టాపు ఉండేది. ఇప్పుడు అక్కడ మెట్రో స్టేషన్ వచి్చంది. దీంతో ఆ ఇరుకు రోడ్డుపైనే బస్సులు నిలపడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ► ఫ్లై ఓవర్ రాకతో ఎల్బీనగర్ స్వరూపం మారింది, చాలా చోట్ల బస్టాపుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూపార్కు వద్ద ప్రస్తుతం ఫ్లై ఓవర్ పనులను చేపట్టారు. దీంతో ఆ రూట్ లో బస్సులకు బ్రేక్ పడింది. కానీ అదేసమయంలో ప్రైవేట్ వాహనాలకు ఇప్పుడు బహదూర్‌పురా చౌరస్తా ఒక ప్రధాన అడ్డాగా మారింది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్వీసుల్లోనూ కోత... బస్టాపుల తీరు ఇలా ఉంటే.. సిటీ బస్సుల సేవలు కూడా అందుకు తగినవిధంగానే ఉన్నాయి. వందలకొద్దీ రూట్లలో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలకు, గ్రామాలకు రాకపోకలు సాగించే సుమారు 5 వేలకుపైగా ట్రిప్పులను రద్దు చేశారు. ►షాద్‌నగర్, మేడ్చల్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, చేవెళ్ల తదితర ప్రాంతాల వైపు ఉన్న సుమారు 100కు పైగా గ్రామాలకు 70 శాతం సరీ్వసులు రద్దయ్యాయి. ►గతంలో గ్రేటర్లో 3,850 బస్సులు, ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరిగితే ఇప్పుడు వాటి సంఖ్య 2,700 పరిమితమైంది. వివిధ కారణాలతో కనీసం 10 వేలకు పైగా ట్రిప్పులు రద్దయ్యాయి. -
Photo Feature: ఆర్టీసీ వినూత్న ఆలోచన.. నర్సుల నిరసన
ఖమ్మం ఆర్టీసీ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. పాత బస్సును ప్రయాణికులకు బస్ షెల్టర్‌గా మార్చారు. ఊరించి మొహం చాటేసిన వర్షాల కోసం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు వేతన సవరణ కోసం ముంబైలో నర్సులు ఆందోళనబాట పట్టారు. ఇక, మరాఠా రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో ఆందోళన కొనసాగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
ఈ బస్సు ఎక్కడికీ వెళ్లదు.. ఎందుకంటే
సాక్షి, నిర్మల్ చైన్‌గేట్: ఆలోచన ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అంటారు. ఆ మాటలను నిజం చేస్తూ చూపించారు ఆర్టీసీ అధికారులు. బస్సు కోసం ఎదురు చూసే ప్రయాణికులు ఎండలో నిలబడకుండా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ అధికారి వినూత్నంగా ఆలోచించి ఓ బస్సునే తాత్కాలిక షెల్టర్‌గా వినియోగిస్తున్నారు. పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో ఎలాంటి షెడ్లు లేకపోవడంతో అటు వైపు వెళ్లే ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. దీనిని గమనించిన డిపో మేనేజర్ ఆంజనేయులు ఓ బస్సును తాత్కాలిక షెల్టర్‌గా ఏర్పాటు చేయించారు. బస్సును ప్రతిరోజు శానిటైజర్ చేయించి శుభ్రంగా ఉంచుతున్నామని, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామని మేనేజర్ తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులో కూర్చొని కాసేపు సేద తీరుతున్నారు. ( చదవండి: కరీంనగర్లో ఈటల రాజేందర్‌కు నిరసన సెగ ) -
‘అమ్మా’నుషం..!
పెదగొట్టిపాడు(ప్రత్తిపాడు): నవమాసాలు మోసిన కన్నకొడుకే.. కాఠిన్యాన్ని ప్రదర్శించాడు. పేగు తెంచుకుని పుట్టిన పుత్రుడే.. వద్దని వదిలించేసుకున్నాడు. అమ్మ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.. అందరూ ఉన్నా అమ్మను అనాథను చేశాడు.. అర్ధరాత్రి నిశీధిలో బస్‌షెల్టర్‌లో వదిలేసి.. వెళ్లిపోయాడు. అమ్మకు తీరని కడుపు కోతను మిగిల్చాడు.. అమ్మా.. ఆకలి.. ఒక్క ముద్ద పెట్టండో.. ఓ కొడుకో .. ఓ కొడుకో.. అంటూ కాలే డొక్కతో.. కడుపు చించుకుని అరుస్తూ.. నడవలేక రోడ్డుపైకి ఈడ్చుకుంటూ వచ్చిన ఆ మృదుసలి అమ్మను చూసి చుట్టుపక్కల వారు చలించిపోయారు. అందరూ ఉండి అనాథ అయిన అమ్మకు చీరెను కట్టారు. తలో ముద్ద అన్నం పెడుతున్న హృదయ విదారక ఘటన ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో చోటుచేసుకుంది. తన పేరు మల్లమ్మ అని స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం అని. నరసరావుపేటలో టీ దుకాణం నడిపే మూడో కొడుకు దగ్గర ఉంటున్నానని, నాలుగు రోజుల కిందట నన్ను అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్లిపోయాడని ఆ వృద్ధురాలు భోరున విలపిస్తూ చెబుతోంది. ఆకలేస్తోంది కొడుకా.. నాకేం వద్దు ఒక్క ముద్ద అన్నం పెట్టు చాలూ.. అంటూ ఆమె అడుగుతున్న తీరు అందరికీ కంట నీరు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. చలికి వణుకుతోంది. -
టీడీపీ హయాంలో లక్షల ప్రజాధనం దుర్వినియోగం
నెల్లూరు సిటీ: రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఏసీ బస్ షెల్టర్లు మట్టి కొట్టుకుపోతున్నాయి. ప్రారంభించకుండానే నిరుపయోగంగా వదిలేయడంతో వీటిలో ఏర్పాటు చేసిన ఏసీలు దొంగల పాలయ్యాయి. టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసింది. అనవసర ఖర్చులకు వినియోగించి దుర్వినియోగం చేసింది. ప్రజలకు అవసరమైన కనీస అవసరాలను పక్కన పెట్టి టీడీపీ నేతలకు కాంట్రాక్ట్ పనుల పేరుతో రూ.లక్షల దోచి పెట్టింది. నగరంలో ప్రధాన రహదారిలో ప్రయాణికులు వేచి ఉండేందుకు పలు చోట్ల హైటెక్ ప్రభుత్వమని చెప్పుకునే విధంగా ఏసీ బస్ షెల్టర్లు నిర్మించింది. ఒక్కొక్క బస్ షెల్టర్ నిర్మాణానికి, ఏసీ ఏర్పాటుకు రూ.6.50 లక్షలు కేటాయించింది. నగరంలోని గాంధీబొమ్మ, ఎంజీబీ, ప్రభుత్వ హాస్పిటల్, కరెంట్ ఆఫీసు, అన్నమయ్య సర్కి ల్, వీఆర్సీసెంటర్ ఇలా ఆరు ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటుకు నగర పాలక సంస్థ ఖజానా నుంచి రూ.39 లక్షలు ఖర్చు చేశారు. నగరంలో పలు చోట్ల సాధారణ బస్షెల్టర్లు ఉన్నాయి. ఆయా బస్షెల్టర్లలో కనీసం కూర్చొనేందుకు కూడా బండలు కానీ, ఇనుప కుర్చీలు కానీ లేవు. ఇప్పటికే వాటిలో కొన్ని శిథిలావస్థలో ఉంటే. మరికొన్ని చోట్ల అందులో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొన్ని యాచకులు, అనాథలకు ఆవాసాలుగా మారాయి. వీటిని పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చి ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉండేది. అవసరమైన మేరకు బస్ షెల్టర్లు ఏర్పాటు చేయకుండా టీడీపీ గొప్ప కోసం దుబారా ఖర్చులు పెట్టి ఏసీ బస్షెల్టర్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజరాజేశ్వరి ఆలయ సమీపంలో ఉన్న బస్ షెల్టర్ లోపలి దుస్థితి మూడు ఏసీలు మాయం ఏసీ బస్షెల్టర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో బస్‌షెల్టర్‌లో మూడు ఏసీలు దొంగతనానికి గురయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఏసీలను దొంగిలించారు. దీంతో కార్పొరేషన్ అధికారులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఏసీలు చోరీకి గురయ్యాయా?, ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లే ఎత్తుకెళ్లారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు చొరవ తీసుకుని విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. మెయింటెనెన్స్ ఏదీ? నగరంలో ఆరు చోట్ల ఏసీ బస్షెల్టర్లు ఏర్పాటు చేసి, ఏసీలు కూడా బిగించారు. కానీ వీటి పర్యవేక్షణకు ఎవరిని నియమించలేదు. వీటిల్లో ఎవరు పడితే వారు వచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. 24 గంటలు ఏసీ నడి స్తే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అందరికీ తెలిసిందే. ఏసీలకు అంతంత కరెంట్ బిల్లు వస్తే కార్పొరేషనే భరించాల్సి ఉంది. మెయింటెనెన్స్‌కు ఇద్దరు, ముగ్గురు పర్యవేక్షులకు నియమించాల్సి ఉంది. వీరి జీతాలు భారం కూడా నగరపాలక సంస్థపై పడుతుంది. ఇలా అర్థం పర్థం లేకుండా గొప్పల కోసం టీడీపీ హయాంలో రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేసింది. వాస్తవంగా షెల్టర్ నిర్మాణానికి మంజూరు చేసిన నిధులు కూడా ఎక్కువే అని, టీడీపీ నేతలకు దోచిపెట్టడానికి అంచనాలు ఎక్కువ వేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. -
బస్‌షెల్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఇంద్రియాల (భూదాన్‌పోచంపల్లి) : మండలంలోని ఇంద్రియాలలో ఆదివారం రూ.2లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కొప్పుల దామోదర్‌రెడ్డి స్మారక బస్‌షెల్టర్ నిర్మాణ పనులకు సర్పంచ్ బండి కృష్ణగౌడ్ ప్రారంభించారు. ఈ షెల్టర్ నిర్మాణానికి కొప్పుల దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొప్పుల లింగారెడ్డి, ఎంపీటీసీ సంతోష్‌కుమార్, చింతల రామకృష్ణ, జగతి, గరిసె జంగయ్య, శ్రీశైలం, బద్దం రాజేశ్వర్, జంగారెడ్డి, వెంకటేశ్, శంకర్, మధు, గోవర్ధన్ పాల్గొన్నారు. -
బస్షెల్టర్లు కోరుతూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: మండే ఎండల్లో బస్ షెల్టర్లు లేక సిటీ బస్సుల కోసం నగరవాసులు పడుతున్న ఇబ్బందులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు సోమరాజు బుధవారం దీన్ని దాఖలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అమీర్‌పేట, పంజాగుట్ట, నిమ్స్ స్టేజీలలో షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. బస్ షెల్టర్ల ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
కట్టారు.. మరిచారు!!
అక్కరకు రాని చుట్టము.. అన్నట్లు జిల్లాలోని ఊట్కూర్ మండలకేంద్రానికి సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్టాండ్.. పదిహేనేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఆర్టీసీ అధికారుల నిర్లక్షం, ప్రజా ప్రతినిధుల అలసత్వంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాంగణంతో ప్రయాణీకులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. అయితే గ్రామానికి అరకిలోమీటర్ దూరంగా నిర్మించడం కూడా ఈ బస్టాండ్ కు మరో శాపం. రూ. 7.5 లక్షల వ్యయంతో తలపెట్టిన ఈ బస్టాండ్ నిర్మాణానికి నాటి మంత్రి, దివంగత ఎల్కోటి ఎల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయినా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగలేదు. దీంతో ప్రభుత్వ వాహనాలను అక్కడ నిలపడంలేదు. ప్రస్తుతం ఆ ప్రాంగణం బొగ్గు బట్టీ కార్మికులకు ఆవాసంగా మారింది. పాతబస్టాండ్ వద్ద ప్రయాణీకులు ఉండేందుకు కనీసం షెల్టర్‌ను ఏర్పాటు చేసి కొత్త బస్టాండ్ మీదుగా బస్సులు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ప్రయాణీకులు వేడుకుంటున్నారు. -
క్రీనీడ
ఎన్నికల నగారా మోగింది. పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేతలు తమను గెలిపిస్తే ప్రజలకెన్నో చేస్తామని చెప్పుకొనేందుకు సిద్ధమవుతున్నారు. హామీలు గుప్పించి ప్రజలను ఆకట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు స్క్రిప్టులు తయారు చేసుకుంటున్నారు. కానీ.. పాత హామీల సంగతేంటి? నగరవ్యాప్తంగా పలు సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది.. బస్షెల్టర్ల నిర్మాణం. ఈ నేతల ఆదేశాల వల్లే ప్రజల కోసం ఏర్పాటు చేయాలనుకున్న బస్‌షెల్టర్లకు ఏడాది కాలంగా గ్రహణం పట్టింది. వారి ఆజ్ఞల వల్లే వేయాలనుకున్న ప్రాంతాల్లో బస్షెల్టర్లు వేయలేకపోయారు. ఫలితంగా ఎంతో కాలంగా ప్రజలు సకాలంలో రాని బస్సుల కోసం ఎదురు చూస్తూ.. ఎండలకు ఎండి వానలకు తడిచారు. రాజకీయ జోక్యంతో ఏర్పాటు కాకుండా పోయిన బస్ షెల్టర్ల గ్రహణం కథ ఇదీ..! ఆర్టీసీ అంచనాల మేరకు నగర ప్రయాణికులకు దాదాపు రెండువేల బస్షెల్టర్లు అవసరం. అందులో సగం మాత్రమే ఉన్నాయి. వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు 558 బస్షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు ఏడాది క్రితం జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. ఐదు ప్యాకేజీలుగా ఈ టెండర్లను పిలవగా.. వాటిలో రెండు ప్యాకేజీలకు సరైన టెండర్లే రాలేదు. మిగతా మూడు ప్యాకేజీల్లో 330 బస్షెల్టర్ల ఏర్పాటుకు అర్హత పొందిన కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. టెండరు పొందిన సంస్థ పది నెలల్లోగా సదరు షెల్టర్లు ఏర్పాటు చేయాలి. కానీ.. దాదాపు వంద ప్రాంతాల్లో షెల్టర్ల ఏర్పాటకు తగిన స్థలాన్ని జీహెచ్ఎంసీ ఇంతవరకూ కాంట్రాక్టు సంస్థకు అప్పగించలేకపోయింది. అందుకు పలు కారణాలుండగా.. వాటిలో రాజకీయ ఒత్తిళ్లదే ప్రథమస్థానం. ఆయా ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు తమ సంస్థల ఎదుట షెల్టర్లకు ససేమిరా అనగా, వారికి వత్తాసు పలుకుతూ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. అడ్డుకునేందుకు ఆదేశాలు జారీ చేసిన వారిలో కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రుల స్థాయి నేతల వరకు ఉన్నారు. వారికి ఎదురు చెప్పలేని జీహెచ్ఎంసీ చేష్టలుడిగి చూడటం మినహా ఏమీ చేయలేకపోయింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన జీహెచ్ఎంసీ.. ఈ సీజన్లోనైనా వాటి ఏర్పాటుకు పూనుకుంటే ఫలితముంటుందేమో.. ఎన్నికల కోడ్లోనైనా షెల్టర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సదుపాయం కలుగుతుంది. వచ్చే వేసవిలో కాసింత నీడ దొరుకుతుంది. అధికారులు ఆ దిశగా ఆలోచించాల్సి ఉంది. పేరుకే గొప్ప.. ‘గ్రేటర్’లో ప్రతి రోజు 3800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సులు 13 వందల రూట్లలో, రోజుకు 42 వేల ట్రిప్పుల చొప్పున తిరుగుతున్నాయి. 32 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ గణాంకాలను చూపి గొప్పలు చెప్పుకొంటున్న ఆర్టీసీ కానీ.. మెరుగైన సేవలందిస్తామంటున్న జీహెచ్ఎంసీ కానీ.. సగటు ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాజకీయ ప్రాబల్యానికి తలొగ్గి బస్టాపుల నిర్మాణాన్ని గాలికొదిలేశాయి. ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు ఇదే దుస్థితి. ఇప్పటికే ఉన్న బస్టాపుల్లోనూ ప్రజలకు ఉపయోగపడుతున్నవి తక్కువే. ప్రకటనల ద్వారా లాభాలార్జించే యాడ్ఏజెన్సీల కోసం ఏర్పాటు చేసినవే ఎక్కువ. మరికొన్ని చిరువ్యాపారుల అడ్డాలుగా మారాయి. ఇంకొన్ని యాచకుల కేంద్రాలుగా మారాయి. ప్రజలు వినియోగించుకుంటున్నవి సైతం సదుపాయంగా లేవు. రాత్రివేళల్లో దీపాల్లేనివి.. కూర్చునేందుకు కుర్చీలు లేనివి.. పేరుకే బస్‌షెల్టర్‌గా మారినవి.. వీటిలో ఉన్నాయి. -
నీడ కరువు
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం పంచాయతీ పరిధి ఖడ్గవలస జంక్షన్లో పదేళ్ల కిందట నిర్మించిన బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరింది. దీంతో ప్రయాణికులు ఆ జంక్షన్లో ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షెల్టర్ ముందు స్థానిక వ్యాపారులు షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో బస్‌షెల్టర్ ఎవరికీ కనిపించడం లేదు. ప్రయాణికులు వాహనాల కోసం వేచి ఉండేందుకు నీడ కరువు కావడంతో పాటు ఎక్కడా స్థలం లేకపోవడంతో దుకాణాల వద్ద నిల్చుంటున్నారు. షెల్టర్‌ను పునర్నిర్మించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షెల్టర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.