నెల్లూరు సిటీ: రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఏసీ బస్ షెల్టర్లు మట్టి కొట్టుకుపోతున్నాయి. ప్రారంభించకుండానే నిరుపయోగంగా వదిలేయడంతో వీటిలో ఏర్పాటు చేసిన ఏసీలు దొంగల పాలయ్యాయి. టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసింది. అనవసర ఖర్చులకు వినియోగించి దుర్వినియోగం చేసింది. ప్రజలకు అవసరమైన కనీస అవసరాలను పక్కన పెట్టి టీడీపీ నేతలకు కాంట్రాక్ట్ పనుల పేరుతో రూ.లక్షల దోచి పెట్టింది. నగరంలో ప్రధాన రహదారిలో ప్రయాణికులు వేచి ఉండేందుకు పలు చోట్ల హైటెక్ ప్రభుత్వమని చెప్పుకునే విధంగా ఏసీ బస్ షెల్టర్లు నిర్మించింది. ఒక్కొక్క బస్ షెల్టర్ నిర్మాణానికి, ఏసీ ఏర్పాటుకు రూ.6.50 లక్షలు కేటాయించింది. నగరంలోని గాంధీబొమ్మ, ఎంజీబీ, ప్రభుత్వ హాస్పిటల్, కరెంట్ ఆఫీసు, అన్నమయ్య సర్కి ల్, వీఆర్సీసెంటర్ ఇలా ఆరు ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్‌లు ఏర్పాటుకు నగర పాలక సంస్థ ఖజానా నుంచి రూ.39 లక్షలు ఖర్చు చేశారు. నగరంలో పలు చోట్ల సాధారణ బస్‌షెల్టర్లు ఉన్నాయి. ఆయా బస్‌షెల్టర్లలో కనీసం కూర్చొనేందుకు కూడా బండలు కానీ, ఇనుప కుర్చీలు కానీ లేవు. ఇప్పటికే వాటిలో కొన్ని శిథిలావస్థలో ఉంటే. మరికొన్ని చోట్ల అందులో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొన్ని యాచకులు, అనాథలకు ఆవాసాలుగా మారాయి. వీటిని పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చి ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉండేది. అవసరమైన మేరకు బస్ షెల్టర్‌లు ఏర్పాటు చేయకుండా టీడీపీ గొప్ప కోసం దుబారా ఖర్చులు పెట్టి ఏసీ బస్షెల్టర్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
రాజరాజేశ్వరి ఆలయ సమీపంలో ఉన్న బస్ షెల్టర్ లోపలి దుస్థితి
మూడు ఏసీలు మాయం
ఏసీ బస్షెల్టర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో బస్‌షెల్టర్‌లో మూడు ఏసీలు దొంగతనానికి గురయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఏసీలను దొంగిలించారు. దీంతో కార్పొరేషన్ అధికారులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఏసీలు చోరీకి గురయ్యాయా?, ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లే ఎత్తుకెళ్లారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు చొరవ తీసుకుని విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
మెయింటెనెన్స్ ఏదీ?
నగరంలో ఆరు చోట్ల ఏసీ బస్షెల్టర్లు ఏర్పాటు చేసి, ఏసీలు కూడా బిగించారు. కానీ వీటి పర్యవేక్షణకు ఎవరిని నియమించలేదు. వీటిల్లో ఎవరు పడితే వారు వచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. 24 గంటలు ఏసీ నడి స్తే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అందరికీ తెలిసిందే. ఏసీలకు అంతంత కరెంట్ బిల్లు వస్తే కార్పొరేషనే భరించాల్సి ఉంది. మెయింటెనెన్స్‌కు ఇద్దరు, ముగ్గురు పర్యవేక్షులకు నియమించాల్సి ఉంది. వీరి జీతాలు భారం కూడా నగరపాలక సంస్థపై పడుతుంది. ఇలా అర్థం పర్థం లేకుండా గొప్పల కోసం టీడీపీ హయాంలో రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేసింది. వాస్తవంగా షెల్టర్ నిర్మాణానికి మంజూరు చేసిన నిధులు కూడా ఎక్కువే అని, టీడీపీ నేతలకు దోచిపెట్టడానికి అంచనాలు ఎక్కువ వేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment