![Local to Global Photo Feature in Telugu: Bus Shelter, Khammam, Books Sale Koti, Nureses Protest - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/23/Bus_Shelter_Nurses_Protest.jpg.webp?itok=40qn4LXh)
ఖమ్మం ఆర్టీసీ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. పాత బస్సును ప్రయాణికులకు బస్ షెల్టర్‌గా మార్చారు. ఊరించి మొహం చాటేసిన వర్షాల కోసం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు వేతన సవరణ కోసం ముంబైలో నర్సులు ఆందోళనబాట పట్టారు. ఇక, మరాఠా రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో ఆందోళన కొనసాగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి.
![1](/gallery_images/2021/06/23/Araka_Buffalo_Adilabad.jpg)
ఏటా ట్రాక్టర్లతో దున్నకం పనులు నిర్వహించే రైతు ఈసారి కొత్త పంథా అనుసరించాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడకు చెందిన మీర్జా యూసుఫ్‌బేగ్‌కు నాలుగెకరాల పొలం ఉంది. ఎడ్లు లేకపోవడంతో ప్రతి సంవత్సరం ట్రాక్టర్‌తో దున్ని కూలీలతో వ్యవసాయ పనులు చేయిస్తాడు. ఈసారి తన వద్ద ఉన్న దున్నపోతుకు వారం రోజులు శిక్షణ ఇచ్చాడు. మంగళవారం దున్నపోతుతో అరక కట్టి పత్తి పంటలో కలుపు తీత పనులు చేశాడు.
![2](/gallery_images/2021/06/23/Bike_Yatra_Nirmal.jpg)
19 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డు కోసం నిర్మల్ పట్టణానికి చెందిన సాయి, వినయ్, శ్రీను, భద్రాచలానికి చెందిన సి.నాయుడు, మచిలీపట్నానికి చెందిన గణేష్, ప్రసాద్, రాజమండ్రికి చెందిన ఐదుగురు సభ్యులు బైకులపై నిర్మల్ నుంచి కశ్మీర్ వరకు ప్రయాణించి, అక్కడి నుం చి కన్యాకుమారికి 45 రోజుల్లో 11,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.
![3](/gallery_images/2021/06/23/Bus_Shelter_Khammam.jpg)
ప్రయాణికుల సౌకర్యార్థం బస్సే..షెల్టర్‌గా మారింది. ఖమ్మం నగరం నుంచి ఇల్లెందు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్‌షెల్టర్ లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు ఓ బస్‌ను ఇలా ఉంచి.. తాత్కాలిక బస్ షెల్టర్ అంటూ ఫ్లెక్సీ కట్టారు. – సాక్షి ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం
![4](/gallery_images/2021/06/23/Achampet-Prayer_Rain.jpg)
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ తల్లిదండ్రులు వర్షం రాక కోసం ఎదురుచూస్తుండటం చూసి మంగళవారం కొంతమంది చిన్నారులు, యువకులు గ్రామ సమీపంలోని పెద్దబండపై వరదపాశం పోశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో వర్షం కోసం పూజలు చేశారు. కప్పకావడితో ఊరంతా తిరిగారు. పోగైన డబ్బులతో వరదపాశం తయారుచేశారు. అనంతరం పెద్దబండపై పోసి ఆరగించారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని వారి నమ్మకం. – అచ్చంపేట రూరల్
![5](/gallery_images/2021/06/23/Books_Sale_Koti.jpg)
విద్యాసంస్థలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అబిడ్స్ – కోఠి మార్గంలో పుస్తకాల దుకాణాలకు కళొచ్చింది. విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేస్తూ కనిపించారు. మంగళవారం కోఠిలో నెలకొన్న సందడి ఇది.
![6](/gallery_images/2021/06/23/Siddhipet-Child_Care.jpg)
సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌లో చైల్డ్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులతోపాటు, కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం పిల్లలతో వచ్చే తల్లులకు సైతం ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల కోసం ప్రత్యేక గది, ఆడుకోవడానికి గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు. మహిళా ఉద్యోగుల పిల్లలను బేబీ కేర్‌కు పంపించకుండా విధులు నిర్వర్తిస్తూ వారిని చూసుకునేలా సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లలోపు పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీ, ఆటలు, పాటలు నేర్పించేందుకు అంగన్‌వాడీ టీచర్‌ను సైతం నియమించనున్నారు.
![7](/gallery_images/2021/06/23/Nurses_Protest_Mumbai.jpg)
ఏడో వేతన సవరణ కమిషన్ నివేదికలు అమలు చేయాలని మంగళవారం ముంబైలోని జేజే ఆస్పత్రిలో ధర్నా చేస్తున్న నర్సులు
![8](/gallery_images/2021/06/23/Vaccination_Mumbai.jpg)
ముంబైలోని కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌లో మంగళవారం టీకా వేయించుకోవడానికి ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
![9](/gallery_images/2021/06/23/Maratha_Protest.jpg)
రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ షోలాపూర్‌లో గుండు గీయించుకొని నిరసన తెలుపుతున్న రాష్ట్రీయ ఛవా సంఘటన సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment